అబ్రకదబ్ర

26 Aug, 2015 23:26 IST|Sakshi
అబ్రకదబ్ర

హిప్నో క్వీన్

ఓం హ్రీం... హ్రీం ఓం...  అంటే చాలు... మంత్రాలకు వశమైన స్థితిలో  మనిషి కొండల్ని పిండి చేసేస్తాడు. కోతిని చూసీ వణికిపోతాడు. మంత్రగాడు కోరితే మహా బలుడైపోతాడు, మంత్రగాడు ఆదేశిస్తే మహా భయస్థుడూ అయిపోతాడు. ఏమిటీ వింత అంటే... అంతా మన మైండ్ చేసే మాయాజాలమే అంటున్నారు తొలి టీనేజ్ హిప్నాటిస్ట్ సరోజారాయ్.
 
‘‘మంత్ర తంత్రాలేమీ ఉండవు. మనలో ఉన్న అంతర్గత శక్తుల్ని మేల్కొలిపితే ఏమైనా చేయగలం. ‘నేనింతే చేయగలను. ఇంతే ఆలోచించగలను’ అని మనల్ని మనం ట్యూన్ చేసుకోవడం వల్ల మైండ్ ఆ విధంగా సెట్ అయిపోయి, సాధారణ పనులతోనే సరిపెట్టుకుంటున్నాం. అంత మాత్రాన మనలోని అసాధారణ శక్తియుక్తులు నిర్వీర్యమైపోవు. నిద్రాణంగా ఉంటాయంతే. వాటిని మేల్కొలపడంలో హిప్నాటిజం గొప్ప సాధనం’’ అంటున్న సరోజారాయ్... దీనితో మూఢనమ్మకాలను  తొలగించడంతో పాటు వ్యాధుల్ని నయం చేయవచ్చునంటోంది. హిప్నో షోస్ నిర్వహించే తొలి టీనేజి మహిళా హిప్నాటిస్ట్ ఘనత దక్కించుకున్న సరోజారాయ్... ప్రస్తుతం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నివసిస్తోంది. చిన్న వయసులోనే హిప్నాటిస్ట్‌గా ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకుంది. హిప్నోని ఇంటిపేరుగా మార్చుకున్న తండ్రి కమలాకర్, తల్లి పద్మా కమలాకర్‌ల బాటలో మహిళలు అరుదుగా మాత్రమే ఎంచుకునే వృత్తిని ఎంచుకున్న సరోజారాయ్ (18) సాక్షి ఫ్యామిలితో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే....

సామాజిక అవసరం గుర్తించి...
మూడేళ్ల పిన్న వయసులోనే మ్యాజిక్ షోస్ చేసిన అనుభవం  ఉంది. పెద్దయ్యాక ఆటోమొబైల్ ఇంజనీర్‌ని అవుదామనుకున్నాను. అయితే చిన్నప్పటి నుంచి అమ్మానాన్నల ప్రొఫెషన్‌ను గమనించడం, ఆ ప్రొఫెషన్ అవసరం సమాజానికి అంతకంతకూ పెరుగుతోందని గుర్తించడం నన్ను కూడా ఇదే రంగాన్ని ఎంచుకునేందుకు ప్రేరేపించాయి.

జనానికి చేరువ చేయాలని...
 సినిమాల కారణంగా హిప్నాటిస్ట్‌లు అంటే జనంలో  ముఖ్యంగా మహిళల్లో ఒక రకమైన వ్యతిరేక అభిప్రాయం ఏర్పడిపోయింది.  కేవలం నాలుగ్గోడల మధ్య ప్రాక్టీస్‌కే పరిమితం కాకుండా ప్రజల్లో ఉన్న దురభిప్రాయాన్ని తొలగించి, వారికి దీని వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాలని ప్రదర్శనలకు శ్రీకారం చుట్టాను. అంతేకాకుండా దొంగ బాబాలు, నకిలీ స్వామిజీలు చేసే చిన్న చిన్న మాయల వలలో పడకుండా జనాన్ని చైతన్యవంతుల్ని చేయడం కూడా ప్రదర్శనలకు మరో కారణం. నాకు మేజిక్‌లో సైతం ప్రవేశం ఉంది కాబట్టి... ఈరెండిటినీ మేళవించి మరింత ప్రభావవంతంగా ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నా. ప్రజల్లో శాస్త్రీయ పరమైన అవగాహన పెరిగితే ఎన్నో రకాల సమస్యలు దూరమవుతాయని నా నమ్మకం’’ అంటూ ముగించింది సరోజారాయ్.

వందల, వేల మంది ఎదురుగా అపరిచితుడైన ఒక వ్యక్తి మైండ్‌ని మన అధీనంలోకి వచ్చేలా చేసే స్టేజ్ హిప్నాటిజం అతి క్లిష్టమైన ప్రక్రియ.  ‘‘ఛాలెంజ్ కాబట్టే ఇది ఎంచుకున్నాను’’అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పే సరోజారాయ్ స్వచ్ఛంద సంస్థలతో  కలిసి పనిచేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలకు నిధుల సేకరణ నిమిత్తం ప్రదర్శనలు ఇవ్వడంలో ముందుంటోంది. హిప్నోధెరపిస్ట్‌గా మరెన్నో ఘనవిజయాలు సాధించే లక్ష్యంతో ముందడుగేస్తోంది.    - ఎస్.సత్యబాబు
 

మరిన్ని వార్తలు