పరిశుద్ధతతోనే ప్రభువు సన్నిధి

5 Mar, 2015 23:39 IST|Sakshi
పరిశుద్ధతతోనే ప్రభువు సన్నిధి

యెరూషలేములో దేవుని కోసం గొప్ప మందిరాన్ని కట్టాలన్నది దావీదు చక్రవర్తి కోరిక. కాని ఆయన కుమారుడైన సొలోమోను దాన్ని కట్టేందుకు దేవుడు అనుమతించాడు. ఆ మందిర ప్రతిష్ట సందర్భంగా దేవుడు ఆ మందిరంలో తన సన్నిధి దయ చేస్తానని వాగ్దానం చేశాడు. అయితే ప్రజలు తన ఆజ్ఞలు, విధి విధానాలు ఉల్లంఘిస్తే మందిరాన్ని తన సన్నిధి నుండి తోసి వేస్తానని కూడా దేవుడు హెచ్చరించాడు (2 దిన 7:12-22). సొలోమోను, దేవుని ప్రజలు కూడా క్రమంగా దేవునికి దూరం కాగా, ఆ తర్వాత తొమ్మిది వందల ఏళ్లలో ఆ మందిరం శత్రురాజుల దాడుల్లో పూర్తిగా ధ్వంసమైంది. సొలోమోను జీవితంలాగే, ఆ మందిరం కూడా వైభవం కోల్పోయింది.
 ‘దేవుని సన్నిధి’ని పొందేందుకు చరిత్రలో మానవుడు చేయని ప్రయత్నం లేదు.

కానుకలిచ్చి, సత్కార్యాలు చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చునన్న బాలశిక్ష స్థాయి ఆలోచనలు నేటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఆధునిక జీవన శైలి మాత్రం మనిషిని నానాటికీ దేవుని నుండి దూరం చేస్తోంది. నేటి డిజిటల్ యుగంలో అరవై శాతం ప్రజలు పది నిమిషాలు మాట్లాడితే కనీసం రెండు అబద్ధాలాడుతున్నారన్నది ఒక సర్వేలో తేలిన అంశం. అంటే అపరిశుద్ధతకు మనం ఎంత చేరువగా జీవిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. తుపాకి గురిపెట్టే వద్ద అంగుళంలో పదోవంతు తేడా వస్తే లక్ష్యాన్ని తాకడంలో బుల్లెట్ అడుగు మేరలో తప్పిపోతుందట. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లే, అప్రధానంగా కనిపించే అంశాలే పెనుతుఫానులుగా మారి ఆధునిక జీవితాల్లో అశాంతిని మిగుల్చుతున్నాయి. అంధుడికి రంగు అనే మాట తెలుస్తుందేమో కాని ఏ రంగు ఎలా ఉంటుందో ఎన్నటికీ అర్థం కాదు. దేవుని పరిశుద్ధతకు చెందిన అవగాహన లేకుండా ఆయన సాన్నిధ్యం తాలూకు శక్తి, సంపూర్ణత, విస్తృతత్వం కూడా అర్థం కాదు. ‘‘ఇంతకీ నీవెవరవని ఫరోకు చెప్పాలి?’’ అని మోషే దేవుణ్ణి అమాయకంగా అడిగాడు.

దానికి దేవుడు తన గొప్పతనాన్ని, ప్రభావాన్ని వర్ణించి చెప్పలేదు కానీ, ‘‘నేను ఉన్నవాడను’’ అని చెప్పమంటూ ముక్తసరిగా జవాబిచ్చాడు. అంటే నీ మాటల్లో, ఆలోచనల్లో ఫరో నీ దేవుని శక్తిని గుర్తిస్తాడు అని పరోక్షంగా చెప్పాడన్నమాట. అదే జరిగింది కూడా. ఒకప్పుడు ఫరోకు భయపడి పారిపోయిన మోషే ఇప్పుడు దేవుని పక్షంగా అతనితో మాట్లాడుతూంటే హడలిపోయి ఫరో దేవుని ప్రజలకు దాస్యవిముక్తినిచ్చాడు. అది చర్చి అయినా, జీవితమైనా, కుటుంబమైనా పరిశుద్ధత లేని చోట ప్రభువు ఉండడు. సంపూర్ణమైన విధేయత, నిబద్ధత లేకుండా పరిశుద్ధత అలవడదు. ఆ దేవుని సాన్నిధ్యం తాలూకు శక్తి, ప్రభావం విశ్వాసి మాటల్లో, చేతల్లో ప్రతిఫలించి అతన్ని అజేయునిగా నిలుపుతుంది.
 - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్
 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా