ఊరికి ఉపకారి

16 Jul, 2018 00:13 IST|Sakshi

‘అతను’ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎంత కష్టమొచ్చినా భయపడడు. రోజూ ఆలయానికి వెళ్లి ‘అందర్నీ చల్లగా చూడు’ అని దణ్ణం పెట్టుకుంటాడు. ఆ వూరిలో వానల్లేక చాలా కాలం అయింది. ‘అతను’ ఓ రోజున చెవులను భూమికి ఆనించి ఏదో విన్నాడు.   నిశితంగా ఆకాశం కేసి చూశాడు. త్వరలో చాలా పెద్ద వర్షం వచ్చే సూచనుందనీ, జాగ్రత్తగా ఉండమని అందరినీ హెచ్చరించాడు. ఎవరైనా వింటేగా? అతను మాత్రం ఏం జాగ్రత్త చేసుకోవాలో అన్నీ చేసుకున్నాడు. ఒకరోజు పట్నం వెళ్లి రెండు లాంతర్లు, కొన్ని ప్లాస్టిక్‌ తాళ్లు, వేరుశనగలు, ఒక బెల్లం అచ్చు, పాలపొడి కొనుక్కొచ్చాడు.

మరో రోజు పొలం నుండి తెచ్చిన చిన్న చిన్న తాటిదుంగలు, చాంతాళ్లను అటక మీదకు చేరవేసాడు. కొవ్వొత్తులు, ప్లాస్టిక్‌ డబ్బాలు, అటుకులు, బెల్లం అన్నీ ఆ ఊరిలో ఎల్తైన దిబ్బ మీద ఉన్న శివాలయం ప్రాంగణంలోకి  చేరవేశాడు. ఓ వారం రోజులకి ఆకాశంలో పెద్ద ‘కరిమబ్బు’ ఆ ఊరిమీదికొచ్చి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్న వానలకు ఊరంతా నీళ్లు వచ్చేశాయి. అంతా ఇళ్ల పైకప్పులెక్కేసారు. పిల్లల ఏడుపులు, జంతువుల అరుపులతో ఊరంతా గోల గోలగా ఉంది.

‘అతను’ లాంతర్లు వెలిగించి తెచ్చాడు. దుంగలకి తాళ్లు కట్టి తెప్పలా దానిమీద కొందరిని శివాలయానికి చేరవేశాడు. తను గర్భగుడి ముందు గదిలో దాచిన అటుకుల బస్తా, బెల్లం, వేరుశనగలు అందరికి పంచిపెట్టాడు,  ‘అతనికి ‘ కూడా ఆనందంతో కడుపు నిండిపోయింది.అద్దంలా స్వచ్ఛమైన హృదయం ఉన్న అతనితో ప్రకృతి చెలిమి చేయడం ఎప్పుడూ మానలేదు. ప్రమాద హెచ్చరికలు పంపడమూ మానుకోలేదు. పదిమందికీ సాయం చేయడం అసలే మానుకోలేదు.

– చాగంటి ప్రసాద్‌

మరిన్ని వార్తలు