వీక్‌నెస్‌ నుంచే బలం రావాలి

18 Aug, 2019 08:05 IST|Sakshi
నీతూచంద్ర

అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆడపిల్ల అయితే అంతకన్నా ఎక్కువ చేయొచ్చు. సాధారణంగా ఆడపిల్ల అంటే ‘వీక్‌’ అంటారు. కానీ మన వీక్‌నెస్‌ తెలిస్తేనే కదా మనం స్ట్రాంగ్‌ అయ్యేది. శక్తి ఒకరు ఇచ్చేది కాదు. బయట నుంచి తీసుకునేది కాదు. లోపల నుంచి ఎదగాలి. నీతూచంద్ర చెబుతున్న మాటలు ప్రతి అమ్మాయి చదవాలి.

విష్ణు, గోదావరి, సత్యమేవ జయతే వంటి తెలుగు సినిమాలు చేశారు. ఆ తర్వాత కనిపించలేదేం?
నీతు: అప్పుడేం జరిగిందో చాలామందికి తెలుసు అనుకుంటాను. ఇప్పుడా విషయం గురించి మళ్లీ చెప్పాలనిపించడంలేదు. నా స్టాఫ్‌తో సహా ఉదయం 4 గంటలకే హైదరాబాద్‌ నుంచి హడావిడిగా వెళ్లిపోవాల్సి వచ్చింది. భయంకరమైన సంఘటన అది. అప్పుడు మా నాన్నగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటు ప్రొఫెషనల్‌గా ఘోరమైన పరిస్థితి, అటు వ్యక్తిగతంగా పెద్ద బాధ. ఇక్కడ నిలబడి ఫైట్‌ చేద్దామంటే నా పర్సనల్‌ లైఫ్‌ అందుకు స్కోప్‌ ఇవ్వలేదు. నాన్నగారి కోసం వెళ్లిపోవాల్సి వచ్చింది. 

మీకెదురైన చేదు అనుభవం ఒకే ఒక్క సినిమాతో. మరి.. ఇండస్ట్రీ మొత్తానికి దూరం కావడమెందుకు?
ఆ తర్వాత నేను ‘మనం’ సినిమా చేశాను కదా? కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేయాలనుకున్నాను. కానీ స్పెషల్‌ సాంగ్స్‌ ఆఫర్స్‌ మాత్రమే వచ్చేవి. నాకు తెలిసి ఎవరైనా ముందు సాంగ్స్, స్పెషల్‌ డ్యాన్స్‌లు చేసి ఆ తర్వాత క్యారెక్టర్లు చేస్తుంటారు. నేను దానికి విరుద్ధంగా చేశాను. నా దృష్టిలో హిందీ సినిమాకు సౌత్‌ సినిమా వెన్నెముకలాంటిది. స్పెషల్‌గా తెలుగు, తమిళం. ఈ రెండు ఇండస్ట్రీలు నాకు గుర్తింపును ఇచ్చాయి. 

తెలుగులో కనిపించడంలేదు. ఇతర భాషల్లో నటించి కూడా రెండు మూడేళ్లయినట్లు ఉంది కదా?
క్వాలిటీ వర్క్‌ చేయాలనుకుంటాను. ‘విష్ణు, గోదావరి, సత్యమేవ జయతే’లో చేసిన పాత్రలు దేనికదే విభిన్నంగా ఉంటాయి. నాలుగేళ్లుగా థియేటర్స్‌ మాత్రమే చేస్తున్నాను. దాని వల్ల ‘నీతూ యాక్టింగ్‌ మానేసింది’ అని రాస్తున్నారు. సినిమాలు చేసిన తర్వాత థియేటర్‌ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. మన దగ్గరకు వచ్చే సినిమాలు ఎలానూ వస్తాయనే ఉద్దేశంతో ఉన్నాను. మా నాన్నగారు పోవడంతో అమ్మను చూసుకుంటున్నాను. ఒకవేళ మంచి కంటెంట్‌ ఉన్న కథ వస్తే అందులో 17 ఏళ్ల అమ్మాయిగా, 85 ఏళ్ల వయసున్న బామ్మలా కనిపించాలన్నా అలానే మౌల్డ్‌ అయిపోతాను. రెండు గంటలు బ్రేక్‌ లేకుండా నటించగలను.

