బొప్పాయితో బోలెడంత సౌందర్యం

26 Mar, 2016 22:52 IST|Sakshi
బొప్పాయితో బోలెడంత సౌందర్యం

బొప్పాయి పండు ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఎంతో ముఖ్యమైనది. ఈ బొప్పాయి ప్యాక్‌తో ఇంట్లోనే ‘ఫేషియల్ గ్లో’ సొంతం చేసుకోవచ్చు. అందులోని విటమిన్-ఎ, విటమిన్-సి, మెగ్నీషియం, పొటాషియం మీ ముఖారబిందాన్ని రెట్టింపు చేస్తాయి.

  డ్రై స్కిన్
ఒక గిన్నెలో రెండు బొప్పాయి పండు ముక్కల్ని చిదిమి గుజ్జులా చేసుకోవాలి. అందులో ఒక చెంచా తేనె, మూడు చెంచాల పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంతో ముఖం, మెడపై ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ప్యాక్ వేసుకున్న చోట్లను శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ డ్రై స్కిన్ (పొడి చర్మం) వారికి మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.

మొటిమలు, జిడ్డు చర్మం
రెండు చెంచాల బొప్పాయి గుజ్జులో ఒక చెంచా ముల్తానీ మట్టిని కలపాలి. ఆ మిశ్రమంతో రోజు విడిచి రోజు ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలా చేస్తే జిడ్డుతనం పోయి చర్మం నిగారిస్తుంది.

పిగ్మెంటేషన్
ముఖంపై నల్ల మచ్చలతో బాధపడే వారికి బొప్పాయి పండు మంచి ఉపశమనం. రెండు చెంచాల బొప్పాయి పండు గుజ్జులో ఒక చెంచా నిమ్మరసం కలిపి రోజూ స్నానం చేసే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి.

మరిన్ని వార్తలు