ఆరోగ్యకరమైన జీవనశైలితో హార్ట్ ఎటాక్‌లకు చెక్!

30 Aug, 2016 23:22 IST|Sakshi
ఆరోగ్యకరమైన జీవనశైలితో హార్ట్ ఎటాక్‌లకు చెక్!

కార్డియాలజీ కౌన్సెలింగ్

నా వయసు 21 ఏళ్లు. డిగ్రీ పూర్తి చేసి ఈమధ్యే కొత్తగా మార్కెటింగ్ ఉద్యోగంలో చేరాను. గత కొన్ని రోజుల నుంచి నన్ను ఒక అంశం అస్తమానం కలచివేస్తోంది. రెండు నెలల క్రితం మా నాన్నగారు తీవ్రమైన గుండెపోటుతో మృతిచెందారు. నా చిన్నప్పుడు మా తాతగారు కూడా ఇలాగే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. ఇలా వీళ్లిద్దరూ ఒకే కారణంతో చనిపోవడంతో నాలో కాస్త భయం చోటుచేసుకుంది. షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ లాంటి వ్యాధులకు హెరిడిటీ (వంశపారంపర్యంగా రావడం) ఒక కారణమంటారు. నాకు భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే దయచేసి దాని నివారణకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వగలరు.  - కౌశిక్, హైదరాబాద్
గుండెపోటుకు అనేక కారణాలున్నాయి. అందులో హెరిడిటీ లేదా జీన్స్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. కానీ అదొక్కటే కారణం కాదు. మీరు సరైన ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పరచుకోవడం ద్వారా మీ గుండెకు సంపూర్ణ రక్షణ ఇవ్వవచ్చు. సాధారణంగా గుండెకు రక్తసరఫరా నిలిచిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో (ధమనుల్లో) కొవ్వు, కొలెస్ట్రాల్ తదితర పదార్థాలు పేరుకుపోయి రక్తసరఫరా మార్గం క్రమేపీ మూసుకుపోతుంది. దీనివల్ల రక్తసరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి శరీరానికి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలమవుతుంది. రక్తంలో ఎల్‌డీఎల్, హై బ్లడ్‌ప్రెషర్, రక్తంలో పరిమితికి మించిన చక్కెర శాతం లాంటివి హానికరమైన కొవ్వు పదార్థాలు. ఇవి ప్రమాదకరస్థాయికి చేరితే గుండెపోటు వస్తుంది. అలాగే జీవనశైలిలో మార్పులు, కూర్చున్నచోట నుంచి కదలని ఉద్యోగం, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, పొగతాగడం, మద్యం అలవాటు, జంక్‌ఫుడ్స్, మానసిక ఒత్తిడి లాంటి అలవాట్ల వల్ల రక్తనాళాలు మూసుకుపోయి గుండెకు చేటు వాటిల్లుతుంది. మీరు అనుకుంటున్నట్లుగా హెరిడిటీ, జీన్స్ కంటే కూడా హానికరమైన అలవాట్ల వల్ల ఎక్కువ శాతం గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

ఒకవేళ మీరు పైన చెప్పిన అలవాట్లు కలిగి ఉంటే హెరిడిటీ, జీన్స్‌తో సంబంధం లేకుండా కూడా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వల్ల హార్ట్ ఎటాక్‌ను నివారించవచ్చు. ముఖ్యంగా షుగర్, హైబీపీ, కొలెస్ట్రాల్‌తో జాగ్రత్తగా ఉండాలి. వీటిబారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రోజులో కనీసం అరగంట పాటు వాకింగ్ చేయడం, తాజా పండ్లు, కూరగాయలతో కూడిన సంపూర్ణ ఆహారం తీసుకోవడం వంటివి చేయాలి. దురలవాట్లకు దూరంగా ఉండటంతో పాటు అవసరాన్ని బట్టి, డాక్టర్ సూచనలను బట్టి తగిన వ్యవధిలో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌కు సంబంధించిన టెస్ట్‌లు చేయించుకొని వ్యాయామం చేయడం మేలు. మీరు ఎలాంటి టెన్షన్లూ పెట్టుకోకుండా ఈ సూచనలు, సలహాలు పాటిస్తే కచ్చితంగా ఎలాంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులూ రావు.

డాక్టర్ రవికాంత్ 
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్

 

 

ఐబీఎస్ అంటే..?
హోమియో కౌన్సెలింగ్

నా వయసు 29 ఏళ్లు. అప్పుడప్పుడూ తిన్న వెంటనే కడుపు ఉబ్బినట్లుగా ఉండి తేన్పులు వచ్చి, మల విసర్జనకు వెళ్లవలసి వస్తోంది. ఈ సమయంలో నొప్పి కూడా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రతిస్తే అన్ని పరీక్షలు చేసి, ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు. దీని గురించి నాకు సరైన అవగాహన లేదు. దయచేసి నాకు హోమియోలో శాశ్వత పరిష్కారం చెప్పగలరు.  - నరేశ్‌కుమార్, అమలాపురం
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనేది జీర్ణమండలానికి సంబంధించిన వ్యాధి. మనం ఆహారం తీసుకున్న తర్వాత అది నోరు, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు ద్వారా ప్రయాణం చేస్తుంది. ఈ ప్రక్రియలో పచన క్రియ (ఆహారాన్ని జీర్ణం చేయడం) చివరలో మల విసర్జన క్రియ జరుగుతుంది. మనం భోజనం చేసిన తర్వాత ఆహారం జీర్ణాశయం వదిలి పేగుల్లోకి వెళ్లడానికి సుమారు ఆరు గంటల సమయం పడుతుంది. ఆహారం పేగుల్లోకి ప్రయాణం చేస్తున్నప్పుడు పేగుల కదలికల్లో తేడా వస్తే రకరకాల సమస్యలు తలెత్తుతాయి. వాటిల్లో ఐబీఎస్ చాలా సాధారణమైన సమస్య.


కారణాలు : ఈ సమస్యకు కచ్చితమైన కారణం అంటూ ఏమీ లేదు. కానీ అంతర్గత, బాహ్య అంశాల ప్రేరణ వల్ల పేగుల కదిలికలలో తేడాలు రావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. చిన్నపేగు, పెద్ద పేగు కదలికలను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిల్లో ముఖ్యమైనవి మానసిక ఒత్తిడి, మాదక ద్రవ్యాలు ఎక్కువగా తీసుకోవడం, ఆహారంలోని లోటుపాట్లు, హార్మోన్ల అసమతుల్యత, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు.

 
లక్షణాలు :  పేగుల కదలికలను బట్టి లక్షణాలు కనిపిస్తాయి.  పేగుల కదలికలు త్వరత్వరగా జరిగితే విరేచనాలు అవుతాయి కదలికలు నెమ్మదిగా ఉంటే మలబద్దకం ఉంటుంది  ఒక్కోసారి ఈ కదలికలకు నొప్పి కూడా కలుగుతుంది  ఎక్కువ ఆందోళన పడినప్పుడు కూడా విరేచనాలు కలగవచ్చు ఐబీఎస్ లక్షణాలైన మలబద్దకం, అతిసారం, నొప్పి ఎప్పుడూ ఉండవు. కానీ వస్తూపోతూ ఉంటాయి.  కొందరిలో ఇవే కాకుండా పొట్ట ఉబ్బడం కూడా కనిపిస్తుంటుంది. ఈ లక్షణాలు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆలోచనలను బట్టి వ్యక్తి వ్యక్తికీ మారుతూ ఉంటాయి.

 
నిర్ధారణ:  ఐబీఎస్ ఉన్న వ్యక్తులకు రక్తం, మలం వంటివి పరీక్షించినా సాధారణంగా ఏ దోషాలూ కనిపించవు. అంతేకాకుండా పేగులలో కూడా ఎలాంటి తేడా కనిపించదు. పేగుల కదలికల్లో మాత్రమే తేడా కనిపిస్తుంది. అందువల్ల ఈ ఐబీఎస్‌కు చికిత్స చేయడంలో రోగి మానసిక, శారీరక లక్షణాలనూ, వారి జీవనశైలి, ఆహారపుటలవాట్లు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటారు.

 
రకాలు : ముఖ్యంగా ఈ ఐబీఎస్ రెండు రకాలుగా ఉంటుంది. కొందరిలో విరేచనాలు ఎక్కువగా కావడం గానీ లేదా మలబద్దకంతో ఉండి, మలంలో జిగురు కనిపిస్తుంది. మెలిపెట్టినట్లుగా కడుపు నొప్పి ఉండి తేన్పులు, కడుపు ఉబ్బరం, వికారం, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. కొందరిలో విరేచనాలు, మలబద్దకం ఉంటాయి గానీ నొప్పి ఉండదు. కొందరిలో నిద్ర లేచిన వెంటనే, భోజనం చేసిన వెంటనే మలవిసర్జన అవుతుంది. కానీ తేన్పులు, నొప్పి, కడుపు ఉబ్బరం వంటివి కనిపించవు.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు :  ఎక్కువ పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవాలి.  పొగతాగడం, మాదక ద్రవ్యాల వాడకానికి దూరంగా ఉండాలి  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి  వ్యాయామం చేయాలి  మంచి ఆహారపు అలవాట్లను పాటించాలి  జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

చికిత్స : హోమియోలో కాన్‌స్టిట్యూషన్ థెరపీ ద్వారా వ్యక్తి రోగ లక్షణాలను, మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. దీని ద్వారా రోగ లక్షణాలను, వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పూర్తిగా తగ్గించడం జరుగుతుంది.

డాక్టర్ ఎ.ఎం. రెడ్డి  సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి,  హైదరాబాద్

 

మరిన్ని వార్తలు