శ్రీవారు బహువచనం... స్త్రీల పనులు ఏకవచనం

26 Mar, 2014 01:12 IST|Sakshi

 బయటికెళ్లడానికి ముఖం కడుక్కున్నాక కాస్తంత పౌడర్ పూసుకుని వచ్చేప్పటికి మావారు హడావిడిగా మళ్లీ ఇంటెనక్కు వెళ్తున్నారు.
 ‘‘ఎక్కడికండీ?’’ అని అడిగా.

 ‘‘ఇందాకే గడ్డం గీసుకున్నానా... నువ్వు తయారయ్యే లోపు మళ్లీ పెరిగింది. కాస్త మరోసారి షేవింగ్ చేసుకుని వస్తా’’ అని శ్రీవారి జవాబు.
 ఈ సందర్భంగా నన్ను మరింత ఉడికించడానికి ఆయన మరో జోకు చెప్పారు. ‘‘ఓ మహిళా ఆఫీసర్‌తో ఒక స్త్రీకి అప్పాయింట్‌మెంట్ టైము  ఫిక్సయిందట. సదరు సమయం సాయంత్రం ఆరుగంటలకు అనుకుందాం. ఇక్కడ వాళ్లాయన ఒక ట్రిక్కు ప్లే చేశాట్ట. అసలు టైము గురించి తన భార్యకు చెప్పకుండా సాయంత్రం నాలుగ్గంటలకు అని చెప్పాట్ట. నాలుగ్గంటలకల్లా ఆమె తయారయ్యేలా సకల జాగ్రత్తలు తీసుకుంటూ, ఆమెను అదిలిస్తూ, కదిలిస్తూ, తొందరచేస్తూ ఎలాగోలా ఆరుగంటలకల్లా ఆమె సదరు మహిళాధికారి ఆఫీసులో ఉండేట్టు చూశాట్ట. అప్పటికి ఆ అధికారిణి రాలేదట. సదరు అధికారిణి తీరిగ్గా ఆరున్నరకు వచ్చిందట.

ఎలాగైతేనేం... అరగంట ఆలస్యంగానైనా మీటింగు ఫలప్రదంగా ముగిసిందట. తిరుగు ప్రయాణంలో ఆ భార్యగారు వాళ్లాయన మీద చింతనిప్పులు చెరుగుతూ ‘చూశారా... నన్ను తొందరపెడుతూ సరిగ్గా రెడీ కానివ్వలేదు. మీరు నాలుగ్గంటలకంటూ తొందర చేశారుగానీ... ఆమె ఆరున్నరకు వచ్చింది. మీ మాట విని త్వరగా తయారై వచ్చి ఉంటే రెండున్నర గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది కదా’ అందట. దానికా భర్త ‘పిచ్చిదానా... మీరిద్దరూ మాట్లాడుకునే సమయంలో సదరు అధికారిణి భర్తా, నేనూ కూడా మీటింగేసుకున్నాం. ‘అసలు అప్పాయింట్‌మెంట్ టైమ్ చెప్పకుండా మా ఆవిడకు నాలుగ్గంటలకని చెప్పానండి’ అని నేనంటే... ‘మీరు నయం. ఈ టైమ్ ఫిక్స్ చేస్తూ మా ఆవిడతో ఈ మీటింగ్ మూడింటికి అని చెప్పా’ అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు’’ అంటూ భార్యలు రెడీ అయ్యే తీరుపై ఓ సెటైరేశారు.

 ఆయన జోకుల్లో ఒకింత చమత్కారం ఉంటే ఉంటుందేమోగాని... క్రూరత్వం మాత్రం తప్పకుండా నాలుగింతలుంటుంది.
ఆడవాళ్లు తయారవ్వడంపైనా, వాళ్ల మేకప్‌పైనా జోకులేయని మగజీవి ఉంటుందంటే నమ్మడం కష్టం. ఇంతకీ మావారు చేసిందల్లా అలా షేవింగూ, స్నానం  మాత్రమే.

 నేను తయారవ్వడం అనే ప్రక్రియలో చేసిన పనులు... మా బుజ్జిదానికి స్నానం  చేయించి, బట్టలు తొడిగి జడలు వేయడం, మా బుజ్జిగాణ్ణి తయారు చేయడం.  స్నానమదీ చేసి, మేం రెడీ అయ్యేలోపు  పిల్లలిద్దరికీ టిఫిన్లూ, శ్రీవారికి కాఫీ  ...ఇలాంటి గట్రా, గట్రా, ఎట్సెట్రా పనులన్నీ ఎన్నెన్నో ఉంటాయి. ఆయన మాత్రం  ఆఫీసు పని తప్ప... మరో పని ముట్టరు. చేత్తో చెంచా పట్టరు. ఒకవేళ అన్ని పనులుగానీ ఆయన చేయాల్సి వస్తే దానికి పెట్టుకునే ముద్దు పేరు ‘మల్టీ టాస్కింగ్’.

 ఇప్పుడంటే ఏదో ఒక పడికట్టుపదం కనిపెట్టారుగానీ... దాన్ని డిస్కవర్ చేయకముందునుంచీ అనాదిగా మహిళలందరూ చేస్తున్న పని అదే. ముద్దుగా చెప్పాలంటే ‘మల్టీ టాస్కింగ్’.  శ్రీవారు ఒక్కరే. కానీ  ఆయనను ‘వారు’గా గౌరవించి బహువచన రూపంలో సమాజం తరతరాలుగా సంబోధిస్తూ వచ్చింది. నిజానికి మహిళలకు ఎన్నో పనులు. మరెన్నో కార్యాలు. అయినా దాన్నంతా కలిపి ‘ఇంటిపని’గా ఏకవచనంలో అభివర్ణించింది.
 

మరిన్ని వార్తలు