నేనె హీరో

13 Aug, 2017 18:15 IST|Sakshi

గాల్లో ఎగిరి ఓ తన్ను తన్నినా..
కెమెరాకు తిరిగి క్లోజ్‌లో ఒక పంచ్‌ డైలాగ్‌ కొట్టినా..
మౌనంగా ఒక లుక్‌ ఇచ్చినా..
చీపురుతో తాట తీసినా.. గన్నుతో కాకపుట్టించినా..
‘విజయ’లో ఉన్న అశాంతే కనిపిస్తుంది... కోపం, ఉద్రేకం, రౌద్రం,
ప్రతీకారం కన్నీళ్లలా కాకుండా చెమట బిందువుల్లా ఆమె చెంపల మీద జారతాయి.
‘హీరోయిన్‌ బేస్డ్‌ సినిమాల్లేండీ’ అని తోసి పారేయకండి.
రాములమ్మది హీరో బేస్డ్‌ సినిమాయే.
హీరో అవడానికి మీసాలే ఉండక్కర్లా.
రోషం.. పౌరుషం ఉంటే చాలు అంటున్నారు విజయశాంతి




మరో రెండు రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం. దేశానికి ఫ్రీడం వచ్చి 70 ఏళ్లైంది. అసలు మహిళలకు ఫ్రీడమ్‌ వచ్చిందా?
విజయశాంతి: ఇంకా రాలేదనే అనుకుంటున్నా. స్వాతంత్య్రం వచ్చిన ఈ 70 ఏళ్లలో మంచి మార్పు వచ్చుండాలి. కానీ రాలేదు. టీవీలు, పేపర్లలో ప్రతిరోజూ మహిళలపై ఎన్నో ఘటనలు జరుగుతున్నాయనే వార్తలే. జరగరానివి జరుగుతున్నాయి. అవన్నీ చూస్తుంటే బాధగా ఉంటుంది. స్కూల్‌ పిల్లలు, వర్కింగ్‌ విమెన్, వాళ్లూ–వీళ్లూ అనే తేడా లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సేఫ్టీ లేకుండా పోయింది. పెద్దింటి పిల్లలు, రాజకీయ నాయకులు, వాళ్ల వారసులు ఉండడంతో కొన్ని తప్పులు వెలుగులోకి రాకుండాపోతున్నాయి. ఓవరాల్‌గా నష్టపోయేది, చనిపోయేది ఆడవాళ్లే. స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలపై మగాళ్లందరూ తలదించుకోవాలి. ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు అందరూ తలదించుకోవాలి. ఆడవాళ్లకు రక్షణ ఉంటేనే కదా.. ఫ్రీడమ్‌ వచ్చినట్లు!

హీరోయిన్‌గా దాదాపు 30 ఏళ్లు బిజీ బిజీగా సినిమాలు చేశారు.  బహుశా ఇంత కెరీర్‌ స్పాన్‌ ఉన్న ఆర్టిస్టులు తక్కువేమో?
1979లో స్టార్‌ అయి, దాదాపు 28 ఏళ్లు కంటిన్యూస్‌గా సినిమాలు చేశాను. అంత లాంగ్‌ కెరీర్‌ నాకే దక్కిందేమో. అదో రికార్డ్‌. మధ్యలో బ్రేక్‌ తీసుకుని చేసినవాళ్లు ఉన్నారనుకోండి.టి. కృష్ణగారి సినిమాలు చేయడం నా లక్‌. లేకపోతే గ్లామరస్‌ హీరోయిన్‌గా మిలిగిపోయేదాన్నేమో. టి. కృష్ణగారు, దాసరి నారాయణరావుగారు, మోహన్‌ గాంధీ వంటి దర్శకులుంటే... ఇప్పటి హీరోయిన్లకూ మంచి మంచి అవకాశాలొస్తాయి. ఇప్పుడంతా హీరోలకే కదా.

అప్పట్లో కూడా హీరోల డామినేషన్‌ ఉండేది కదా..
ఉండేది. కాకపోతే మాకు మంచి కథలు వచ్చేవి. నిరూపించుకునే స్కోప్‌ ఉండేది.

మీకు హీరోయిన్‌ ఇమేజ్‌ ఇష్టమా? హీరో ఇమేజా?
హీరోయిన్‌ ఇమేజ్‌ని తక్కువ చేయడంలేదు. కాకపోతే నిరూపించుకునే చాన్స్‌ తక్కువ. అందుకే హీరో ఇమేజే ఇష్టం. నా మెంటాలిటీకి అదే సూట్‌ అవుతుంది. ‘మహిళలు తక్కువ కాదు’ అనే ఫీలింగ్‌తో ఉంటాను. అందుకు తగ్గట్టుగానే లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేసి, తక్కువ కాదని నిరూపించుకున్నాను. అందుకే హీరోలు చేసినట్లే యాక్షన్‌ మూవీస్‌ చేశాను.

ఏం చేస్తే బాగుంటుందనుకుంటున్నారు... ‘నిర్భయ’ చట్టం వచ్చాక దారుణాలు తగ్గుతాయేమో అనిపించింది..
చట్టాలు తీసుకొస్తున్నారు గానీ... వాటిని కరెక్టుగా అమలు చేయడంలేదు. రీసెంట్‌గా ఓ రాజకీయ నాయకుడి కుమారుడు అర్ధరాత్రి ఓ అమ్మాయిని వెంబడించిన ఘటన చూశాం కదా. ఇక, మనం ఎవర్ని నమ్ముతాం? ఏ రకంగా నమ్ముతాం? మగవాళ్ల మైండ్‌సెట్‌ మారాలేమో అనిపిస్తోంది. ప్రతి ఒక్కరికీ అక్కాచెళ్లెల్లు, అమ్మలు ఉంటారు. మరి, బయటకు వచ్చేటప్పటికి అమ్మాయిల పట్ల ఎందుకలా ప్రవర్తిస్తున్నారనేది అర్థం కావడం లేదు. చట్టాలను స్ట్రాంగ్‌ చేయాలి.

ఆడవాళ్లు బయటకు రావడం వల్ల, లేట్‌ నైట్స్‌లో బయట ఉండడం వల్ల ఇటువంటివి జరుగు తున్నాయనేవాళ్లు ఉన్నారు.
లేట్‌ నైట్స్‌ అంటే... ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుంటారు. ఉదాహరణకు... మీరున్నారు. మీడియాలో ఎంతోమంది మహిళలున్నారు. షిఫ్టు ప్రకారం నైట్‌ డ్యూటీలు చేస్తుంటారు. వాళ్లేం చేయాలి? బయట సమాజం ఇలా ఉందని ఉద్యోగాలు మానుకోలేరు కదా! పని చేసేవాళ్లు చేయాలి. ఎదుటి వ్యక్తులు సరిగ్గా ఉండాలి. పద్ధతిగా నడుచుకోవాలి. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. రెండు మూడు ఘటనల పట్ల స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అయితే అప్పుడు భయం వస్తుంది. పెద్దింటోళ్లు, చిన్నింటోళ్లు అనే తేడాలు లేకుండా తప్పు చేసే ఏ మగాణ్ణయినా  శిక్షించాల్సిందే. ఆ విషయంలో దయాదాక్షిణ్యాలు ఉండకూడదు.

ఈ ఘటనలు పక్కనపెడితే... మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఆ అభివృద్ధి గురించి?
అది ఆనందమే. మహిళల్లో మంచి ప్రతిభ దాగుంది. దూసుకెళ్తున్నారు. అదొక్కటే కాకుండా... మహిళలు అన్ని రంగాల్లోనూ కొన్ని ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. వాళ్ల ప్రతిభను చూసి ఓర్వలేనోళ్లు ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తారు. అటువంటి ప్రతికూలస్థితులను అధిగమించి కొందరు మహిళలు పైకొస్తున్నారు. ఇది అభినందించాల్సిన విషయం. మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు.

