స్వర్గం... నరకం!

13 Jul, 2017 23:29 IST|Sakshi
స్వర్గం... నరకం!

ఆత్మీయం

బౌద్ధానికీ, తావోయిజానికి జరిగిన సమ్మేళనానికే జెన్‌ అని పేరు. జెన్‌ అంటే ధ్యానం అని అర్థం. ధ్యానమంటే లోపల, వెలుపల నిరంతరం ఎలాంటి అడ్డుగోడలు లేకుండా గమనించడం. జెన్‌ అనేది ఒక జ్ఞానసాగరం. అందులో జలకాలాడి ముత్యాలు ఏరి మానవసమాజానికి అందించిన వారున్నారు.

కేవలం మాటలను మాత్రం నమ్మే స్థితి నుంచి బయటపడేసేందుకు, మనిషి మనసుని వాస్తవమనే దాన్ని నేరుగా స్పృశించడానికి, స్వభావాన్ని సహజసిద్ధంగా తెలుసుకుని నడుచుకోవడానికి తోడ్పడేదే జెన్‌. ‘‘కోపం, గర్వం, ద్వేషం, అసూయ వంటి గుణాలు వీడనప్పుడు జీవితం నరకమవుతుంది. రాగద్వేషాలు లేకుండా సహనాన్ని పాటించినప్పుడు జీవితం స్వర్గమవుతుంది’’ అని చెబుతుంది జెన్‌. మచ్చుకు ఓ చిన్న కథను చూద్దాం:

ఓ జెన్‌ గురువును కలిసిన సైనికుడు ‘‘స్వర్గం, నరకం అంటుంటారు కదా? అవి ఎలా ఉంటాయి’’ అని ప్రశ్నించాడు. అప్పుడా గురువు ‘‘ఏంటీ నువ్వు సైనికుడివా? నువ్వు ఓ బిచ్చగాడిలా కనిపిస్తున్నావు. నిన్నసలు ఏ చక్రవర్తి సైనికుడిగా నియమించాడు?’’ అని తాపీగా అన్నాడు.

ఈ మాటలతో సైనికుడికి ఎక్కడ లేని కోపమొచ్చింది. వెంటనే ఒరలోంచి కత్తి తీసి నరికేస్తానని ఆయన మీదకెళ్ళాడు. కానీ గురువు ఏ మాత్రం చలించలేదు. ‘‘ఇదిగో ఈ నీ కోపావేశమే నీకు నరకం చూపుతుంది’’ అని ఎంతో శాంతంగా చెప్పిన మాటలతో సైనికుడి లో ఆవేశం అణగారిపోయింది. గురువుగారిపై తీసిన కత్తిని తీసినట్లే ఒరలో పెట్టి ఆయనకు నమస్కరించాడు. ఆ వెంటనే గురువు ‘‘ఇదిగో ఈ ప్రవర్తనతో నీకు స్వర్గద్వారాలు తెరచుకున్నాయి’’ అని అతడి కళ్ళు తెరిపించాడు.

మరిన్ని వార్తలు