బ్రెయిన్‌లో బల్బు వెలిగితే!!

1 Nov, 2013 00:24 IST|Sakshi
బ్రెయిన్‌లో బల్బు వెలిగితే!!

కరెంట్ బల్బుల్లో ఫిలమెంట్ పోతే ఇక అవి వెలగవు. దీంతో వెంటనే వాటిని తీసేసి, కొత్త బల్బులను వాడుతుంటారు. మరి తీసేసిన బల్బులను ఏం చేస్తారు? బ్రెయిన్‌కు కాస్త పని పెడితే వెలగని బల్బులను చెత్తబుట్టకు చేర్చకుండా ఇంటి అలంకరణలో ఇలా ఉపయోగించవచ్చు. మన ఇంటి నుంచి చెత్తను ఎక్కువ చేర్చి పర్యావరణానికి హాని కలగించకుండానూ చేయవచ్చు.
 
వెలగని బల్బులను తీసుకోండి. అత్యంత జాగ్రత్తగా కటర్‌ని ఉపయోగించి పైన ఉండే అల్యూమినియమ్ మూత దగ్గర రంధ్రం చేయండి. రంగు రంగుల పేపర్లు చుట్టిన ఒక సన్నని వైర్‌ను లోపలికి సగం వరకు పంపించి, పైన మైనంతోనో, లేదా మరో బిరడాతోనో బిగించండి. ఆ బల్బులను ఇలా గోడకు వేలాడదీయండి.  బల్బు పైన అల్యూమినియం మూత, లోపలి ఫిలమెంట్ తీసేసి, చుట్టూరా రంగు రంగుల గాజు ముక్కలు అతికించండి. లోపల మైనం నింపి, ఒత్తి వేసి వెలిగించండి. దీపావళికే కాదు ఇతర రోజుల్లోనూ చూడచక్కని షోపీస్‌లా ఆకట్టుకుంటుంది.  బల్బులోపల సన్నని ఇసుక కొద్దిగా వేసి, పైన కృత్రిమమైన గడ్డిరంగు మొక్కలు అమర్చితే మరొక షోపీస్ తయారవుతుంది.  బల్బుల్లో ఫిలమెంట్ తీసేసి, నూనె పోసి ఒత్తిని వేసి వెలిగిస్తే లాంతరులా మారిపోతుంది.
 
 బల్బులో సగానికి నీరు నింపి, చిన్న మొక్క వేస్తే చాలు చూడముచ్చటైన ఇండోర్ ప్లాంట్ రెడీ!  బల్బుకు రంగు వేసి, పక్షి రెక్కలను అతికించి, కళ్లు, ముక్కు పెయింట్ చేస్తే పక్షి ఆకారం  ముందుంటుంది. పిల్లలనూ అమితంగా ఆకట్టుకుంటుంది.

 నోట్: బల్బులు గ్లాస్‌తో తయారవుతాయి. పగలడం, కోసుకోవడం..వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని వీటి తయారీలో చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవడం, కటింగ్‌కు కటర్, గాజు పెంకులు తీసేయడానికి స్పాంజ్... వంటివి అందుబాటులో ఉంచుకోవడం మర్చిపోవద్దు.
 

మరిన్ని వార్తలు