సినిమాల సంఖ్య తగ్గడంతో ఇండస్ట్రీకి దూరం అయినట్లు అనిపించిందా?
సోషల్‌ మీడియా వల్ల దూరం అయినట్టుగా లేదు. ఫిల్మ్స్‌కి దూరంగా ఉన్నా సోషల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తున్నాను. నాకు ఇష్టం లేని సినిమాల్లో భాగం అవ్వడం లేదు.. అంతే. మనకు నచ్చని పనిని ‘చేయను’ అని తెగేసి చెప్పడం కూడా సక్సెసే. ‘యస్‌’ అని చెప్పి పిచ్చి పిచ్చి సినిమాలు చేయలేం కదా. అలాగని డ్యాన్స్‌లు చేయనని కాదు. అవీ చేస్తాను. అలాగే ‘బాహుబలి’ సినిమాలో హీరోయిన్లు చేసినట్లు యాక్షన్‌ మూవీ చేయాలని ఉంది.

అవునూ... లాస్‌ ఏంజిల్స్‌లో యాక్టింగ్‌ కోర్స్‌కి వెళుతున్నారట. పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. మళ్లీ యాక్టింగ్‌ కోర్స్‌ ఎందుకు? 
ఏ ఆర్టిస్ట్‌ అయినా రోజూ ప్రాక్టీస్‌ చేయాల్సిందేనని నా అభిప్రాయం. అనుభవం సంపాదించుకున్నా కూడా ప్రాక్టీస్‌ చేస్తూనే ఉండాలి. అందుకే ఓపిక ఉన్నంత వరకూ థియేటర్, వర్క్‌షాప్స్‌ చేస్తూనే ఉంటాను. 

ఓకే.. మార్షల్‌ ఆర్ట్స్‌లో నాలుగు బ్లాక్‌ బెల్టులు సాధించారు. ఈ ఆర్ట్‌ మీ లైఫ్‌కి ఎలా ఉపయోగపడింది?
స్పోర్ట్స్‌ని నా ఫ్రెండ్‌లా భావిస్తాను. స్పెషల్‌గా మార్షల్‌ ఆర్ట్స్‌. దీని వల్ల మనం ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే నేనున్న ప్రొఫెషన్‌కి డిప్రెషన్, బ్రెయిన్‌హెమరేజ్‌ వచ్చేస్తాయి. ఈ సినిమా నాకు కాకుండా ఆ అమ్మాయికి వెళ్లిపోయింది. అది అలా జరిగింది? ఇలాంటివి ఆలోచిస్తుంటాం. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు స్పోర్ట్స్‌ నేర్పించాలి. అది ఏ స్పోర్ట్‌ అయినా ఫర్వాలేదు. క్రమశిక్షణ, బాధ్యత, పోరాడే లక్షణం అలవడతాయి. అదో డిఫరెంట్‌ ఎనర్జీ. స్పోర్ట్స్‌ చాలా నేర్పింది.

