హోలీ... రంగెలా వదిలేది?

3 Mar, 2015 23:46 IST|Sakshi
హోలీ... రంగెలా వదిలేది?

హోలీ... అందరికీ ఎంతో ఇష్టమైన, సరదా అయిన పండుగ. రంగులు వెదజల్లుకునే ఆ పండుగ నాడు... జీవితానికే ఓ కొత్త రంగును వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రపంచమంతా కలర్‌ఫుల్‌గా మారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే పండుగ వరకూ ఓకే గానీ... ఆ తర్వాతే వస్తుంది అసలు తంటా.

ఒంటికి, బట్టలకి అయ్యే రంగుల్ని వదిలించేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. అలా అని రంగులు చల్లుకోకుండా ఉండలేం కదా. అందుకే హ్యాపీగా పండుగ చేసుకోండి. ఆ తర్వాత రంగుల్ని వదిలించుకోవడానికి ఈ చిట్కాలు ఫాలో అయిపోండి!
 
 ఒంటి రంగులకి: శెనగపిండిలో పాలు, పెరుగు, బాదం నూనె, రోజ్‌వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి, ఒళ్లంతా పట్టించి, కాసేపుంచి కడిగేసుకుంటే రంగు వదిలిపోతుంది. కొబ్బరినూనెని కొద్దిగా వెచ్చబెట్టి, దానితో ఒళ్లంతా మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఫలితముంటుంది.  కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి ఒళ్లంతా రుద్దుకుని, ఆపైన స్నానం చేస్తే రంగులు పోతాయి. కొన్నిసార్లు ఒళ్లంతా వదిలిపోయినా, ముఖానికి అంటిన రంగు మాత్రం త్వరగా వదలదు. అలాంటప్పుడు ముల్తానీ మట్టితో ప్యాక్ వేసుకుంటే మంచిది.

రంగులు చర్మానికి అంటుకుపోయి దురదగా అనిపిస్తే... గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి రాసుకుని, గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే దురద పోతుంది.తలకు అంటిన రంగుల్ని వదిలించడానికి... పెరుగులో గుడ్డు తెల్లసొనను కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత షాంపూతో తలంటుకుంటే సరిపోతుంది. బట్టల రంగులకి బట్టలపై రంగుల మరకలు ఉండిపోతే... నిమ్మరసంతో రుద్ది, వేడి నీళ్లతో ఉతికితే పోతాయి.అరకప్పు వైట్ వెనిగర్‌లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్‌ను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లని నీటిలో వేసి కలిపి, అందులో బట్టల్ని నానబెట్టాలి. కాసేపటి తర్వాత తీసి ఉతికితే రంగులు తేలికగా పోతాయి.
     
వేడి నీటిలో బ్లీచింగ్ పౌడర్ వేసి నానబెట్టి ఉతికితే ఫలితముంటుంది. అయితే క్లోరిన్ లేని బ్లీచ్‌నే వాడాలి.మార్కెట్లో కలర్ రిమూవర్స్ కూడా దొరుకుతాయి. వాటిని ఉపయోగిస్తే అసలు సమస్యే ఉండదు. వాషింగ్ మెషీన్‌లో ఉతకాలనుకుంటే... విప్పిన బట్టల్ని ముందు నీటిలో జాడించి అప్పుడు మెషీన్లో వేయండి. అలాగే డిటర్జెంట్ పౌడర్‌తో పాటు కాస్త వైట్ వెనిగర్‌ను  వేస్తే, రంగులు మెషీన్‌కు అంటుకోకుండా ఉంటాయి!
 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా