కురులకు పండుగ కళ

5 Oct, 2019 05:46 IST|Sakshi

జుత్తు అందంగా మృదువుగా నిగనిగలాడుతూ ఉండాలనే ఆశ చాలామందికే ఉంటుంది. పండుగ రోజుల్లో ఇంకాస్త స్పెషల్‌గా కనిపించాలనుకుంటారు. అది సహజమే. అయితే ఆ ఆశ నిజం కావాలంటే హెయిర్‌కేర్‌ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మనలో చాలా మంది షాంపూ చేసుకోవడంలోనే పొరపాటు చేస్తుంటారు. షాంపూ చేసుకోవడానికీ ఓ పద్ధతుంది. చన్నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లు మెత్తబడతాయి. కేశాలను గట్టిగా పట్టుకుంటాయి. అందరు మనుషులూ ఒకలా ఉండనట్లే, అందరి చర్మతత్వాలు ఒకలా ఉండనట్లే.. జుట్టు కూడా ఒకలా ఉండదు. జుట్టు తత్త్వాన్ని బట్టి షాంపూ ఎంపిక చేసుకోవాలి.

►పొడిబారి నిర్జీవంగా ఉండే జుట్టుకు ఎగ్‌షాంపూ వాడితే మంచిది. నార్మల్‌ హెయిర్‌ అయితే ఎక్కువ గాఢత లేని షాంపూ వాడాలి. జిడ్డుబారిన జుట్టయితే షాంపూతోపాటు నిమ్మరసం కూడా వాడాలి.
►తలస్నానానికి అరగంట ముందు నిమ్మరసం పట్టించవచ్చు లేదా తలస్నానం పూర్తయిన తర్వాత చివరగా ఒక మగ్గు నీటిలో నిమ్మరసం పిండి జుట్టంతా తడిసేలా తలమీద పోసుకుంటే చాలు.
►టీ డికాక్షన్‌ను జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా మెరుస్తాయి.

కండిషనింగ్‌ ఎలా చేయాలి?
షాంపూ చేయడం పూర్తయిన తర్వాత కేశాలకున్న నీటిని పిండేయాలి. కేశాలను వేళ్లతో దువ్వి చిక్కులు విడదీయాలి. కండిషనర్‌ చేతిలోకి తీసుకుని జుట్టుకు పట్టించాలి. కండిషనర్‌ను జుట్టు కుదుళ్లకు, చర్మానికి పట్టించకూడదు. కేశాలకు మాత్రమే పట్టించి ఐదు నిమిషాల తర్వాత మెల్లగా మర్దన చేయాలి. చివరగా డ్రైయర్‌తో ఆరబెడితే జుట్టు పూల రెక్కల్లా మృదువుగా ఉంటుంది.

ఏ కండిషనర్‌ మంచిది?
చిట్లిపోయి జీవం కోల్పోయినట్లున్న జుట్టుకు ప్రొటీన్‌ కండిషనర్‌ వాడాలి. పొడి జుట్టుకు మాయిశ్చరైజింగ్‌ లేదా ఇన్‌టెన్సివ్‌ కండిషనర్, జిడ్డుగా ఉండే జుట్టుకు నార్మల్‌ లేదా ఆయిల్‌ ఫ్రీ కండిషనర్‌ వాడాలి.

సహజసిద్ధమైన కండిషనర్‌
మార్కెట్‌లో రెడీమేడ్‌గా దొరికే కండిషనర్‌ వాడడానికి ఇష్టపడని వాళ్లు హెన్నా ట్రీట్‌మెంట్‌ తీసుకోవచ్చు. అయితే ఇది సహజసిద్ధమైన కండిషనర్‌. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే హెన్నా కండిషనర్‌లో ఉపయోగించే వస్తువులను జుట్టు తత్వాన్ని బట్టి మార్చుకోవాలి.గోరింటాకు పొడిలో కోడిగుడ్డు, నిమ్మరసం, కాఫీ లేదా టీ డికాక్షన్, మందార ఆకుల పొడి, ఉసిరిక పొడి (కాస్మొటిక్‌ ఉత్పత్తులు దొరికే షాపుల్లోను, సూపర్‌ మార్కెట్‌లోనూ దొరుకుతాయి) ఇనుపపాత్రలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ఆరుగంటల సేపు నానిన తర్వాత తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపూ వాడకుండా తలస్నానం చేయాలి (హెన్నా ప్యాక్‌ని షాంపూ చేసి ఆరిన జుట్టుకు వేయాలి). హెన్నా ట్రీట్‌మెంట్‌ చేస్తే జుట్టురాలడం, చుండ్రు తగ్గడమే కాకుండా మెత్తగా పట్టుకుచ్చులా ఉంటుంది. కనీసం నెలకొకసారి హెన్నా ట్రీట్‌మెంట్‌ చేస్తే కేశ సౌందర్యం ఇనుమడిస్తుంది.

మరిన్ని వార్తలు