పెద్దలూ... తెలుసుకోండి

11 Jun, 2018 01:05 IST|Sakshi

 బయోగ్రఫీ   సరోజినీ దేవి

సమ్మర్‌ వెకేషన్‌ పూర్తయింది... పిల్లలు కొంచెం పెద్దయ్యారు.కొంచెమే పెద్దయ్యి ఉంటారు... కానీ చాలా పెద్దయ్యామని అనుకుంటుంటారు.కొత్త పుస్తకాలు... కొత్త కాలేజీలు... కొత్త స్నేహాలు... కొత్త దుస్తులు.. స్కూలు వదిలిన మొగ్గలు కాలేజ్‌లో విచ్చుకునే టైమ్‌ ఇది.‘కొత్త’ ప్రపంచం వాళ్లను ఎటు నడిపిస్తుందో? అమ్మాయిల అమ్మానాన్నలకు రోజూ ఆందోళనలే. ఆ ప్రపంచంలో ప్రమాదాలు ఎలా ఉంటాయో పిల్లలకు చెప్తే.. జాగ్రత్త పడటం ఎలాగో వాళ్లకే అర్థమవుతుంది. ప్రమాదాన్ని అడ్డుకోవడమూ తెలిసి వస్తుంది. సినీ నటి ప్రత్యూష తల్లి సరోజినీదేవి అదే మాట చెప్తోంది.‘తెలుసుకోండి... ఆడపిల్లలను కాపాడుకోండి’

జాబిల్లి కాంతులను నట్టింట్లో పూయించిన ఓ చందమామ, వెండి తెరమీద నవ్వుల్ని పండించింది. టెలివిజన్‌ కాంటెస్ట్‌లో లవ్లీ స్మైల్‌ అవార్డు అందుకున్న ఈ స్మైలీ... తల్లికి మాత్రం అందని చందమామే అయింది. ఆ నవ్వుల కిరీటాన్ని మరో ఏడాది మరో అమ్మాయి అందుకునే ఉంటుంది. వెండితెర మీద మరో తార నవ్వుల్ని రువ్వే ఉంటుంది. ఇవేవీ బిడ్డను పోగొట్టుకుని కడుపుకోత అనుభవిస్తున్న ఆ కన్నతల్లి శోకాన్ని తీర్చలేవు. సరోజినీదేవికి కూతురు దూరమై పదహారేళ్లు దాటింది. ‘న్యాయం కోసం పోరాటం చేస్తున్నా, డబ్బు, అధికారం లేని సామాన్య మహిళను, కేవలం తల్లిని. నా పోరాటంలో తీర్పు రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో’ అంటోందామె నిర్వేదంగా. ‘‘మాది భువనగిరి. అత్యంత సామాన్యమైన కుటుంబం. లవ్‌మ్యారేజ్‌ కావడంతో మాకు అత్తింటి నుంచి ఆస్తులు, పుట్టింటి నుంచి కానుకలు ఏమీ రాలేదు. మా వారు (లక్ష్మీ నారాయణ) సిండికేట్‌ బ్యాంకు ఉద్యోగి, నేను స్కూల్‌ టీచర్‌ని. ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి చాలు... అనుకున్నాం. మేమిద్దరం, మాకిద్దరు. పిల్లలే లోకం అన్నట్లు జీవించాం. పింకీ (ప్రత్యూష) సిక్త్స్‌ క్లాసుకొచ్చేటప్పటికి మా వారికి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయింది. తార్నాకలో ఉంటూ నేను బొమ్మలరామారంలో స్కూలుకి వెళ్లేదాన్ని. మా చిన్న ప్రపంచంలో తొలి ఉపద్రవం మా వారికి హార్ట్‌ఎటాక్‌ రూపంలో వచ్చింది. లైఫ్‌ క్రాస్‌రోడ్స్‌లో నిలబెట్టింది నన్ను. నా ఒక్క జీతంతో పిల్లల్ని పెంచాలి. ఇప్పటిలాగ అప్పట్లో టీచర్‌ల జీతాలు నలభై– యాభై వేలు లేవు. ఆయన పోయేనాటికి నా జీతం ఆరు వేల డెబ్భయ్‌ ఐదురూపాయలు. ఇన్సూరెన్స్‌ డబ్బు ఆసరాతో నెట్టుకొచ్చాను.

నవ్వుల కిరీటం
ఉదయం ఏడింటికి ఇంట్లో బయలుదేరితే తిరిగి వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిదయ్యేది. ఆ కండిషన్‌లో ప్రత్యూషని ఇంటర్‌కి ఎస్‌ఆర్‌ నగర్‌లో హాస్టల్‌లో చేర్చాను. ఆ నిర్ణయమే నా బిడ్డ జీవితాన్ని కాల రాస్తుందని అప్పుడు ఏ మాత్రం ఊహించలేదు. ప్రత్యూషకి క్లాస్‌మేట్‌ సిద్ధార్థ. ఇంటర్‌ పూర్తయ్యేలోపు చాలా మార్పులు వచ్చేశాయి. జెమినీ కాంటెస్ట్‌కి నాకు తెలియకుండానే ఫొటో పంపించింది ప్రత్యూష. పంపించాక చెప్పింది. ఇక చేసేదేముంటుంది? ఆ తర్వాత వారానికి ‘మిస్‌ లవ్లీ స్మైల్‌’గా ఎంపికైందని ఫోన్‌ చేసి చెప్పింది. సిద్ధార్థతో స్నేహం బలపడింది. మరో రోజు ప్రత్యూషకి జెమినీ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ కాల్, రాయుడు సినిమాలో పాత్ర కోసం. మాకు సినిమా ఫీల్డుతో అస్సలు పరిచయమే లేదు. ఆడపిల్లను పంపించడానికి భయమేసింది. ప్రత్యూష చూపించిన ఆసక్తిని తుంచేయలేక తీసుకెళ్లాను. 

ఎయిర్‌ హోస్టెస్‌ కల
ప్రత్యూషకి ఎయిర్‌ హోస్టెస్‌ కావాలని ఉండేది. అందుకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు తప్పనిసరి. అందుకే ఇంటర్‌ తర్వాత సినిమాల్లో గ్యాప్‌ తీసుకుని హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో చేరింది. కాలేజ్‌ వెతికిపెట్టడంలో సిద్ధార్థ చాలా సాయం చేశాడు. తీరా పరీక్షల టైమ్‌లో భారతీరాజా నుంచి సినిమా ఆఫర్, ముందు అనుకున్న హీరోయిన్‌ చేయడం లేదు, వెంటనే వచ్చి షూటింగ్‌ చేయాలన్నారు. పరీక్షలు సెప్టెంబర్‌లో రాయవచ్చని ప్రత్యూషని చెన్నై తీసుకెళ్లిపోయాను. ఆ తరవాత తమిళ్‌లో చాలా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళంలో 22 సినిమాలు చేసింది.

తొలి సినిమాకి 75 వేలు
రాయుడు సినిమాకి రెమ్యూనరేషన్‌ అందుకున్నప్పుడు పింకీ ఆనందాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఇంటికి ఫర్నిచర్‌ కొన్నది. నన్ను ఒక్క రూపాయి కూడా తీయవద్దంది. సోఫా సెట్, టీవీ, టేప్‌రికార్డర్‌ తీసుకుంది. ‘నాన్న ఉండి ఉంటే ఇవన్నీ ఎప్పుడో కొనేవాడు. నాన్న లేకపోవడంతోనే కదా మనకు ఇప్పటి వరకు ఇవేవీ లేవు. నాన్న ఉంటే మన లైఫ్‌ ఎలా ఉండేదో అలా మార్చేస్తా మమ్మీ’ అన్నది. అప్పటి వరకు సముద్రంలో నీటిబొట్టులా ఉన్న మా కుటుంబానికి ఒక గుర్తింపు వచ్చింది పింకీతోనే. ఆర్థికంగా నిలదొక్కుకున్నదీ పింకీ వల్లనే. చివరికి తన మరణంతో అప్పటి వరకు తెలియని ప్రతి ఒక్కరి దృష్టిలోనూ పడ్డాం. ఇదంతా నాలుగేళ్లలోనే. అంతా కలలాగ జరిగిపోయింది. కల కాదని చెప్పడానికి పింకీ కొన్న వస్తువులు మా కళ్ల ముందున్నాయి. అక్క జ్ఞాపకాలమ్మా అవి, వీటిని మార్చవద్దు అన్నాడు మా అబ్బాయి. తన జ్ఞాపకాలను అలా పదిలంగా చూసుకుంటున్నాం.

ఆ రోజు ఏం జరిగిందో!
అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. అది కన్నడ సినిమాలో తొలి అవకాశం.  ఫేషియల్, వ్యాక్సింగ్‌ చేయించుకోవడానికి కజిన్‌ శిరితో కలసి బ్యూటీపార్లర్‌కెళ్లింది. తనకిష్టమైన కెనెటిక్‌ హోండా మీదనే వెళ్లారిద్దరూ. పింకీ పార్లర్‌లో ఉన్నప్పుడు సిద్ధార్థ వచ్చాట్ట. ఫేషియల్‌ పూర్తయ్యే వరకు వెయిట్‌ చేశాట్ట. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు రైడ్‌కెళ్లి వస్తానని శిరిని వెయిట్‌ చేయమని చెప్పింది. సిద్ధార్థ తన కారులో తీసుకెళ్లాడు. కొంత సేపటికి నాకు ఫోన్‌... ‘జయం సినిమాలో హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ చేసినట్లు తేజ గారి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది, జయం ఆఫీస్‌కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే చివరి మాట. కానీ వాళ్లు మాత్రం జయం ఆఫీస్‌కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్‌లో ఉన్న శిరి ఫోన్‌ చేస్తే పది నిమిషాల్లో వస్తానన్నదట. ఆ తర్వాత ఫోన్‌ తియ్యలేదట. అప్పటి వరకు ప్రతి వివరమూ సరిగ్గా సరిపోలుతూనే ఉంది. ఆ తర్వాత అంతా మిస్టరీనే. 

పిరికి అమ్మాయి కాదు!
రాత్రి ఏడు గంటలకు ఎవరో ఫోన్‌ చేసి ‘మీ అమ్మాయిని కేర్‌ హాస్పిటల్‌లో స్ట్రెచర్‌ మీద చూశాం’ అని చెప్పారు. నేను నమ్మనేలేదామాటని. మరో గంటలోపు కేర్‌ హాస్పిటల్‌ వాళ్లే ఫోన్‌ చేశారు ‘సూసైడ్‌ అటెంప్ట్‌ చేసింది’ అని.  మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదు. నాకు ఒక్కసారిగా మైండ్‌ బ్లాంక్‌ అయింది. మా అబ్బాయితోపాటు హాస్పిటల్‌కి పరుగెత్తాను. అప్పటికే ప్రత్యూష ఐసీయూలో ఉంది. మమ్మల్ని వెళ్లనివ్వలేదు. సిద్ధార్థ బంధువులు మాత్రం లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ల ఫ్రెండ్స్‌ కూడా ప్రత్యూష ఎలా ఉందో చెప్పలేదు. రాత్రి పదకొండు గంటలకు మమ్మల్ని లోపలికి పంపించారు, కానీ బెడ్‌కి ఐదడుగుల దూరంలో ఉంచి ఒక్క నిమిషానికే బయటకు పంపించేశారు. తెల్లవారి ఉదయం తొమ్మిది దాటాక ఒక డాక్టర్‌ వచ్చి ‘ప్రత్యూష మోషన్‌కెళ్లింది, డ్రస్‌ తెస్తే మారుస్తాం’ అన్నారు. ఎక్కడ లేని సంతోషంతో ఇంటికి వెళ్లి గంటలోపే డ్రస్‌తో వచ్చాం. డ్రస్‌ ఇచ్చిన తర్వాత పదిహేను నిమిషాలకు ‘చనిపోయింది’ అని చెప్పారు. మేము ఇచ్చిన కుర్తా మాత్రమే వేశారు, పైజామా వేయలేదు. విడిచిన దుస్తులను అడిగితే ‘రాత్రి మోషన్‌కెళ్లినప్పుడు తీసి డస్ట్‌బిన్‌లో వేశారు, ఉదయాన్నే అన్నీ కాల్చేస్తారు. అవి ఉండవు’ అన్నారు. మెడికో లీగల్‌ కేసులో ఆధారాలను అలా ఎలా కాల్చేస్తారని అడగడం కూడా నాకు తెలియదప్పుడు. పోలీసులు వచ్చారు, హిమాయత్‌ నగర్‌లో దొరికిందని ఒక పాయిజన్‌ డబ్బా చూపించారు. ‘ఇద్దరూ పాయిజన్‌ తీసుకున్నారు, మీ అమ్మాయి వీక్‌గా ఉండడంతో చనిపోయింది’ అన్నారు.

కేర్‌ నుంచి నిమ్స్‌కి
పోస్ట్‌మార్టమ్‌ నిమ్స్‌లో. సాయంత్రం ఐదు దాటిందని అప్పుడు పోస్ట్‌మార్టమ్‌ చేయలేదు. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, ఒక వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్‌ పోశారని నాకనిపించింది. హాస్పిటల్‌ వాళ్లు మాత్రం ‘ట్రీట్‌మెంట్‌ సమయంలో పాయిజన్‌ వామిట్‌ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు.

అది పొరపాటే!
ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్ట్‌మార్టమ్‌ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్‌ ఎందుకు తీసుకుంది... అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పటిలా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్‌ వచ్చేశాను. అప్పటి నుంచి మొదలైన నా న్యాయపోరాటం ఇంకా సాగుతూనే ఉంది.

నీకే న్యాయం కావాలన్నారు!
పుణ్యవతి, సంధ్య ఇంకా చాలామంది నాకు అండగా నిలిచారు. సీఎం చంద్రబాబు గారికి మెమోరాండం ఇచ్చాను. వైఎస్‌ఆర్‌ (అప్పుడు ప్రతిపక్షనాయకులు), కేసీఆర్, గీతారెడ్డి... ఇలా ఎక్కిన గడప ఎక్కకుండా ఎందరికి మొరపెట్టుకున్నానో ఆ భగవంతుడికే తెలుసు. సినీనటులు మురళీమోహన్‌ గారి నుంచి ఫోన్‌ వచ్చింది. చంద్రబాబు ఎదురుగా కూర్చోబెట్టారు నన్ను. రెండు గంటల సేపు ఆయన నన్ను ఒకే మాట ’నీకే న్యాయం కావాలి’ అని పదే పదే అడిగారు. సహాయం ఏదైనా కావాలా అన్నారు. నాకు ఉద్యోగం ఉంది, నా కొడుకును చదివించుకోవడానికి అది చాలు. నా బిడ్డ ఎలా చనిపోయింది, ఎవరు చంపేశారు, ఎందుకు చంపేశారో నాకు తెలియాలి... అనే మాట మీదనే ఉన్నాను. ఇదే మాటను అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ గారు, కేసీఆర్‌గారు కూడా లేవనెత్తారు. అప్పటి నుంచి నాకు ఫోన్‌లో బెదిరింపులు మొదలయ్యాయి. కేసు విచారించిన తర్వాత సిద్ధార్థకు ఏడేళ్లు శిక్ష పడింది. అది చాలదు లైఫ్‌ పడాలని నేను హైకోర్టుకెళ్లాను. అక్కడ విచారణ అనంతరం ఆ శిక్ష పెరగకపోగా రెండున్నరేళ్లకు తగ్గిపోయింది. మళ్లీ సుప్రీం కోర్టులో కేసు వేశాను. అదింకా టేబుల్‌ మీదకు రాలేదు.

