ఇంటిపంటలే ఆరోగ్యదాయకం

10 Dec, 2019 06:26 IST|Sakshi
లత కృష్ణమూర్తి మిద్దెతోటలో ఆకుకూరలు

హైదరాబాద్‌ కుషాయగూడలో లత, కృష్ణమూర్తి వృద్ధ దంపతులు రెండేళ్ల నుంచి తాము నివాసం ఉంటున్న బంధువుల ఇంటిపైన సేంద్రియ ఇంటిపంటలు పండించుకొని తింటూ ఆరోగ్యంగా, సంతోషంగా గడుపుతున్నారు. కృష్ణమూర్తి ప్రభుత్వ రంగ సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా రిటైరైన తర్వాత కుషాయగూడలోని బావ గారి ఇంటి మొదటి అంతస్థులో నివాసం ఉంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలను కలుషిత జలాలతో పండిస్తున్నారన్న వార్తలు చదివిన తర్వాత తమ ఆరోగ్యం కోసం మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవాలని నిర్ణయించుకున్నామని లత కృష్ణమూర్తి తెలిపారు.

బరువు తక్కువగా ఉంటుందని గ్రోబాగ్స్‌లోనే ఎక్కువ భాగం ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వారి మిద్దెపై 300–400 గ్రోబాగ్స్‌లో పచ్చని పంటలు పండుతున్నాయి. ఆకుకూరలు, కూరగాయలతోపాటు పండ్ల మొక్కలు కూడా ఇందులో ఉన్నాయి. బోరు లేదు. నీటి అవసరాలకు కుళాయి నీరే ఆధారం కాబట్టి డ్రిప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రోబాగ్స్‌లో కొయ్య తోటకూర, మెంతికూర, చుక్క కూరలతో ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టానని లత తెలిపారు. మొదట్లో చాలా సమస్యలు వచ్చినా అనుభవం నుంచి నేర్చుకున్నారు.

చౌహన్‌ క్యు, పాలేకర్‌ బాటలో...
ఎర్రమట్టి 20 శాతం, కొబ్బరిపొట్టు 25 శాతం, 55 శాతం పశువుల ఎరువు+వర్మీకంపోస్టుతోపాటు గుప్పెడు వేపపిండి కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని గ్రోబాగ్స్‌లో నింపి ఇంటిపంటలను దిగ్విజయంగా సాగు చేస్తున్నారు లత కృష్ణమూర్తి. సౌత్‌ కొరియా ప్రకృతి వ్యవసాయ నిపుణుడు చౌహన్‌క్యు చూపిన బాటలో ఇంటిలో లభించే ముడి సరుకులతోనే పోషకద్రావణాలను తయారు చేసుకొని పంటలకు ప్రతి వారం, పది రోజులకోసారి పిచికారీ చేయడం, మొక్కల మొదళ్లలో పోయడం ద్వారా మంచి దిగుబడులు సాధిస్తున్నారామె.

జీవామృతం స్వయంగా తయారు చేసుకొని ప్రతి 15 రోజులకోసారి పంటలకు అందిస్తున్నారు.
మునగాకు లేదా వేపాకు బరువుతో సమానంగా బెల్లం కలిపి 20 రోజుల తర్వాత లీటరుకు 1–2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం, మట్టిలో పోయడం ద్వారా అధిక దిగుబడి పొందుతున్నామని, చీడపీడల బెడద లేకుండా చక్కని ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండుతున్నాయని లత సంతృప్తిగా చెప్పారు. ఈ ఏడాది జూలై నుంచి గత వారం వరకు అసలు కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా పూర్తిగా తమకు ఇంటిపంటలే సరిపోయాయని ఆమె తెలిపారు.

అందరూ ఇంటిపంటలు పండించాలి
కలుషితనీరు, విషరసాయనాలతో పండించే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లకు బదులు నగరవాసులు అందరూ తమ ఇళ్లమీద పండించుకోవడం మంచిది. వారానికి కనీసం 3–4 రోజులైనా తాము పండించిన సేంద్రియ, తాజా కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. వాకింగ్‌కు వెళ్లేబదులు ఉదయం గంట, సాయంత్రం గంట పాటు ఇంటిపంటల్లో పనులు చేసుకుంటే మేలు. ఇంటిపంటల పనుల్లో నిమగ్నం అయితే టైం కూడా తెలవదు. మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మేము మంచి ఆహారం తీసుకోవడంతోపాటు విదేశాల్లో ఉన్న మా పిల్లలకు కూడా పొన్నగంటి కూర వంటి ముఖ్యమైన ఆకుకూరలను నీడలో ఆరబెట్టి పంపుతున్నందుకు ఆనందంగా ఉంది.  

– లత కృష్ణమూర్తి, ఇంటిపంటల సాగుదారు, కుషాయగూడ, హైదరాబాద్‌


కాకర కాయను చూపుతున్న లత కృష్ణమూర్తి

లత కృష్ణమూర్తి మిద్దెతోటలో పండిన కూరగాయలు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు