దూరాన్ని, దాస్యాన్ని తొలగిస్తూ చిరిగిన తెర !!!

28 Apr, 2019 00:55 IST|Sakshi

సువార్త

కల్వరిలో యేసు మరణసమయంలో యెరూషలేములోని మహా దేవాలయపు తెర మధ్యలో  పైనుండి కిందికి చిరగడం ఒక గొప్ప అద్భుతం. అసలు ఆనాటి ఆ యూదు దేవాలయ నిర్వహణ, నిర్మాణమే ‘ప్రజలను దేవునికి దూరంగా పెట్టడం’ అనే సంప్రదాయంతో సాగింది. దేవాలయ ప్రాంగణంలో మహిళల కోసం, యూదులు కాని అన్యుల కోసం అంటూ మంటపాలను విడి విడిగా కట్టి ఉంచారు. యూదుస్త్రీలకు, యూదులు కాని అన్యులకు దేవాలయ ప్రవేశం లేదు. వారు ఆవరణంలోని మంటపాల దాకా మాత్రమే వెళ్ళాలి.  ఇక యూదు పురుషుల కోసమైతే మరో విశాలమైన మంటపాన్ని కట్టారు. వాళ్లకు కూడా అక్కడిదాకానే ప్రవేశార్హత. ఆవరణం మధ్యలో బలి అర్పణల కోసం ఒక బలిపీఠాన్ని నిర్మించారు. బలి పీఠాన్ని యూదులు కూడా తాకడానికి లేదు. కేవలం యాజకులు మాత్రమే బలిపీఠం దాకా వెళ్తారు, వాళ్ళే బలులర్పిస్తారు. ఆవరణలో నుండి దేవాలయం లోనికి వెళ్ళడానికి చాలా మెట్లుంటాయి.

అంటే దేవాలయం చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. ఇక దేవాలయం మొత్తం పవిత్ర స్థలం, అతి పవిత్ర స్థలం అని రెండు భాగాలుగా నిర్మించబడింది. పవిత్ర స్థలం లోనికి ఆయా పూజా విధుల నిర్వహణ కోసం, అందుకు ప్రత్యేకించబడి, ప్రతిష్ట చేయబడిన యాజకులు మాత్రమే అది కూడా నిర్ణీత విధానంలో ప్రవేశించాలి. పవిత్ర స్థలంలోకి యాజకులు కూడా పూజా కార్యక్రమాలకోసమే వెళ్ళాలి తప్ప, ఆషామాషీగా ఎప్పుడంటే అప్పుడు వెళ్లేందుకు దేవుని అనుమతి లేదు. ఇక దేవుని నివాస స్థలంగా పరిగణించబడే అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకులు కూడా ప్రవేశించరాదు. ప్రధాన యాజకుడొక్కడే అది కూడా ఏడాదికొక్కసారి మాత్రమే ప్రజలందరి ప్రాయశ్చిత్తం కోసం ‘ప్రాయశ్చిత్త దినం’ నాడు ప్రత్యేక దుస్తులు ధరించి అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తాడు. లేవీకాండం 16వ అధ్యాయంలో ఆ వివరాలుంటాయి.

యూదులకు అత్యంత ప్రాముఖ్యమైన ఆరాధనా ప్రక్రియను ప్రధాన యాజకుడు అతిపవిత్ర స్థలంలో, పాప పరిహారార్థ బలి వస్తువును చేత పట్టుకొని వెళ్లి అక్కడున్న కరుణాపీఠాన్ని ఆశ్రయించాలి. ఎన్ని లక్షల మంది యూదులున్నా వాళ్ళెవరూ ఆ స్థలంలోకి ఎవరూ కనీసం తొంగి చూడకూడదు. అందుకే యాజకులను, భక్తులను దూరంగా ఉంచడానికి పవిత్ర స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య పొడవాటి తెర వేలాడుతూ ఉంటుంది. అక్కడి దేవాలయ నిర్మాణం, వాతావరణమంతా ఇలా భయం భయంగా ‘ఇక్కడ దేవుడున్నాడు. ఆయన అత్యంత పరిశుద్ధుడు, మీరు అత్యంత పాపులు. అందువల్ల మీరంతా దేవునికి దూరంగా ఉండండి’ అని ఖండితంగా హెచ్చరిస్తున్నట్టుగా ఉంటుంది. దేవాలయ యాజమాన్యం, వ్యవహారాలన్నీ ధర్మశాస్త్ర నిబంధనల మేరకు జరగాలి.

ధర్మశాస్త్ర ఉల్లంఘన జరిగితే మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలుంటాయి. ధర్మశాస్త్రపు దాస్యం నుండి, దాని శిక్షావిధి నుండి యేసుప్రభువు సిలువయాగం ద్వారా యేసుప్రభువులో యూదులకే కాదు మానవాళి యావత్తుకూ దేవుడు స్వేచ్ఛను ప్రకటించాడు (రోమా 8:1) అందుకు సూచనగా, శుభారంభంగా దేవుడే దేవాలయపు అడ్డు తెరను చించేశాడు. యాజకులు, యాజకేతరులు, స్త్రీలు, పురుషులు, పాపులు, నీతిమంతులు, భక్తులు, ధర్మకర్తలనే విభేదాలు లేని ఒక ఆత్మీయ సమసమాజావిర్భావం దేవుని హృదయాభిలాష మేరకు కల్వరిలో యేసు ఆత్మత్యాగం ద్వారా జరగడమే గుడ్‌ ఫ్రైడే నాటి ప్రత్యేకత. ఒక విధంగా తండ్రియైన దేవుడే తన రక్షణ ప్రణాళికలో భాగంగా తన అద్వితీయ కుమారుడైన యేసులో మానవాళికంతటికీ ‘మతస్వేచ్ఛ’ను ప్రకటించి పరలోక ద్వారాలను పూర్తిగా తెరిచాడు.

అలా దేవుని కృపా యుగం ఆరంభమయింది. దేవుడంటే అక్కడెక్కడో ఎవరికీ అందకుండా, ఎవరికీ కనిపించకుండా, సామాన్యులకు అందుబాటులో లేకుండా దూరంగా ఉండేవాడన్న ధర్మశాస్త్ర యుగపు చీకటి రోజులకు దేవుడే తెర వేస్తూ ఆయన మానవాళికంతటికీ అందుబాటులోకి వచ్చిన పరలోకపు తండ్రి అయ్యాడు. దేవునితో మనిషి అనుభవించిన యుగయుగాల ఎడబాటుకు, అనాథత్వానికి దేవుడే ఇలా ఒక పరిష్కారాన్నిచ్చాడు. దేవాలయపు అడ్డు తెర చిరగడంతో విశ్వాసుల ఆత్మీయ స్వేచ్ఛకు అంకురార్పణ జరిగి క్షమాయుగం. కృపాశకం ఆరంభమైంది.

మరిన్ని వార్తలు