గుండెజబ్బులకు జన్యు కారణాలు ఎక్కువే! 

20 Jun, 2019 07:31 IST|Sakshi

గుండెజబ్బులకు జన్యుపరమైన కారణాలు ఉంటాయని చాలాకాలంగా తెలిసినప్పటికీ ఎంతమేరకు అన్న విషయంలో సందిగ్ధత ఉండేది. అమెరికా, జర్మనీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన పుణ్యమా అని ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. గతంలో వేసిన అంచనాల కంటే చాలా ఎక్కువగా అంటే దాదాపు 30 శాతం గుండెజబ్బులకు జన్యువులే కారణమని వీరు తేల్చేవారు. అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన తాజా వివరాల ప్రకారం.. గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడమనే కరోనరీ ఆర్టరీ జబ్బుపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. జన్యువులతో ఈ జబ్బుకు ఉన్న సంబంధాలపై గతంలోనే ఓ దశాబ్ద కాలం పాటు అధ్యయనం జరగ్గా పాతికశాతం జబ్బులు వారసత్వంగా వస్తున్నట్లు తేలింది. అయితే జన్యువులను నియంత్రించే నెట్‌వర్క్‌ల పాత్ర ఏమిటన్నది మాత్రం స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు గుండె కణజాలానికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు. దీన్నిబట్టి దాదాపు 28 నెట్‌వర్క్‌ వ్యవస్థలు కరోనరీ ఆర్టరీ వ్యాధిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమైంది. వీటి ఆధారంగా గుండెజబ్బుల్లో దాదాపు 32 శాతం జన్యు లోపాలు, తేడాల కారణంగా వస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఈ కారణాలన్నీ తెలియడం వల్ల గుండె జబ్బులను తొందరగా గుర్తించేందుకు వీలేర్పడుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త లీ– మింగ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు