మందులతో ఎత్తు పెరగరు...

5 Apr, 2018 00:29 IST|Sakshi

బీ కేర్‌ ఫుల్‌ 

మందులతో ఎత్తు పెంచుతామంటూ ఎవరైనా మిమ్మల్ని మభ్యపెడితే నమ్మకండి. అలా మందులతో ఎత్తు పెరుగుతారనేది ఏమాత్రం నిజం కాదు. ఏ వ్యక్తి ఎంత ఎత్తు పెరగాలన్నది జన్యుపరంగా ముందుగానే నిర్ణయమైపోతుంది. సాధారణంగా తల్లిదండ్రులు ఎత్తుగా ఉంటే పిల్లలూ ఎత్తుగా పెరుగుతారు. ఎత్తు పెంచడానికీ లేదా తగ్గించడానికి మందులేమీ లేవు. పిల్లలు ఎత్తు పెరిగే ప్రక్రియలో రెండు దశలుంటాయి.  వాటిని లాగ్‌ ఫేజ్‌ అనీ, ల్యాగ్‌ ఫేజ్‌ అంటారు. ఇందులో లాగ్‌ ఫేజ్‌లో పిల్లలు తటాలున ఎత్తు పెరుగుతారు. ఆ తర్వాత వారి ల్యాగ్‌ ఫేజ్‌లో ఆ పెరుగుదల కాస్తంత మందకొడిగా సాగుతుంది. ఈ దశలో వారు మహా అయితే ఒకటి లేదా రెండు అంగుళాలు పెరిగి... ఆగిపోతారు. అందుకే యుక్తవయస్సులోకి అడుగుపెట్టిన పిల్లలను చాలాకాలం చూడని వారు అకస్మాత్తుగా చూస్తే  వాళ్లు బాగా పొడవైనట్లుగా అనిపిస్తుంది.

ఈ లాగ్, ల్యాగ్‌ ఫేజ్‌లు సాధారణంగా 19–21 ఏళ్ల వరకు కొనసాగుతుంటాయి. అంటే... ఎవరిలోనైనా ఎత్తు పెరగడం అన్న ప్రక్రియ సాధారణంగా 21 ఏళ్లు వచ్చేసరికి పెరిగే ఎముక చివర ఫ్యూజ్‌ అయిపోయి పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి ఆ తర్వాత ఎలాంటి మందులు వాడినా అది ప్రయోజనం ఇవ్వదు. ఈ విషయాన్ని గ్రహించి, మందుల ద్వారా ఎత్తు పెంచవచ్చని మోసపుచ్చే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎత్తుకూ వ్యక్తిగత సామర్థ్యాలకు సంబంధం లేదు. కాబట్టి ఎత్తు పెరగడం అన్న అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు.

మరిన్ని వార్తలు