మాంసాహారం తింటే గుండెజబ్బు..?

10 Aug, 2015 23:06 IST|Sakshi

ఆయుర్వేద కౌన్సెలింగ్ వేరికోజ్ వీన్స్‌కు సర్వాంగధార చికిత్స

 నా వయసు 38. నాకు కొన్నేళ్లుగా కాళ్లనొప్పులున్నాయి. అప్పుడప్పుడు మోకాళ్ల నొప్పి,  పాదాల వాపు వస్తోంది. మోకాలు కిందిభాగం నుండి చర్మం నల్లగా మారి, దురద వస్తోంది. గోకితే పుండు పడుతోంది. డాక్టర్ వెరికోజ్ వీన్స్ అని చెప్పారు. వెరికోజ్ అల్సర్స్ కూడా వచ్చిందన్నారు. మందులు వాడుతున్నాను కానీ ఫలితం కనిపించడం లేదు. ఆయుర్వేద వైద్యంలో దీనికి చికిత్స ఉందా? - డి.ఆర్.వి; భీమవరం
వెరికోజ్ వీన్స్ అనేది చెడురక్తాన్ని తీసుకొని వెళ్లే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి. వెరికోజ్ అనే రక్తనాళం పైకి ఉబ్బినట్లుగా ఉండి, మెలికలు తిరిగి, ముడిపడినట్లుగా కనిపిస్తుంది. ఈ లక్షణం మీకు కాలి భాగంలో ఉండవచ్చు. దీనిని ఆయుర్వేదంలో రక్తగత వాతం లేదా సిరాజాల గ్రంథి అని చెప్పారు. ఈ వెరికోజ్ వెయిన్స్ ఎక్కువ సమయం నిల్చుని ఉన్న వాళ్లకి వస్తుంది. ఉదాహరణకు కండక్టర్లు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, వ్యవసాయం చేసేవారిలోనూ, మధ్యవయస్కులలోనూ, ఎక్కువసేపు పరిగెత్తేవారిలోనూ, రిక్షా తొక్కేవారిలోనూ; స్త్రీలలో అయితే గర్భధారణ సమయంలో వస్తుంది.

చికిత్స: ఇది వాతానికి సంబంధించింది కాబట్టి ఆయుర్వేదంలో దీనికి వాతహర చికిత్స చేయవలసి ఉంటుంది. రక్తనాళాల పటుత్వం పెంచడానికి ఆమలకి (ఉసిరికాయ), లశునం (వెల్లుల్లి)తో తయారు చేసిన తైలాన్ని, ముళ్లగోరింట చెట్టుతో తయారు చేసిన తైలాన్నీ వాడుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది.

 పైన చెప్పిన తైలాన్ని రోజుకు 5 నుంచి 6 లీటర్లు తీసుకుని గోరువెచ్చగా చేసి ఒక క్రమపద్ధతిలో శరీరంలో ఎక్కడైతే వెరికోస్ వైన్స్ ఉంటాయో, ఆ భాగంలో పోస్తూ ఉన్నట్లయితే ఆ రక్తనాళం గోడలు పటుత్వంగా ఉండేటట్లు చేయవచ్చు. ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలో దీన్ని సర్వాంగధార అని అంటారు.

పై పద్ధతిలో తైలాన్ని తయారు చేసే ముందు ముళ్లగోరింటచెట్టు; ఉసిరి, వెల్లుల్లి, మునగ ఆకులతో మినుములు, ఉలవలతో తయారు చేసిన పొడితో అపసవ్య మార్గంలో మర్దన చేయాలి. ఇది వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే జరగాలి  పిల్లిపీచర (శతావరీ చూర్ణం)ను వ్యాధి అవస్థను బట్టి తీసుకోవాలి  సహచరాది తైలం, స్వర్ణ మాక్షిక భస్మాన్ని, లశూనాది వటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది  వెరికోజ్ అల్సర్స్‌కు వ్రణశోధన తైలాన్ని, రసోత్తమాది లేపం, జాత్యాదిఘృతాన్ని వాడాల్సి ఉంటుంది.

