హోలీ టూర్

5 Mar, 2015 23:43 IST|Sakshi
హోలీ టూర్

- నిర్మలారెడ్డి
 
 యాంత్రికంగా సాగిపోయే జీవితాల్లో పండగ ఒక ఆనందసౌరభాన్ని నింపుతుంది. అందుకే పండగను బంధుమిత్రుల మధ్య ఆకాశమే హద్దుగా అనిపించే ఆనందాన్ని సొంతం చేసుకునేలా జరుపుకుంటారు. దాంట్లో భాగంగా మన దగ్గర పండగల సంఖ్య ఎక్కువే ఉంది. వాటన్నింటిలో ప్రత్యేకమైనది హోలీ. కొత్త అందాలు నింపుకున్న ప్రకృతి సిరులలో తడిసి ముద్దవడానికి ప్రతి ఒక్కరూ తహతహలాడతారు. అందులో భాగంగానే రంగులను చల్లుకొని, ఉత్సాహాన్ని ఎద నిండా నింపుకుంటారు. వయసు తేడా లేకుండా జరుపుకునే ఈ ఆనందకేళీ విలాసానికి మూలం మన భారతదేశమే! ఆ సౌరభాలను తమ జీవితంలోనూ నింపుకోవడానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపుతుంటారు. ఉత్తర భారతదేశంలో ఇంపుగా సాగి, దక్షిణభారత దేశాన్ని అందంగా పలకరించి, విదేశాలలోనూ కాలు మోపిన రంగుల పండగను వీక్షించడానికి మన దగ్గరా కొంతమంది బయల్దేరుతారు. వారిలో పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లు, కళాకారులు, చిత్రకారులూ.. ఉంటారు.
 
వారం రోజుల ముందుగానే...


ఉత్తరప్రదేశ్‌లో మథురకు దగ్గరగా ఉండే బర్సానా, నంద్‌గావ్‌లలో విభిన్నంగా హోలీని జరపుకుంటారు. హోలీకి వారం రోజుల ముందు నుంచే ఉత్సవాలను జరపుతారు. ఆ విధంగా ఫిబ్రవరి 27 నుంచే ఉత్సవాలు జరుపుతారు. ఇందులో ముందుగా నంద్‌గావ్ గ్రామం నుంచి మొదలైన ఉత్సవం మార్చి 1 నాటికి బృందావనంలోని బాంకే బిహారీ మందిరం వద్ద అత్యంత వైభవంగా జరుపుతారు. హోలీ రోజున లడ్డూలను పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటారు. రాధాకృష్ణులకు సంబంధించిన ఆధ్యాత్మిక బృందగీతాలను మధురంగా ఆలపిస్తారు.

నలభై రోజుల ముందుగానే..

మథుర, బృందావనాల్లో నలభై రోజుల ముందుగానే వసంత పంచమి రోజున హోలీని వేడుకగా నిర్వహిస్తారు. ఢిల్లీ నుంచి మథుర, బృందావనం చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. కృష్ణుడు జన్మించిన స్థలం మధుర. పెరిగింది బృందావనంలో. అందుకే ఇక్కడ వేడుక అత్యంత వైభవంగా ఉంటుంది. పశ్చిమబెంగాల్‌లోని శాంతినికేతన్‌లో వసంతం అత్యంత వేడుకగా జరుపుతారు. బెంగాల్ చరిత్రలో, సంస్కృతిలో హోలీకే అత్యంత ప్రాధాన్యం. హోలీ నాటికి ఇక్కడకు అధికసంఖ్యలో విదేశీ యాత్రికులు వస్తారు. భారతదేశంలో అత్యంత ప్రాచీనకాలం నుంచే ఇక్కడ హోలీ ఉత్సవాలు జరుపుతున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి.

పశ్చిమబెంగాల్‌లోని పురులియా జిల్లాలో హోలీ వేడుక కనులారా చూడాల్సిందే, ఆ రంగుల్లో మునిగితేలాల్సిందే అని యాత్రికులు చాలా ఉత్సాహపడతారు. ఇక్కడ జానపద కళలు ఈ సమయంలో ఊపందుకుంటాయి. ముఖ్యంగా చావ్ నృత్యం, దర్బారి ఝుమర్, నటువా డ్యాన్స్‌తో పాటు జానపద పాటలను ఉత్సాహభరితంగా ఆలపిస్తారు. కలకత్తా నుంచి ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి 5-6 గంటల సమయం పడుతుంది. కలకత్తా నుంచి ప్రైవేటు రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి. వసతి సదుపాయాల కోసం ఇక్కడ టెంట్లు అద్దెకు ఇస్తారు. పంజాబ్ రాష్ట్రంలోని ఆనందపూర్‌లో సిక్కులు అత్యంత వైభవంగా హోలీని జరుపుతారు. పంజాబ్ పర్యాటక శాఖ చంఢీగఢ్ నుంచి నాలుగు రోజుల పాటు ‘హోలా మొహల్లా టూర్’ను ఆఫర్ చేస్తోంది.

రాచరికపు  హంగుల హోలీ...

ఉదయపూర్‌లో రాచరికపు హంగుల మధ్య హోలీని వేడుకగా జరుపుతారు. హోలీ ముందురోజు అంటే పౌర్ణమి రాత్రిలో దుష్టశక్తులను దూరం చేయడానికి జరిపే ఈ వేడుకలో మేవాడ్ రాజరిక కుటుంబం పాల్గొంటుంది. పట్టణంలోని మేనక్ చౌక్ ప్యాలెస్ పరిసరప్రాంతాలలో రాత్రిపూట గుర్రపు డెక్కల చప్పుడు, బ్యాండ్ వాయిద్యాల హోరు హృదయాన్ని లయ తప్పిస్తాయి. రాచరికపు హంగుల మధ్య సంప్రదాయ పద్ధతిలో హోలికా దహనాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంత సందర్శనకు టూరిజమ్ వారిని సంప్రదించాలంటే ఫోన్: +919910900630

మురికివాడల సహజత్వం హోలీ...

ముంబయ్‌లో హోలీ వేడుకను చూడాలంటే ధారావి ప్రాంతానికి వెళ్లాల్సిందే! ధారావి ముంబయ్‌లోని అతి పెద్ద మురికివాడ. ఇక్కడ ఉండే సహజత్వం నడుమ... మురికివాడల బాలల ఉత్సాహాన్ని చూడాలనుకునే యాత్రికులు ఇక్కడకు లెక్కకు మించి వస్తారు. అంతేకాదు ఇక్కడ అన్ని చోట్ల కన్నా అత్యంత సురక్షితంగా స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. పూర్తిగా రంగులు, సంగీతపు హోరును ఆస్వాదించవచ్చు. అలాగే ఆధ్యాత్మికులలో 80 శాతం మంది ఈ ప్రాంతానికి విచ్చేసి మురికివాడల జనాలకు సహాయాలు చేస్తుంటారు.
 
ఏనుగమ్మ ఏనుగు...

జైపూర్‌లో హోలీ పండగ రోజునే ఏనుగుల పండగ జరుపుతారు. ఆ విధంగా హోలీ అంటే జైపూర్‌లోనే చూడాలనుకునే యాత్రికులు ఎంతోమంది. ఏనుగుల విన్యాసాలు, జానపద నృత్యాలు... కన్నుల పండువగా జరుగుతాయి. స్థానికులతో పాటూ విదేశీయాత్రికులూ ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. దీంతో ఇక్కడ హోలీ సంబరం రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ హోలీ వేడుక అత్యంత ఆధునికంగా ఉంటుంది. దగ్గరలోని పహడ్‌గంజ్‌లో రంగులు అమ్మే దుకాణదారులు, కొనుగోలు దారులు, పిల్లలతో అత్యంత సందడిగా ఉంటుంది. ఇక్కడ రంగుల కేళీ, సంగీతపు హోరు పట్టణానికి కొంత దూరంలో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పర్యావరణ హితంగా వేడుకను జరపుకోవడం విశేషం. సహజమైన రంగులతో పాటు వీధుల్లో అమ్మే ఆహారపదార్థాలు సైతం కల్తీ లేకుండా ఉండటం ప్రత్యేకత.
 ఉత్తరాదితో పోల్చితే దక్షిణభారతదేశంలో హోలీ హంగామా కొంత తక్కువనే చెప్పాలి. కర్నాటకలోని హంపిలో ఉదయం వేళలో మాత్రమే హోలీ జరుపుకుంటారు. విదేశీ యాత్రికులు ఆ సమయానికి ఇక్కడకు చేరుకుంటారు. ఇక్కడ డప్పు వాద్యాలు, నృత్యాలు, పరుగుల మధ్య రంగులు జల్లుకోవడం.. నాటి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కడతాయి. రంగులు చల్లుకోవడం పూర్తయ్యాక అందరూ నదీ స్నానం చేసి ఇళ్లకు చేరుకుంటారు.

విదేశాలలోనూ కనులకు విందుగా...

ముస్లిం దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లోనూ హోలీ వేడుకలను అక్కడక్కడా తిలకించవచ్చు. బంగ్లాదేశ్‌లో హిందూ, బౌద్ధం కూడా ప్రధానంగా కనిపిస్తుంటాయి. హిందువులతో పాటూ ఇక్కడ ముస్లింలూ హోలీ పండగలో పాల్గొని మత సామరస్యతను చాటుతుంటారు. హిందూ దేవాలయాలు, కూడలిలో ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఈ దేశాలతో పాటు మారిషస్, నేపాల్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, అమెరికాలోనూ రంగుల పండగను అత్యంత వేడుకగా జరుపుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయా దేశాలలో భారతీయులు స్థిరపడటమే!
 
బృందాలుగా  ప్రయాణం...

సాంస్కృతిక పరంగా ప్రత్యేక పండగలను స్పెషలైజ్డ్ టూర్లు అంటాం. ప్రత్యేకమైన హోలీ ఉత్సవాన్ని తిలకించడానే కాదు, పండగలో తామూ భాగవం కావడానికి ఎక్కువగా యురోపియన్, అమెరికా యాత్రికులు మనదేశానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. మన దగ్గర నుంచి కొంతమంది బృందాలుగా ఏర్పడి హోలీ పండగ బాగా జరపుకునే ప్రాంతాలను ఎంచుకొని వెళుతుంటారు. ఒక్కో బృందంలో 30 నుంచి 40 మంది వరకు ఉంటారు. రంగుల నడుమ వచ్చే ఉత్సాహాన్ని ఒక్కొక్కొరు ఒక్కోవిధంగా వెంట తెచ్చుకుంటారు.
 - ఎస్.శంకర్ రెడ్డి, అసిస్టెంట్ డెరైక్టర్, ఇండియాటూరిజమ్
 మరిన్ని వివరాలకు... ఇండియాటూరిజమ్, పర్యాటకభవన్, బేగంపేట్, హైదరాబాద్
 ఫోన్: 040-23409199
 

మరిన్ని వార్తలు