ప్రత్యూష ఓ నమ్మకం!
కేసీఆర్‌గారు... ఇలాగే కుమిలిపోవద్దు. మోసపోయిన అమ్మాయిలు, ఆసరా కోసం ఎదురు చూసే వాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లకు ఆలంబనగా నిలవమని చెప్పారు. చారిటీ పెట్టడానికి టోకెన్‌ అమౌంట్‌గా ఐదువందల నోటు ఇచ్చారు. ఆ డబ్బుతో ప్రత్యూష చారిటబుల్‌ ట్రస్ట్‌ రిజిస్టర్‌ చేయించాను. భువనగిరిలో పెంకుటిల్లు అద్దెకు తీసుకుని మూడు మెషీన్లతో పదిహేను మంది అమ్మాయిలకు టైలరింగ్‌ నేర్పించాను. స్పోకెన్‌ ఇంగ్లిష్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, కంప్యూటర్‌ ట్రైనింగ్, హ్యాండ్‌వర్క్స్, ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ కూడా చేర్చాను. ఈ పదహారేళ్లలో 16 వేల మంది పని నేర్చుకున్నారు. ఇప్పుడు సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌తో కలసి ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ చేస్తున్నాను. హార్ట్‌ ప్రాబ్లమ్‌తో ప్రత్యూష పోయిన రెండేళ్లకే ఉద్యోగం మానేశాను. ఇప్పుడు పూర్తి టైమ్‌ ట్రస్ట్‌ పనులే. ప్రత్యూష పేరు మీద పెట్టిన ట్రస్ట్‌ జనంలో నమ్మకాన్ని కోల్పోకూడదనేదే నా ముందున్న లక్ష్యం. ఇరవై ఏళ్లకే నూరేళ్లు జ్ఞాపకాలను మిగిల్చింది పింకీ. ఏ తల్లికీ నాలాంటి కడుపుకోత రాకూడదు’’.

రెండు సందేశాలు!
ప్రతి ఆడపిల్లకూ నేను చెప్పేది రెండే రెండు మాటలు. ఒకటి ... ఎవరి మీదా ఆధారపడకూడదు. ఒక రూపాయి కావాలంటే తండ్రి, అన్న, భర్తని అడిగే పరిస్థితిలో జీవించకూడదు. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. అప్పుడే కష్టం వస్తే తట్టుకునే ధైర్యం వస్తుంది. ఇక రెండోది... మీ సెక్యూరిటీ బాధ్యత మీదే. ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరితో వెళ్తున్నాం అనే స్పృహ ఉండాలి. కరాటే వంటి సెల్ఫ్‌ డిఫెన్స్‌ మెథడ్స్‌ తెలిసి ఉండాలి. ఎవరు ఎంత ప్రేమగా మాట్లాడినా సరే... వాళ్ల వెంట కళ్లు మూసుకుని వెళ్లకూడదు. చేతులారా ప్రమాదాలలో తల దూర్చవద్దు. రక్షణగా ఉండాలంటే... ఆడపిల్లలు నాలుగ్గోడల మధ్య ఉండిపోవాలని కాదు, ధైర్యంగా అన్ని రంగాల్లోకి వెళ్లాలి. ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ మనకు రక్షణ ఉందా అనే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతాను. నాకు డబ్బు వస్తే ప్రత్యూషలాగ నష్టపోయి ప్రాణాలతో బయటపడిన వాళ్ల కోసం ఒక రెస్క్యూ హోమ్‌ పెట్టాలని ఉంది. 
పాదరాజు సరోజినీ దేవి,  నటి ప్రత్యూష తల్లి 
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు