కనుగుడ్డు ఫొటోలు చూసి..  గుండె జబ్బులు గుర్తిస్తుంది

21 Feb, 2018 00:20 IST|Sakshi

కృత్రిమ మేధ కొత్త పుంతలు తొక్కుతోంది. గూగూల్‌ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ కేవలం కనుగుడ్ల ఫొటోలను చూడటం ద్వారా మనకు గుండెజబ్బులు ఉన్నాయా? లేదా? అన్నది తేల్చేస్తుంది. కనుగుడ్లలోని నాళాలకు, గుండెజబ్బులకు మధ్య సంబంధం ఉందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేసిన నేపథ్యంలో గూగుల్‌ శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని కాస్తా కృత్రిమ మేధలోకి జొప్పించారు. ఏ వ్యక్తి అయినాసరే.. వచ్చే ఐదేళ్ల కాలంలో హార్ట్‌ అటాక్‌ లేదా గుండెపోటుకు గురయ్యే అవకాశాలను గూగుల్‌ కృత్రిమ మేధ 70 శాతం ఖచ్చితత్వంతో చెప్పగలదని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త లిలి పెంగ్‌ తెలిపారు. గుండెజబ్బులతో బాధపడుతున్న దాదాపు మూడు లక్షల మంది వివరాల ఆధారంగా కృత్రిమ మేధ ఈ అంచనాలను సిద్ధం చేసిందని వివరించారు.

సాధారణ పద్ధతుల్లో గుండెజబ్బుల రిస్క్‌ను అంచనా వేసేందుకు చేసే రక్తపరీక్షలు కూడా తమ ఫలితాలను నిర్ధారించాయని వివరించారు. అయితే ఇది తొలి అడుగు మాత్రమేనని.. మరిన్ని విస్తృతస్థాయి పరిశోధనలు నిర్వహించిన తరువాతగానీ.. ఈ టెక్నాలజీని అందరికి అందుబాటులోకి తేలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాము గుండెజబ్బులకు మాత్రమే పరిమితమైనప్పటికీ భవిష్యత్తులో ఈ రకమైన కృత్రిమ మేధ టెక్నాలజీలు కేన్సర్‌ గుర్తింపు, చికిత్సలోనూ కీలకపాత్ర పోషించే అవకాశం లేకపోలేదన్నారు.   

మరిన్ని వార్తలు