గుండె, ఊపిరితిత్తుల మార్పిడితో పీపీహెచ్‌కు చెక్‌!

29 Jun, 2017 00:00 IST|Sakshi
గుండె, ఊపిరితిత్తుల మార్పిడితో పీపీహెచ్‌కు చెక్‌!

హార్ట్‌ అండ్‌ లంగ్‌ కౌన్సెలింగ్‌

మా అబ్బాయి వయసు 22 ఏళ్లు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసి కాంపస్‌ సెలక్షన్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కానీ అంతలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీలో నొప్పి– తీవ్రమైన అసౌకర్యం, గుండెదడ, శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఇక్కడి డాక్టర్లకు చూపిస్తే ఏవో పరీక్షలు చేసి వాడికి పీపీహెచ్‌ అనే వ్యాధి ఉందని చెప్పారు. గుండె, ఊపిరితిత్తులు రెండూ చెడిపోయాయయని చెబుతున్నారు. ఏవో మందులు రాశారుగానీ ప్రాణానికి ప్రమాదం అంటున్నారు. గుండె, ఊపిరితిత్తులు రెండింటి మార్పిడితోనే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందంటున్నారు. ఈ వ్యాధి ఏమిటి? ఎందుకు వస్తుంది? వాడు మా ఒక్కగానొక్క కొడుకు. వాడిని రక్షించుకునే మార్గం సూచించండి. – పి. అంజమ్మ, నకిరేకల్‌

మీ అబ్బాయికి వచ్చిన వ్యాధి ప్రైమరీ పల్మునరీ హైపర్‌టెన్షన్‌. దీని సంక్షిప్త రూపమే ఈ పీపీహెచ్‌. అరుదైన ఈ వ్యాధిలో ఊపిరితిత్తుల్లో రక్తపోటు విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి రక్తనాళాల వెడల్పు తగ్గి ఇరుకుగా తయారవుతాయి. తీవ్రమైన ఈ వ్యాధి కారణంగా గుండె, ఊపిరితిత్తులు రెండూ దెబ్బతింటాయి. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరిగిపోయి, ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి కలుగుతుంది. అయితే అంతమాత్రం చేత ఆశలన్నీ వదులుకోనవసరం లేదు. ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనల వల్ల, కొత్త మందుల ఆవిష్కరణ వల్ల, అవయవ మార్పిడిలో నూతన శస్త్రచికిత్స మెళకువలు అభివృద్ధి చెందడం వల్ల పీపీహెచ్‌కు ఇప్పుడు నమ్మకమైన చికిత్స అందుబాటులో ఉంది. దాని ద్వారా రోగి జీవితకాలాన్ని పొడిగించవచ్చు.

పీపీహెచ్‌ రావడానికి స్పష్టమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ కొన్ని కుటుంబాలలో పీపీహెచ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. మన దేశంలో ఏటా పది లక్షల మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. పీపీహెచ్‌ మొదటిదశలో డాక్టర్లు నిర్వహించే సాధారణ వైద్యపరీక్షల్లోనే ఈ వ్యాధి బయటపడుతుంది. వ్యాధి ముదిరిన తర్వాత మాత్రం పీపీహెచ్‌ లక్షణాలు... గుండె జబ్బులు, శ్వాసకోశ రుగ్మతల్లాగా కనిపించి కాస్త తికమకపెడతాయి. కానీ మీరు తెలిపిన విషయాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి సాధారణ వైద్యపరీక్షలతోనే ఈ వ్యాధి నిర్ధారణ అయ్యిందని తెలుస్తోంది. దీన్ని బట్టి బహుశా అది ప్రాథమిక దశలోనే ఉండి ఉండాలి. అలాగైతే మందులతోనే దానికి చికిత్స చేయివచ్చు. కొన్ని జాగ్రత్తలతో అతడు సాధారణ జీవితం గడపవచ్చు.

