హెచ్‌ఐవీ ఏమో... ఏం చేయాలి?

29 Dec, 2015 08:30 IST|Sakshi

ఆండ్రాలజీ కౌన్సెలింగ్
 
నాకు 22 ఏళ్లు. బి.టెక్. ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇటీవలే మా క్లాస్‌మేట్‌తో కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొన్నాను. పది రోజుల తర్వాత మూత్రంలో మంట మొదలైంది. ఇది జరిగి మూడు నెలలు అవుతోంది. ఆ అమ్మాయికి వేరే అబ్బాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయని  తెలిశాక హెచ్‌ఐవీ వస్తుందేమో అని భయం వేసి, పరీక్ష  చేయించాను. నెగెటివ్ అని చెప్పారు. అయితే విండో పీరియడ్‌లో రిజల్ట్ సరిగా రాదని తెలిసి, మళ్లీ ఆందోళన మొదలైంది. నాకు హెచ్‌ఐవీ లేదని కన్‌ఫర్మేషన్ కోసం ఇంకే పరీక్షలు చేయించాలి?
 - జీ.ఆర్.కె., హైదరాబాద్

హెచ్‌ఐవీ నిర్ధారణ విషయంలో హెచ్‌ఐవీ ఎలీసా, వెస్ట్రన్ బ్లాట్ త్వరగా నిర్ధారణ చేయగలిగే పరీక్షలు. విండో పీరియడ్ అంటే వ్యాధి సోకడానికి, అది పరీక్షల ద్వారా బయటపడటానికి మధ్యన ఉండే సమయం. అంటే... విండో పీరియడ్‌లో పరీక్ష చేయిస్తే ఒకవేళ శరీరంలో హెచ్‌ఐవీ కారక ఇన్ఫెక్షన్ ఉన్నా పరీక్షల్లో మాత్రం తెలియదన్నమాట. ఎలీసా టెస్ట్‌లో ఈ  విండో పీరియడ్ ఆర్నెల్ల వరకు పట్టవచ్చు. అదే వెస్ట్రన్ బ్లాట్ అయితే కొన్ని వారాల లోపే తెలుస్తుంది. అందుకే సెక్స్ తర్వాత వెస్ట్రన్ బ్లాట్‌గాని, ఎలీసాగాని మొదట చేయించి, ఆ తర్వాత మూడు నెలలకోసారి పరీక్ష చేయించి, నెగెటివ్ ఫలితం వస్తే మీరు నిశ్చింతగా ఉండవచ్చు. పెళ్లి వరకూ సెక్స్‌లో పాల్గొనకుండా ఉండటం అటు శారీరక ఆరోగ్యానికీ, ఇటు నైతిక, సామాజిక ఆరోగ్యానికి కూడా మంచిది.
 
నా వయసు 24. గత పదేళ్లుగా రోజూ రెండుసార్లు హస్తప్రయోగం అలవాటు. స్ఖలనం తర్వాత నీరసంగా అనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా అంగం మీద నరాలు పెద్దగా కనిపిస్తున్నాయి. పూర్వంలా అంగస్తంభనలు కలగడం లేదు. నాకు సరైన సలహా ఇవ్వండి.
 - వి.ఎన్.ఆర్

యువకుల్లో ఆర్థిక, కెరియర్‌పరమైన బాధ్యతలు పెరుగుతుండటంతో అంగస్తంభనలు తగ్గినట్లుగా అనిపిస్తుంటాయి. ఇక అంగం మీద నరాలు (రక్తనాళాలు) కనిపిస్తుండటం అన్నది ఒక సమస్యే కాదు. ఇలా నరాలు ఉబ్బినట్లుగా కనిపించడానికి, అంగస్తంభనలు రాకపోవడానికి సంబంధమే లేదు. ఉదయం వేళల్లో నిద్రలో మీకు అంగస్తంభనలు కలుగుతుంటే మీరు అన్నివిధాలా నార్మలే.
 
డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ
 అండ్ కిడ్నీ హాస్పిటల్,
కెపిహెచ్‌బి, హైదరాబాద్

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 67. కొంతకాలంగా మూత్రం సరిగ్గా రావడం లేదు. కొంచెం కొంచెంగా చుక్కలుగా పడుతోంది. రాత్రివేళల్లో మళ్లీ మళ్లీ మూత్రానికి వెళ్లాల్సి వస్తోంది. నా సమస్య ఆపరేషన్ అవసరం లేకుండా హోమియో ద్వారా నయమవుతుందా?
 - విశ్వనాథరావు, హైదరాబాద్


మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు బినైన్ ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ ఉండే అవకాశం ఉంది. సాధారణంగా వయసు పైబడిన వాళ్లలో ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. కొందరి విషయంలో 45 ఏళ్ల నుంచే ప్రోస్టేట్ గ్రంథి పెరగడం ప్రారంభం కావచ్చు. ఇలా జరగడం మాత్రం సాధారణమే. ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల యూరిన్ పూర్తిగా బయటకు రాకుండా మూత్రాశయంలోనే నిల్వ ఉండటం, రాత్రి మళ్లీ మళ్లీ సడన్‌గా మూత్రానికి వెళ్లాల్సిరావడం, మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, మంట, మూత్రవిసర్జన కోసం చాలా ఎక్కువగా ముక్కుతూ ఒత్తిడి కలిగించాల్సి రావడం, మూత్రం చుక్కలు చుక్కలుగా పడటం, విసర్జన సమయంలో మంట, మూత్రం చుక్కలతో పాటు ఒక్కోసారి రక్తం కూడా రావడం వంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ వచ్చిన గ్రంథి క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఈ పరిస్థితి కాస్త అరుదు. మీకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోడానికి ‘ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్’ (పీఎస్‌ఏ) పరీక్ష చేయించుకోవాలి. అలాగే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా లేక కేవలం ఎన్‌లార్జిమెంటేనా అని తెలుసుకోడానికి కొన్ని మూత్రపరీక్షలు, యూరోఫ్లోమెట్రీ వంటి పరీక్షలు అవసరం.

హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ కోసం హోమియోలో ఆర్నికా, లైకోపోడియం, అర్జెంటమ్ నైట్రికమ్, బెరైటా కార్బ్, కిమేఫిల్లా, హైడ్రాంజియా, ఆయోడమ్, సబల్ సెరులేటా, సల్ఫర్, తూజా వంటి చాలా మంచి మందులున్నాయి.
 వ్యాధి లక్షణాలను బట్టి ఈ మందులను ఆక్యూట్ దశలో ఇవ్వవచ్చు. అదేవిధంగా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బెల్లడోనా, కాంథారిస్, నైట్రిక్ యాసిడ్, పల్సటిల్లా, సైలీషియా, స్టెఫిసాగ్రియా, తూజా వంటి చాలా మందులు వాడవచ్చు. మీరు మొదట పీఎస్‌ఏ పరీక్ష చేయించుకుని, ఈ సమస్యకు చికిత్స చేయగల నిపుణులైన హోమియో వైద్యుడిని సంప్రదించండి.
 
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్

 
డర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 21. నాకు ముఖమంతా మొటిమలు, మచ్చలు ఉన్నాయి. దాంతో నేను క్లిండామైసిన్, మెలాగ్లో ఆయింట్‌మెంట్స్‌ను ఒక నెలరోజులపాటు పైపూతగా వాడాను. అయినా ఫలితం లేకపోవడంతో డాక్టర్ దగ్గరకెళ్లాను. ఆమె సూచించిన మందులను మూడునెలలపాటు వాడాను. కానీ ప్రయోజనం కనిపించలేదు. ఈ మొటిమలు, మచ్చలతో నా ముఖం అందవికారంగా తయారైంది. దయచేసి మీరు తగిన పరిష్కారం సూచించగలరు.
 - అఖిల, ఈ మెయిల్

ఇప్పటికే మీరు సొంతంగా కొన్ని, వైద్యసలహాతో మరికొన్ని మందులు చాలా రోజులపాటు వాడారు. అయినా ఫలితం లేదంటున్నారు కాబట్టి చర్మవ్యాధుల నిపుణులను కలిసేలోగా మీరు మెడికేటెడ్ సన్‌స్క్రీన్ లోషన్ వాడండి. మీరు చర్మవ్యాధుల నిపుణులను కలిస్తే, అసలు మీకెందుకలా మొటిమలు, మచ్చలు వస్తున్నాయనేది తగిన పరీక్షలు చేసి, కనుక్కుంటారు. ఒకవేళ హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తున్నట్లయితే కనక అందుకు తగిన మందులు ఇస్తారు.  మందుల వల్ల ప్రయోజనం లేకపోతే లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా వాటిని తగ్గిస్తారు. ఆందోళన వద్దు.

నా వయసు 45. నా హీమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి, నా గర్భసంచి తొలగించారు. అప్పటినుంచి నాకు విపరీతంగా జుట్టు ఊడిపోతోంది. దీనికితోడు నా ఛాతీ మధ్యభాగంలో చిన్న మచ్చ ఏర్పడింది.  దయచేసి, తగిన సలహా చెప్పండి.
 - కె. నందిని, హైదరాబాద్

సాధారణంగా ఐరన్ లోపం వల్ల, విటమిన్ బీ 12 లోపం వల్ల జుట్టు రాలిపోవడం జరుగుతుంటుంది. ప్రస్తుతం మీ రక్తంలో ఫెర్రెటిన్, బీ 12 ఎంత శాతం ఉందో పరీక్ష చేయించుకుని, డెర్మటాలజిస్ట్‌ను కలవండి. వాటి శాతం తక్కువగా ఉంటే తగిన మందులు ఇస్తారు. మీరు తెలియజేసిన వివరాలను బట్టి మీ ఛాతీపైన మచ్చ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండవచ్చునని భావిస్తున్నాను. దానికి పై పూతగా యాంటీ ఫంగల్ క్రీములు వాడటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మీరు వెంటనే మంచి డెర్మటాలజిస్ట్‌ను కలవండి.
 
డాక్టర్ రే ఖాసింగ్
కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్
ఒలీవా అడ్వాన్స్‌డ్ హెయిర్
అండ్ స్కిన్ క్లినిక్

మరిన్ని వార్తలు