స్పోర్ట్స్‌ని ఫ్రెండ్‌లా అనుకుంటా అన్నారు. మరి మీ జీవితంలో స్పెషల్‌ పర్సన్‌ ఎవరూ లేరా? 
రిలేషన్‌షిప్‌లో ఉండటం కూడా ఓ పని లాంటిదే. యాక్ట్‌ చేస్తున్నాను, నిర్మిస్తున్నాను, మార్షల్‌ ఆర్ట్స్‌లో ఉన్నాను, పట్నా పైరెట్స్‌ కబడ్డీ జట్టును ప్రమోట్‌ చేస్తున్నాను. నాలుగేళ్లు రిలేషన్‌లో (బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హుడాతో ఒకప్పుడు ప్రేమలో ఉన్న నీతు) ఉన్నాను. అది కొనసాగని పరిస్థితి. ఆ బాధలోంచి బయటకు రావడానికి ఒకటిన్నర సంవత్సరం పట్టింది. ప్రస్తుతం  లాస్‌ ఏంజిల్స్‌లో ఉంటున్నాను. ప్రపంచం మొత్తం తిరిగి పని చేయాలనుకుంటాను. తెలుగులో సినిమా ఉంటే ఇక్కడికి వచ్చి సినిమా చేస్తాను. ప్రేమలో పడే టైమ్‌ దొరికి, మనసుకి నచ్చిన అబ్బాయి దొరికితే అప్పుడు పడతాను. 

మార్షల్‌ ఆర్ట్స్‌ వల్ల అడ్వాంటేజ్, డిస్‌ అడ్వాంటేజ్‌ రెండూ ఉంటాయి కదా?
అవును. ఈ ఆర్ట్‌ వల్ల నేను రూడ్‌ అనుకునే అవకాశం ఉంది. అయితే నేను చాలా సాఫ్ట్‌. నన్ను గౌరవించండి.. నేను మిమ్మల్ని గౌరవిస్తాను అనే తత్వం నాది. గౌరవంలో తేడా వచ్చినప్పుడు ఇంకో కోణం చూపిస్తా (నవ్వుతూ). నేను మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నానని పాత్రకు సరిపోయినా చాలామంది నన్ను సినిమాల్లో తీసుకోలేదు. మార్షల్‌ ఆర్ట్స్‌ వల్ల ఫెమినైన్‌ (స్త్రీత్వం)గా ఉండను అనుకుంటారు. అది ఒక  డ్రాబ్యాక్‌. ఊరికే ఫైట్‌ చేస్తుంది అనుకుంటారు. మార్షల్‌ ఆర్ట్స్‌ అనేవి మనిషిని క్రమశిక్షణగా ఉంచడానికి, ఆత్మవిశ్వాసం పెంచడానికి, స్వీయ రక్షణకు ఉపయోగపడతాయి. దానివల్ల ఫెమినిటీ తగ్గదు. ఊరికే ఫైట్‌ చేయరు. చాలా బ్యాలెన్డ్స్‌గా ఉంటారు.

బీహార్‌లో పుట్టి, హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ దాకా ఎదిగిన ఈ జర్నీ గురించి?
బీహార్‌ అమ్మాయిలు హీరోయిన్‌ అవ్వాలని కలలు కనడమే ఎక్కువ. ఆ కలను నెరవేర్చుకున్నా. నాది సక్సెస్‌ఫుల్‌ జర్నీయే.

ఇప్పుడు మీరు యాక్టర్, ప్రొడ్యూసర్, స్పోర్ట్స్‌ పర్సన్, డ్యాన్సర్‌.. అసలు చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు? 
చిన్నప్పుడు పిల్లలు అది అవ్వాలి.. ఇది అవ్వాలి అనుకోరు. వాళ్ల తల్లిదండ్రులు అనుకుంటారు. అటు వెపుగా పిల్లల్ని వెళ్లమంటారు. నేను ఇలా ఉన్నానంటే కారణం మా అమ్మగారు. తను నన్ను మార్షల్‌ ఆర్ట్స్‌ చేయమన్నారు. కథక్‌ నేర్చుకోమన్నారు. స్కూల్‌లో జరిగిన ఫంక్షన్స్‌లో యాక్ట్‌ చేశాను. నన్ను యాక్టర్‌ని చేసేలోపు నాలో ఈ స్కిల్స్‌ పెరిగేలా చూసుకున్నాడు దేవుడు. 12వ తరగతిలో నాన్నగారికి యాక్సిడెంట్‌ అయింది. దాంతో నాకు చదువుకుంటూనే పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మా తమ్ముడు కూడా వాళ్ల క్లాస్‌ వాళ్లకు ట్యూషన్‌ చెప్పేవాడు. అంత టాలెంట్‌. ఇప్పుడు డైరెక్టర్, రైటర్‌ అయ్యాడు. ఇదంతా స్ట్రగుల్‌ అనుకోను. ‘స్ట్రగుల్‌’ అనే పదం నా డిక్షనరీలోనే ఉండదు. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉండటం వల్ల చివరిదాకా పోరాడాలనే తత్వం నాలో ఏర్పడింది. 

హీరోయిన్‌ అవడంతో పాటు సినిమాలు నిర్మిస్తున్నారు... పైగా సందేశాత్మక సినిమాలు తీస్తున్నారు..
నా తమ్ముడు నితిన్‌తో కలిసి ఓ నిర్మాణ సంస్థను మొదలుపెట్టా. బీహార్‌కు అప్పటివరకూ నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది లేదు. మా మొదటి సినిమా (‘దేశ్వా’)కే వచ్చింది. ఇంకా వెనక్కి వెళ్దాం. నా తొమ్మిదో తరగతిలో స్పోర్ట్స్‌లో ఇండియాను రిప్రజెంట్‌ చేశాను. జాకీచాన్‌ చేతుల మీదుగా అవార్డ్‌ వచ్చింది. నితిన్‌కు డైరెక్టర్‌గా హిందీ సినిమా చేసే అవకాశం వచ్చినా మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని భోజ్‌పురి సినిమా చేశాడు. బీహార్‌లో ఐదు భాషలు చనిపోయే స్థితిలో ఉన్నాయి. ‘భోజ్‌పురీ, మైధిలీ, మగై, అంగికా, బజ్జికా’... ఇవి బీహార్‌ భాషలు. భోజ్‌పురిలో చాలావరకు చీప్‌గా, బీ గ్రేడ్‌ సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలు మేం చేయాలనుకోలేదు. ఫ్యామిలీ అందరితో కలసి ఓ మాతృభాష సినిమా చూడలేని పరిస్థితి అక్కడ ఉంది. ఓ రెవల్యూషన్‌ తీసుకురావాలనుకున్నాం. మేం తీసే సినిమాల్లో రవి కిషన్, మనోజ్‌ తివారి వంటి స్టార్లు కనిపించరు. బీహార్‌లోనే షూటింగ్‌ చేస్తాం. అలా అయితే అక్కడివాళ్లకి కొంత పని కల్పించవచ్చు, ట్యాక్స్‌ కట్టవచ్చు అని. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? బీహార్‌ సినిమా పరిస్థితి మారాలంటే ఐదు ‘బాహుబలి’లు కావాలి.

మార్షల్‌ ఆర్ట్స్‌ ఉపయోగాల గురించి అమ్మాయిలకు ఏమైనా చెబుతారా? 
శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతాం. ఐదుగురు అబ్బాయిలు వీధిలో ఉన్నారనుకోండి.. మామూలు అమ్మాయిలైతే ‘వామ్మో అబ్బాయిలు’ అని బిక్కుబిక్కుమంటూ నడుస్తారు. మీ నాన్న, అన్నయ్య, తమ్ముడు, భర్త.. ఇలా అందరూ ఎప్పుడూ మీతో ఉండలేరు కదా. అందుకని మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలి. అబ్బాయిలు కూడా మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలి. ఎందుకంటేæ యవ్వనంలో వాళ్లు చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. కానీ మార్షల్‌ ఆర్ట్స్‌  వల్ల సెన్సిబుల్‌గా మారిపోతారు. చుట్టూ ఉన్నవాళ్లను రక్షించాలనే మైండ్‌ సెట్‌ ఏర్పడుతుంది.

ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు?
రెండు హాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్‌ చేస్తా. ఓ మ్యూజిక్‌ వీడియో చేశాను. దాని రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను. 
– డి.జి. భవాని

మరిన్ని వార్తలు