ఒకవేళ ఇందుకు భిన్నంగా మీ అబ్బాయికి వ్యాధి ముదిరి ఉన్నా నిరాశపడాల్సిన పనిలేదు. గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లయితే అవయవ మార్పిడితో ప్రాణాలు కాపాడవచ్చు. పైగా మీ అబ్బాయి యువకుడు అయినందువల్ల గుండె, ఊపిరితిత్తులు రెండింటి మార్పిడికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే పీపీహెచ్‌ వల్ల ఒక బాలిక గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా తిన్నా... కంబైన్‌డ్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా ఆమెకు మా హాస్పిటల్‌లోనే అవయవమార్పిడి చేసి రక్షించగలిగాం. మూడు నెలల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న ఆ బాలిక ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. కాబట్టి మీరు మీ అబ్బాయి విషయంలో నిరాశపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు పెద్ద ఆసుపత్రికి వెళ్లి చూపించుకోండి. అక్కడ ఛాతీ ఎక్స్‌రే, ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, పల్మునరీ ఫంక్షన్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు నిర్వహించి వ్యాధి ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ చేస్తారు. పరిస్థితిని చూసి చికిత్స ప్రారంభించవచ్చు. ఒకవేళ గుండె, ఊపిరితిత్తులు మార్చాల్సిన అసవరం వస్తే డాక్టర్లు గుర్తించిన వెంటనే ఆ అవయవాల కోసం ప్రభుత్వ నిర్వహణలో ఉన్న జీవన్‌దాన్‌ సంస్థలో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. దాత లభించేంతరకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆందోళన చెందకుండా మీరు మీకు దగ్గర్లోని పెద్ద హాస్పిటల్స్‌లోని గుండెనిపుణులకు చూపించుకొని వారి సూచన మేరకు అవసరమైన తదుపరి ఏర్పాట్లు చేసుకోండి.
డాక్టర్‌ పి.వి. నరేశ్‌ కుమార్
సీనియర్‌ కార్డియో–థొరాసిక్, హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌.


పాపకు తరచూ జలుబు.... ఎందుకిలా?
పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌


మా పాప వయసు ఏడేళ్లు. ఆమెకు తరచూ జలుబు చేస్తోంది. ఇటీవల ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రుళ్లు ముక్కులు బిగదీసుకుపోయి ఊపిరితీసుకోవడం సాఫీగా జరగడం లేదంటూ ఏడుస్తోంది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నా ఫలితం కేవలం తాత్కాలికమే. మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి.
– రమాసుందరి, శ్రీకాకుళం

మీరు రాసిన లక్షణాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్‌ అనేది ముక్కు లోపలి పొర ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల వస్తుంది. ఇలాంటివారిలో మీరు చెప్పిన జలుబు మాత్రమే కాకుండా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కులోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా  కనిపిస్తాయి. ఇటీవల రైనైటిస్‌ కేసులు పెరుగుతున్నాయి. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి. మరికొందరిలో సీజనల్‌గా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న  చాలామందిలో అది ఏదో ఒక అలర్జీ వల్ల సంభవించడం మామూలే. అయితే కొద్దిమందిలో అలర్జీతో సంబంధం లేకుండానూ, మరికొద్దిమందిలో ఇతరత్రా నాన్‌ ఇన్ఫెక్షియస్‌ కారణాల వల్ల కూడా కనిపించవచ్చు.

అంటే... అలర్జెన్స్‌ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్‌సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్‌ డిస్టర్బెన్సెస్‌) వల్ల కూడా వస్తుందన్నమాట. అరుదుగా కొన్నిసార్లు హార్మోన్లలో సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక మీ పాప విషయంలో ఇది ఇడియోపథిక్‌ అలర్జిక్‌ రైనైటిస్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టమే  అయినప్పటికీ–  కంప్లీట్‌ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్‌ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్‌ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్‌ నేసల్‌ డ్రాప్స్‌), యాంటీహిస్టమైన్‌ గ్రూపు మందులు వాడాల్సి  ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్‌ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువులు, దుమ్మూ ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.
డా. రమేశ్‌బాబు దాసరి,
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్,
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు