హై బీపీ కౌన్సెలింగ్

26 May, 2015 23:40 IST|Sakshi

నా వయసు 40. ఇటీవలే తల తిరుగుతుంటే డాక్టర్‌ను సంప్రదించి బీపీ చెక్ చేయించుకున్నాను. అప్పుడు నా బీపీ 140/94 ఉంది. డాక్టర్ వరసగా ఐదు రోజుల పాటు ఎక్కడైనా చెక్ చేయించుకొని ఆ విలువలతో మళ్లీ రమ్మన్నారు. ఈ ఐదు రోజులూ మాకు దగ్గర్లోని ఒక ఫార్మసీలో నర్స్ దగ్గర చెక్ చేయించుకుంటే 120/80 ఉంది. నాకు బీపీ ఉన్నట్లా లేనట్లా?
 - సుధీర్‌కుమార్, నల్లగొండ

మీరు డాక్టర్ వద్ద చెక్ చేయించుకున్నప్పుడు వచ్చిన బీపీ ఎక్కువే ఉంది. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు కలిగే యాంగ్జైటీవల్లనో, ఆందోళన కారణంగానో వచ్చే బీపీని ‘వైట్ కోట్ హైపర్‌టెన్షన్’ అంటారు. మీరు ఫార్మసీలో చెక్ చేయించినప్పటి విలువలు నార్మల్‌గానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. మీరు చెప్పిన కింది విలువ 94 చాలా ఎక్కువ. ఏదైనా తేడా ఉన్నప్పుడు అది ప్లస్ లేదా మైనస్ 10 ఉండవచ్చు. కానీ మీరు పేర్కొన్న కింది విలువ 94 ఉండటం అంత మంచి సూచన కాదు. బీపీని కొలిచే సమయంలో నిశితత్వం కూడా అవసరం. కాబట్టి ఈసారి మీరు రోజులోని ఏదో ఒక నిర్ణీత సమయంలో బీపీ కొలతను ఐదురోజుల పాటు తీసుకోండి. అది కూడా ఏ ఫార్మసీ దగ్గరో కాకుండా సర్టిఫైడ్ ఫిజీషియన్ దగ్గరకు వెళ్లి తీసుకోండి. ఆ విలువ నార్మల్‌గా ఉంటే మీకు బీపీ లేనట్టే. ఒకవేళ ఆ విలువలు 140/85 ఉంటే అది ప్రీ-హైపర్‌టెన్షన్ దశగా భావించి, మీ జీవనశైలిలో మార్పులతో బీపీని అదుపులో పెట్టుకోవచ్చు.
 
 డాక్టర్ సుధీంద్ర ఊటూరి,
 కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్,
 కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
 

మరిన్ని వార్తలు