అప్పట్లో హీరోయిన్‌ అంటే విజయశాంతి. విజయశాంతి అంటే హీరోయిన్‌ అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అప్పుడు ఈర్ష్యతో మిమ్మల్ని తొక్కేయ డానికి ఎవరైనా ట్రై చేశారా?
ఒక హీరోయిన్‌కి హీరో ఇమేజ్‌ రావడం ఏంటి? హయ్యస్ట్‌ పెయిడ్‌ హీరోయిన్‌ ఏంటి? అని మాట్లాడిన వాళ్లు ఉన్నారు. అవన్నీ ఓవర్‌కమ్‌ చేసుకుని నా పని నేను చేసుకుంటూ వెళ్లేదాన్ని. సక్సెస్‌లు వస్తుండేవి. ప్రజలు నన్నెంతో ఆదరించారు. దాంతో భయపడలేదు. యాక్షన్‌ ఫిల్మ్స్‌లో స్టంట్స్‌ కూడా డూప్‌ లేకుండా చేశా. ఇప్పుడంటే గ్రాఫిక్స్‌ వచ్చాయి కానీ... అప్పట్లో లేవు కదా. 30 అడుగుల ఎత్తు నుంచి దూకాలంటే దూకేయడమే. నేను చేయ నంటే ఎవరూ ఏమీ అనేవారు కాదేమో! కానీ, నేనే తగ్గేదాన్ని కాదు. మహిళలు ఎందులో తక్కువ? అనే ఫీలింగ్‌తో రిస్క్‌ తీసుకునేదాన్ని. కొన్ని సందర్భాల్లో కాళ్లు–చేతులు విరగొట్టుకున్నా. వాటిని లెక్క చేయకుండా పని చేయాలనే అభిప్రాయంతో చేశా. రాజకీయాల్లో అయితే సినిమాల్లో కంటే దారుణంగా, భయంకరంగా ఉంటుంది. వాటిని ఓవర్‌కమ్‌ చేసి రావాలి.

రాజకీయాల్లో  భయంకరమైన రాజకీయా లుంటాయన్నారు. ఇందులోకి ఎందుకొచ్చాం అనే ఫీలింగ్‌ ఏమైనా..?
నేనా రోజు తెలంగాణ అంశం టేకప్‌ చేసి నప్పుడు.. ‘సినిమాల్లో టాప్‌మోస్ట్‌గా ఉండి, తెలంగాణ కోసం వెంపర్లాడుతోందేంటి? రాంగ్‌ డెసిషన్‌ తీసుకుంది?’ అని చాలామంది హేళన చేశారు. కొన్ని అవమానాలూ జరిగాయి. అయినా పట్టించుకోలేదు. రెండు ప్రాంతాల్లో (ఆంధ్రా, తెలంగాణ) పేరు, సామాజిక బాధ్యత గల కళాకారిణిగా తెలుగు ప్రజల క్షేమం కోరుకున్నా. రాష్ట్రాలుగా విడిపోయినా... మంచి మనసుతో అందరూ కలిసుండాలని చెప్పా. తెలుగు ప్రజల మధ్య అప్పట్లో నెలకొన్న గీత, వైరుధ్యాలు ఈరోజు తొలగాయనే సంతృప్తి నాకుంది. ‘విడిపోతే రెండు ప్రాంతా లు బాగుపడతాయి, ఇరు వర్గాలకు న్యాయం చేసినోళ్లమవుతాం’ అని చెప్పా. ఇప్పుడందరూ హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ సాధన కోసం పాటుపడినందుకు ఆనందపడుతున్నా.



తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో శ్రమించారు. ఆ పార్టీలో ఉండి ఉంటే  ఒక పెద్ద పదవి పొంది ఉండేవారేమో?
నాపై కొన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. ప్రతిభ ఉన్నోళ్లకు ఇబ్బందులు తప్పవు. రాజకీయాలు అన్నప్పుడు వెన్నుపోట్లు తప్పవు. ప్రాంతీయ పార్టీలు అలాగే ఉంటాయి. ప్రజలు ఆశించినట్టు జరగాలంటే జాతీయ పార్టీల ద్వారానే సాధ్యపడుతుంది. జరిగిందేదో జరిగింది. అయినా... కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నాకా గ్రాటిట్యూడ్‌ ఉంది. పదవులన్నది ఈరోజు రాకపోవచ్చు, రేపు రావొచ్చు. కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామనే తృప్తి నాకుంది. అది పదవుల కంటే ఎక్కువని అనుకుంటున్నా. పదవులది ఏముంది? ఐదేళ్లు అధికారంలో ఉంటారు. తర్వాత ప్రజలు మరొక పార్టీకి ఓటేస్తారు. కానీ, ఈ అచీవ్‌మెంట్‌ అనేది మళ్లీ రాదు. గాంధీగారు దేశ స్వాతంత్య్రం కోసం శ్రమించినట్టు, నేను తెలంగాణ కోసం 19 ఏళ్లు కష్టపడ్డా. నాకది బిగ్గెస్ట్‌ అచీవ్‌మెంట్‌.

తమిళనాడులో రజనీకాంత్, కమల్‌హాసన్‌లు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయంటు న్నారు. మీకు అక్కడ బోలెడంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆ మధ్య మీరు తమిళనాడు వెళ్లారు. మీరు అక్కడ్నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా?
లేదమ్మా. తెలంగాణ కోసం 19 ఏళ్లు నేను కష్టపడి పని చేసి, రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరో రాష్ట్రం గురించి ఆలోచించడం లేదు. అఫ్‌కోర్స్‌... నాకు అక్కడ అభిమానులున్నారు. నేనక్కడి రాజకీయాల్లోకి రావాలని వాళ్లు కోరుకోవచ్చు. కానీ, నేనలా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి వెళ్లే మనిషిని కాదు. తెలంగాణను తీసుకురావాలనుకున్నాం. తీసుకొచ్చాం. ఇప్పుడీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇంకా మంచి చేయాలనే ఆలోచనతో నేనున్నా. తమిళనాడులో ఏఐఏడీయంకే పార్టీ వాళ్లు అడిగారు. అయితే... నేను వెళ్లాలనుకోవడం లేదు. జయలలితగారంటే నాకిష్టం. ఆవిడ అధికారంలో తెచ్చిన ప్రభుత్వంలో, పార్టీలో సమస్యలు రాకుండా ఉండడం కోసం... వాళ్లు నన్ను రిక్వెస్ట్‌ చేయడంతో నేను తమిళనాడుకి వెళ్లి క్యాంపెయిన్‌ చేసొచ్చా.

ఈ మధ్య కొంతమంది ఫిల్మ్‌ ఇండస్ట్రీ పర్సన్స్‌ని డ్రగ్స్‌ విషయమై విచారించారు కదా.. దాని గురించి ఏమంటారు?
 ఒకవేళ ఫిల్మ్‌ ఇండస్ట్రీవాళ్లు పొరపాటు చేసి ఉంటే, వాళ్లను పిలిచి, కౌన్సెలింగ్‌ ఇస్తే సరిపోయి ఉండేదేమో. ‘ఇదే ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌’ అని చెబితే బాగుండేదేమో. వేరే రంగాల్లోనూ ఉన్నారు కదా. కొంతమంది పేర్లు బయటపెట్టలేమని డిపార్ట్‌మెంట్‌ అంటోంది. దాన్నెలా అర్థం చేసుకోవాలి? పెద్దవాళ్లను ఎలా వదిలే స్తారు? వాళ్లను ఎందుకు ఫ్రేమ్‌లోకి తీసుకురాలేదు. ఇదెక్కడి న్యాయం?  పక్షపాతం ఎందుకు? నైజీరియా వాళ్లు తీసుకొస్తున్నారా? బ్రెజిల్‌ వాళ్లు తీసుకొస్తున్నారా? డ్రగ్స్‌ సరఫరా ఎలా జరుగుతోంది? అని కూపీ లాగాలి. వాళ్లను కఠినంగా శిక్షించాలి. పబ్స్‌ని ఎందుకు మూయ డం లేదు? పబ్‌లు మన కల్చర్‌ కాదు. ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే పబ్స్‌ని మూసేయాలి. డ్రగ్స్‌ వల్ల వేల మంది జీవితాలు నాశనమవుతున్నాయి. అందుకే అవసరమైతే ఉద్యమం చేయాలనుకుంటున్నా.

చెన్నై వెళ్లి శశికళగారిని కలిశారు కాబట్టి, ఆవిడతో చేతులు కలపాలనుకున్నారన్నది చాలామంది ఊహ..
జయలలితగారిది ప్రజలు ఎన్నుకున్న పార్టీ. మంచి మంచి పథకాలు ఉన్నాయి. ఐదేళ్ల పాటు ఉండాల్సిన పార్టీ. పళనీస్వామి, పన్నీర్‌ సెల్వం, శశికళ.. వీళ్లంతా కలసికట్టుగా పార్టీని నడిపిస్తే బాగుంటుందనుకున్నా. వీళ్లల్లో ఏ ఒక్కరి పక్షాన నిలబడాలని నేను అనుకోలేదు. ఆ పార్టీ ముందుకెళ్లాలనుకున్నాను. అంతే కానీ, వ్యక్తులతో సంబంధం లేదు.



జయలలిత టాపిక్‌ వచ్చింది కాబట్టి... ఆవిడ మరణం ఓ మిస్టరీ అని చాలామంది ఫీలింగ్‌?
జయలలితగారి మరణంలో మిస్టరీ లేదమ్మా. నిజంగా ఆవిడకు ఒంట్లో బాగాలేదు. 1998 నుంచి నేను ఆవిడతో పని చేస్తున్నా. అప్పట్నుంచి జయలలితగారికి షుగర్, బీపీ ఉన్నాయి. ఒకానొక దశలో ఆవిడ వల్ల కాకపోతే క్యాంపెయిన్‌కు నన్ను వెళ్లమని రిక్వెస్ట్‌ చేశారు. అప్పుడు నేను బీజేపీలో ఉన్నా క్యాంపెయిన్‌కి వెళ్లి వాళ్ల అభ్యర్థులను గెలిపించా. అప్పుడే ఆమెకు కాళ్ల ఆపరేషన్‌ చేశారు. ఆవిడకు షుగర్‌ విపరీతంగా ఉండేది. మిస్టరీ ఏం లేదు. అంత పెద్ద హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ జరుగుతున్న టైమ్‌లో హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ఆల్మోస్ట్‌ రెండు మూడు రోజుల్లో ఇంటికి వచ్చేస్తారని అనుకుంటున్న టైమ్‌లో ఘోరం జరిగింది. నేను అక్కడి డాక్టర్లతో మాట్లాడాను.

తెలంగాణ పరిపాలనపై మీ అభిప్రాయం?
తప్పులు ఎక్కువైతే మాట్లాడక తప్పదు కదా! తెలంగాణ పరిపాలనపై మాట్లాడాల్సిన సందర్భం వచ్చినట్టుంది. ఆల్మోస్ట్‌ మూడేళ్లయింది. నేను కొంచెం టైమ్‌ ఇచ్చా. ఇక, మాట్లాడాల్సిన టైమ్‌ ఆసన్నమైంది.