జాగ్రత్తలు:  ఎక్కువ సమయం నిలబడటం మంచిది కాదు. మలబద్ధకం రాకుండా పీచుపదార్థాలను, ద్రవరూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి  బియ్యపు పిండి, బియ్యం, చక్కెర చాలా తక్కువగా తినడం మంచిది  రైస్ స్థానంలో గోధుమలు, ఓట్స్, రూటిన్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా వాడవలసి ఉంటుంది  శీర్షాసనం, కపాల భాతి వంటి ఆసనాలు సాధన చేయడం మంచిది.
 డాక్టర్ చిట్టేటి వేణుగోపాల్
ఎం.డి. ఆయుర్వేద,  రుషి ప్రోక్త మన ఆయుర్వేద చికిత్సాలయం కే.పి.హెచ్.బి, రోడ్ నం.1, హెదరాబాద్
 
కార్డియాలజీ కౌన్సెలింగ్
మాంసాహారం తింటే గుండెజబ్బు..?
నా వయసు 48. నేను తరచూ మాంసాహారం తీసుకుంటూ ఉంటాను. దీనివల్ల గుండె దెబ్బతింటుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇది నిజమేనా? సలహా ఇవ్వండి.  - శరభయ్య, ఆదిలాబాద్
గుండెజబ్బులకు కొలెస్ట్రాల్ తీవ్రమైన రిస్క్‌ఫ్యాక్టర్. మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్‌లో ఇది ఎక్కువ. కొలెస్ట్రాల్ రెండు రకాలు. గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ అనీ, మేలు చేసేదాన్ని హెచ్‌డీఎల్ అనీ అంటారు. మన రక్తంలో ఎల్‌డీఎల్ 100 కంటే తక్కువగానూ, హెచ్‌డీఎల్ 40 కంటే ఎక్కువగానూ ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరానికి రెండు రకాలుగా అందుతుంది. మొదటిది ఆహారం ద్వారా, రెండోది కాలేయం పనితీరు వల్ల.

శిశువు పుట్టినప్పుడు శరీరంలో 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు, నరాల వ్యవస్థ ఇలా శిశువు పూర్తిగా ఎదగడానికి రెండేళ్ల వయసు వచ్చేవరకు కొలెస్ట్రాల్ ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. రెండేళ్ల తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే వ్యక్తుల్లోని జన్యుతత్వాన్ని బట్టి కూడా మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి లో తేడాలు వస్తుంటాయి. మాంసాహారంతోబాటు... వేపుళ్లు, బేకరీ పదార్థాలు, నెయ్యి లాంటి వాటిని పరిమితికి మించి  తీసుకుంటే ఆహారం కాస్తా కొవ్వుగా మారుతుంది. అది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, దాన్ని అదుపులో ఉంచుకోడానికి మందులు వాడుతుంటే, వాటిని మధ్యలో మానేయకూడదు. మీరు మాంసాహారం మానేయనక్కరలేదు. కానీ కొవ్వులు తక్కువగా ఉండే చికెన్ తీసుకోవచ్చు. అయితే చికెన్ కంటే కూడా చేపలు మరికాస్త మేలైనవి.
 
నా వయసు 38. ఇటీవల మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. నాకు గుండెపోటు రాకుండా నివారించుకునే మార్గాలు చెప్పండి.  - సుదీప్, హైదరాబాద్

గుండెజబ్బులు రాకుండా చూసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనలు ఇవి... 1. బీపీ 120 / 80 దాటకుండా చూసుకోవాలి. 2. మొత్తం కొలెస్ట్రాల్ 150 కంటే తక్కువగా ఉండాలి. 3. ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) 100 కంటే తక్కువగా ఉండాలి. 4. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) 40 కంటే ఎక్కువగా ఉండాలి. 5. బీఎమ్‌ఐ (బరువు కొలమానం సూచిక) 23 కంటే తక్కువగా ఉండాలి. 6. సిగరెట్లు, పొగతాగే అలవాటు పూర్తిగా వదిలేయాలి. 7. వ్యాయామం రోజూ తప్పక 30 నిమిషాల పాటు చేయాలి. 8. కూరగాయలు, తాజాపండ్లు రోజుకు కనీసం మూడుసార్లు (సాధ్యమైనంత ఎక్కువగా) భుజించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తే మీ గుండె ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవితకాలం కూడా పొడిగించుకోవచ్చు.
 
