ఇదిగిదిగో... క్రీమ్!

1 Mar, 2015 23:58 IST|Sakshi

ప్రసిద్ధ ‘సోనీ వరల్డ్స్ ఫొటోగ్రఫీ’ అవార్డ్‌ల కోసం జరిగిన వడపోతలో మిగిలిన కొన్ని ఫొటోల్లో ఇవి కూడా కొన్ని. వీటిని ‘క్రీమ్' అని పిలుస్తున్నారు. 171 దేశాల నుంచి వేలాది ఎంట్రీలు ఈ పోటీకి వచ్చాయి. మానవ ఆసక్తికి సంబంధించిన ్గఫొటోలతో పాటు ప్రకృతి, భౌగోళిక అందం, సామాజిక న్యాయం...ఇలా వివిధ విభాగాలకు చెందిన ఫొటోలు ఇందులో ఉన్నాయి.
 

నలుపు తెలుపుల్లో పంచరంగుల అందం...
బంగ్లాదేశ్‌లో మహ్మద్ అద్నాన్ తీసిన మొదటి ఫొటో చూసి ‘వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే’ అని పిల్లల గురించి మాత్రమే పాడుకోనక్కర్లేదు.

 

 

ఆ ఆనంద గీతాన్ని పెద్దల దగ్గరికీ తీసుకువెళ్లవచ్చు.  టర్కీ ఫొటోగ్రాఫర్ కెన్‌డిస్లిగో తీసిన  ఫొటోలో... వానను ప్రేమించే వృద్ధురాలు కనిపిస్తుంది.  ఆమె వానోత్సవాన్ని కొలవడానికి ఏ పరికరాలూ చాలవేమో!
 
 

పేదరికపు సంపన్న దృశ్యం...
ఒకటి:  ఓపెన్ ట్రావెల్ కేటగిరిలో ఎంపికైన ఈ ఫొటోను చెన్నై బీచ్‌లో ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ చెవెసోవ తీశారు. అడుక్కునే అమ్మాయి చేతిలో కోతి అందరిని ఆకట్ట్టుకుంటోంది. జీవితం అనేది  ఒక సముద్రం అనుకుంటే దాని ముందు బేలగా ‘కోతి’ అనే ఉపాధితో నిల్చుంది అమ్మాయి.
 

‘‘ఈ అమ్మాయి విధిరాతతో నాకేమిటి సంబంధం? నాకు ఎందుకు స్చేచ్ఛ లేదు’’ అని కోతిగారు లోకాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది ఈ ఫొటో.
 
రెండు: పశ్చిమబెంగాల్‌లో నబద్‌విప్ ప్రాంతంలో వెనిజులా ఫొటోగ్రాఫర్ మహదేవ్ రోజాస్ టొర్రెస్ తీసిన  ఫొటోలో ఇటుకలు తయారు చేసే కార్మికుల ‘పేదరికం’ పిల్లల రూపంలో కనిపిస్తుంది. ఈ పిల్లలు ఏదో ఆలోచిస్తున్నారా?  ఈ సమాజాన్ని ఏదైనా ప్రశ్నించాలనుకుంటున్నారా?!

మరిన్ని వార్తలు