ఒసేయ్‌ రాములమ్మ’కి పార్ట్‌ 2 చేయాలనుకున్నారని ఓ టాక్‌. బహుశా దాసరిగారు ఉండి ఉంటే అది జరిగేదేమో...
దాసరిగారు నాకోసం మూడు సబ్జెక్ట్స్‌ రెడీ చేస్తూ వచ్చారు. ‘ఒసేయ్‌ రాములమ్మ–2’ స్టోరీ కూడా వర్కవుట్‌ చేశారు. ఆ తర్వాత ఇండియన్‌ పాలిటిక్స్‌కి సంబంధించి ఒక పొలిటీషియన్‌ జీవితంతో బయోపిక్‌ ప్లాన్‌ చేశారు. హిందీలో ‘గులాబ్‌ గ్యాంగ్‌’ సినిమా టైప్‌లో ఒకటి చేయా లనుకున్నారు. ఆయన ఉండి ఉంటే.. సినిమా చేసి ఉండేదాన్ని. ఆర్టిస్ట్‌ని ఎలా డీల్‌ చేయాలో ఆయనకు బాగా తెలుసు. హీరోయిన్లను హుందాగా చూపించిన దర్శకుడు.  

ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించి కూడా తెలుసుకుంటుంటారా?
ఒక్కో స్టేట్‌లో అక్కడికి తగ్గ సమస్యలున్నాయి. అయితే మన స్టేట్‌లో ఎక్కువ ఉన్నాయి. ముందు దీన్ని ‘సెట్‌రైట్‌’ చేయాలి. రానున్న రోజుల్లో నా పోరాటం ఈ దిశలోనే ఉంటుంది.

ఈ ‘డీమానిటైజేషన్‌’, ‘జీఎస్‌టీ’.. వీటి వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా?
నాకు తెలిసి ప్రజలు లాభపడినట్లు అనిపించలేదు. మధ్యతరగతివాళ్లు, దిగువ మధ్యతరగతులవాళ్లు ఇబ్బందుల పాలవుతున్నారు. డబ్బులు తెచ్చుకోవడానికి ఏటీయంల ముందు ఎన్నేసి గంటలు నిలబడ్డారో, ఎన్నిసార్లు బ్యాంకుల చుట్లూ తిరిగారో తెలిసిందే. జీఎస్‌టీ తర్వాత రేట్లు ఇంకా పెరిగాయేమో అనిపిస్తోంది. ఏ విధానాలనైనా ప్రజల మేలు కొరకు ప్రవేశపెట్టాలి కానీ, వాళ్లను ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేయకూడదు.

ఫైనల్లీ మీకు ‘సి.ఎం. విజయశాంతి’ అనిపించుకోవాలనే కోరిక ఉందా?
సినిమాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు ఇంకా సక్సెస్‌ వస్తే బాగుంటుందనిపిస్తుంది. సూపర్‌స్టార్‌ అయితే బాగుంటుందనిపిస్తుంది. ఏ ఆర్టిస్ట్‌కైనా ఇలాంటి ఫీలింగ్‌ ఉంటుంది. టాప్‌ పొజిషన్‌కి రావాలనుంటుంది. అలాగే, రాజకీయాల్లో పందొమ్మిదేళ్లు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్ని అవకాశాలొచ్చినా పక్కన పెట్టి... తెలంగాణ సాధించేవరకు నా మైండ్‌లోకి ఏదీ తీసుకోనని భీష్మించుకుని కూర్చుని అంత నిజాయితీగా పనిచేసి, టార్గెట్‌ రీచ్‌ అయ్యా. తెలంగాణ సాధించా. ఇప్పుడు దేవుడు, ప్రజలు అవకాశం ఇస్తే... సి.ఎం. కావడంలో తప్పు లేదు. సి.ఎం. అని మీరంటున్నారు. నా దృష్టిలో అది కూడా సేవే. పేరుకు మాత్రమే సి.ఎం. కానీ, వర్క్‌ చేయాలి. అనుకున్నదాంట్లో 60, 70 శాతం చేసినా సక్సెస్‌ అవుతాం. కానీ, ఎందుకో చాలామంది పని చేయడం లేదు. చెప్పేది చెబుతున్నారు. చేతల్లో అది ఉండడం లేదు.

– డి.జి. భవాని

మరిన్ని వార్తలు