 పల్మునాలజీ కౌన్సెలింగ్
వ్యాయామం చేస్తుంటే ఆయాసం..?
నా వయసు 40. గతంలో నాకు దుమ్ము అంటే సరిపడేది కాదు. (డస్ట్ అలర్జీ ఉండేది). ఇటీవల నేను వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - యాదగిరి, నల్గొండ
 వ్యాయామం ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడుతుంది, తేమపూరితమవుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని

లక్షణాలు కనబడతాయి. అవి...
పొడిదగ్గు  ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం  పిల్లికూతలు వినిపించడం  వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు)  వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 - 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.

అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్‌డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా-2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు.

దీనితోపాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్‌బాల్, వాకింగ్ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్‌బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే వ్యాయామానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
 
డర్మటాలజీ కౌన్సెలింగ్
 కళ్లజోడు ఆనేచోట ముక్కుపై మచ్చలు...
నేను గత కొన్నేళ్లుగా కళ్లజోడు వాడుతున్నాను. నా కళ్లజోడు ఆనే చోట ముక్కు ఇరువైపులా నల్లటి మచ్చలు వచ్చాయి. కొన్ని క్రీములు కూడా వాడి చూశాను. అయితే ఫలితం తాత్కాలికమే. నా ముక్కుకు ఇరువైపుల ఉన్న మచ్చలు తొలగిపోయేదెలా?
 - సుబ్రహ్మణ్యం, విజయవాడ

 కళ్లజోడును ఎప్పుడూ తీయకుండా, నిత్యం వాడేవారికి, ముక్కుపై అది ఆనే చోట ఏర్పడే ఘర్షణ (ఫ్రిక్షన్) వల్ల ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అక్కడి చర్మంలో రంగుమార్చే కణాలు ఉత్పత్తి (పిగ్మెంటేషన్) జరిగి, ఇలా నల్లబారడం మామూలే. కొన్నిసార్లు అలా నల్లబడ్డ చోట దురద కూడా రావచ్చు. మీ సమస్య తొలగడానికి ఈ కింది సూచనలు పాటించండి.వీలైతే కళ్లజోడుకు బదులు కాంటాక్ట్ లెన్స్ వాడండి.కోజిక్ యాసిడ్, లికోరిస్, నికోటినెమైడ్ ఉన్న క్రీమును మచ్చ ఉన్న ప్రాంతంలో రాయండి.అప్పటికీ ఫలితం కనిపించకపోతే మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి.
 
నేను గత పదేళ్లుగా కుడి చేతి వేలికి బంగారపు ఉంగరాన్ని ధరిస్తున్నాను. కానీ గత మూడు నెలల నుంచి ఉంగరం ధరించే చోట చర్మం నల్లబడుతోంది. ఆ ప్రాంతంలో కాస్త దురదగా, మంటగా కూడా ఉంటోంది. దయచేసి ఉంగరం పెట్టుకోవడం మానేయమని సలహా ఇవ్వకుండా, నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
 - పూర్ణిమ, కొత్తగూడెం

ఏదైనా వస్తువుతో మన చర్మం ఆనుకుంటున్నప్పుడు ఏ సమయంలోనైనా అక్కడ ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అనే సమస్య ఎదురుకావచ్చు. బహుశా మీకు కూడా ఇదే సమస్య వచ్చి ఉంటుంది. మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి తగులుతుంటుంది. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటర్జెంట్ తగిలి ఉండేచోట అలర్జీ కనిపిస్తోంది. లేదా మీ ఉంగరంలోని ఇతర లోహాలు (అల్లాయ్స్) వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా అందించవచ్చు.

మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి. మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి. చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి.  మీ ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, అలా కూడా మార్చి చూడవచ్చు. ఈ నాలుగు జాగ్రత్తల తర్వాత కూడా మీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
 

మరిన్ని వార్తలు