మహా పతివ్రత గాంధారి

20 Oct, 2019 02:04 IST|Sakshi

స్త్రీ వైశిష్ట్యం – 13

ఈ దేశంలో కొంతమంది స్త్రీల చరిత్ర పరిశీలిస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి ఉదాత్త స్త్రీలలో గాంధారి ఒకరు. ఆమె సుబలుడనే గాంధార రాజు కుమార్తె. మహా సౌందర్యవతి. మెరుపు తీగ. ఎక్కువ మంది సంతానం కలగాలని వరం పొందింది. సకల సుగుణ రాశి. చిత్రాంగదుడు, చిత్ర వీర్యుల దగ్గరనుంచీ ఎప్పుడూ సంతానం లేక కురువంశం బాధపడుతూ ఉండేది. కురువంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యులవారు ఆమెను తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయాలనుకున్నారు. ధృతరాజు పుట్టుకతో కళ్ళులేనివాడు. అటువంటి వ్యక్తిని అంత సౌందర్య రాశి ఎందుకు వివాహం చేసుకోవాలి? సుబలుడు అడిగాడు–‘అమ్మా! నీ కిష్టమేనా’ అని. ఆమె మామూలుగా అంగీకరించడం కాదు, అపారమైన ఔదార్యంతో అంగీకరించింది.

ఎవరివలన అవతలివారి వంశం నిలబడితే, కళ్ళులేనివాడు తాను కూడా బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏముంటుందని అంగీకరించింది. మహాతల్లి ఇంకా ఏమందో తెలుసా...‘‘నా భర్త ఏవి చూసి సంతోషించడంలేదో అవి చూసి నేను కూడా సంతోషించను..అని చెప్పి తన కళ్ళకు గుడ్డ కట్టేసుకుంది. భర్త పెను వేప విత్తు. పరమ దుష్ట ఆలోచనలున్నవాడు, పెద్ద కొడుకు దుర్యోధనుడు. నూరుగురు కొడుకులు. అల్లుడు సైంధవుడు, నీచుడు.. ఇంతమంది దుష్టుల మధ్యలో ఆమె పుటం పెట్టిన బంగారం. ఆమె ఔదార్యం ఎంతటిదంటే– ఒకనాడు ధృతరాష్టుడ్రు భార్యని పిలిచి అడిగాడు..‘‘పాండవులకు రాజ్యం ఇవ్వకుండా మన కుమారుడికి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. పట్టమహిషివి.

నీ అభిప్రాయం ఏమిటి?’’... ఆమె కుండబద్దలు కొట్టినట్లు జవాబిచ్చింది–‘‘ మహారాజా ‘ మీకడుపున పుట్టిన దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మీకు తెలియదా! వాడు నీచుడని తెలిసీ, రాజ్యం ధర్మంగా రాదని తెలిసీ, పాండురాజు కొడుకైన ధర్మరాజుకు వెడుతుందని తెలిసీ ఎందుకు కుట్ర చేస్తారు? మీ తమ్ముడి బిడ్డలు మీ బిడ్డలు కారా? ధర్మరాజుకు దక్కవలసిన రాజ్యం అతనికి ఇవ్వలేరా? కొడుకు, కొడుకన్న పుత్ర వ్యామోహంలోపడి ఎందుకు పరుగెడుతుంటారు? మీరు చక్రవర్తులు, మీరెలా ఇవ్వాలనుకుంటే అలా ఇవ్వవచ్చు. ఈ కురు సామ్రాజ్యన్నంతటినీ ధర్మరాజుకు ధారాదత్తం చేస్తే ఎదురుపడి ఆపగలిగిన వాళ్లున్నారా? భీష్మద్రోణాదులు ధర్మపక్షాన నిలబడరా.

దుర్యోధనుడు నిన్ను చెణకగలడా? వాడిని ధర్మరాజు దగ్గరపెడితే వాడు వశవర్తియై బతకడా? అప్పటికయినా బుద్ధి మార్చుకోడా? మీ కొడుకు దీర్ఘాయుర్దాయం అంతా మీ చేతిలోనే ఉంది మహారాజా! మీ బిడ్డలని పుత్ర పాశములకు వశపడవద్దు. రాజ్యాన్ని ధర్మరాజుకు, ఆయన తమ్ముళ్ళకి ఇచ్చేయండి.’’ నిజంగా ఎటువంటి ఇల్లాలు ఆ తల్లి, అలా నిలబడగలిగిన వాళ్లు ఈ లోకంలో ఉంటారా? నూరుగురు కొడుకులు చచ్చిపోయిన తరువాత ధర్మరాజు వచ్చి ‘‘అమ్మా! నీ బిడ్డలను అందరినీ చంపిన పాపిష్టివాడిని నేనేనమ్మా, ధర్మం కోసం చంపానే గానీ, నా అంత నేను చంపలేదమ్మా! అది తప్పనిపిస్తే  నన్ను కాల్చేయమ్మా’’ అన్నాడు. ఆమె ఒక్కమాట అనలేదు. కళ్ళవెంట నీరు కారింది. ధర్మరాజుని కౌగిలించుకుంది. కాన్నీ ఒక్క బిడ్డకూడా బతికిలేడనే బాధతో ఆమె చూసినపుడు కళ్ళగంత ఒక్కసారి సడలి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజంతటివాడి కాళ్ళు బొబ్బలెక్కాయి. అంతటి పతివ్రత గాంధారి.

మరిన్ని వార్తలు