పెళ్లయి చాలాకాలమైనా ....

17 May, 2016 23:59 IST|Sakshi
పెళ్లయి చాలాకాలమైనా ....

పల్మునాలజీ కౌన్సెలింగ్
కుడి వైపున గుండె... లంగ్స్‌లో రంధ్రాలు..?
 

 

నా వయసు 35 ఏళ్లు. పెళ్లయి చాలాకాలమైనా పిల్లల్లేరు. డాక్టర్ పరీక్షించి నా గుండె కుడివైపు, నా లంగ్స్‌లో  రంధ్రాలు ఉన్నట్లు తెలిపారు. నా వీర్యంలో కౌంట్ చాలా తక్కువగా ఉందని చెప్పారు. ఏమిటీ సమస్య?  - ఒక సోదరుడు, హైదరాబాద్
మీరు చెబుతున్న అంశాలను బట్టి మీరు ‘కార్టెజెనెర్ సిండ్రోమ్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీకు సంక్రమించిన వ్యాధి కూడా ఊపిరితిత్తులకు వచ్చిన అతి అరుదైన వ్యాధి. ఇందులో  శరీరంలోని అంతర్గత అవయవాలు తారుమారు కావచ్చు. ఇది రెండు రకాలైన అసాధారణ లక్షణాలతో  ఇది కనిపిస్తుంది. మొదటిది... ప్రైమరీ సీలియరీ డైస్కినేసియా, రెండోది సైటస్ ఇన్వర్సస్. మొదటిదైన ప్రైమరీ సీలియరీ డైస్కినేసియా (పీసీడీ)లో ఊపిరితిత్తులను శుభ్రపరిచే సన్నటి వెంట్రుకల్లాంటివి  సాధారణంగా ఉండాల్సిన రీతిలో ఉండవు. నిజానికి ఈ సీలియరీ అవయవాలు లంగ్స్, ముక్కు, సైనస్‌లను శుభ్రపరచడానికి ఉపయోగపడే మ్యూకస్ పొరల లైనింగ్. సాధారణంగా ఇవి కాలుష్య పదార్థాలను పై వైపునకు తోసేస్తూ ఉంటాయి. కానీ ప్రైమరీ సీలియరీ డైస్కినేసియా ఉన్నవారిలో ఈ సీలియరీ అవయవాల్లో కదలికలు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి చాలా తక్కువగా ఉండటమో, రివర్స్‌లో కదులుతుండటమో జరుగుతుంది. ఉంటాయి. హానిచేసే బ్యాక్టీరియా బయటకు పోకుండా ఊపిరితిత్తుల్లోనే ఉంటూ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌ను కలగజేస్తాయి. దాంతో  దీర్ఘకాలిక సైనసైటిస్‌తో పాటు ఊపిరితిత్తుల్లో శాశ్వతమైన మార్పులు కలుగుతాయి. ఈ కండిషన్‌ను బ్రాంకియాక్టాసిస్ అంటారు. బ్రాంకియాక్టాసిస్ వల్ల ఎడతెరిపి లేకుండా దగ్గు, తీవ్రమైన అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇక రెండో అసాధారణత అయిన సైటస్ ఇన్వెర్సస్ ఉన్నవారిలో వారు తల్లి గర్భంలో ఉండగానే అవయవాలు తాము ఉండాల్సిన  ప్రదేశంలో ఉండకపోవచ్చు. రివర్స్‌లో ఉండవచ్చు. కార్టజెనెర్ సిండ్రోమ్ ఉన్నవారిలో మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తుంటాయి. అవి దీర్ఘకాలిక సైనసైటిస్, బ్రాంకియాక్టాసిస్, అవయవాలు తమ పొజిషన్ మారే సైటస్ ఇన్వర్సస్. ఈ కండిషన్‌తో పుట్టిన వారికి పెద్దయ్యాక వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండవచ్చు.  కొన్ని మందులు, టీకాలు, కార్టికోస్టెరాయిడ్స్‌తో ఈ వ్యాధిగ్రస్తుల్లో కొన్ని దీర్ఘకాలిక సమస్యలను అదుపులో ఉంచవచ్చు. మీరు ఒకసారి ఊపిరితిత్తుల నిపుణులను కలవండి.

 

డా॥రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్
అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్

 

హోమియో కౌన్సెలింగ్

నా వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా విరేచనాలు, మలబద్దకం... ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నాను. ఏ టైమ్‌లో విరేచనం అవుతుందో తెలియక  బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. ఎన్నో మందులు వాడాను. హోమియోలో దీనికి చికిత్స ఉందా?  - సునీల్‌కుమార్, కందుకూరు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే  సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్ద పేగుల్లోని అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసే వ్యాధి ఇది. ఈ సమస్యకు జీర్ణ వ్యవస్థలోని అసలు లోపమే కారణం. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితాలు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ వ్యాధి తాలూకు బాధలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు లేదంటే అసలు కొంతకాలం విరేచనం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పరీక్షల్లో మాత్రం పేగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎప్పుడు విరేచనాలు మొదలవుతాయో ఊహించలేని పరిస్థితి. దాంతో దూరప్రయాణాలు చేయలేరు. ఐబీఎస్ వ్యాధిగ్రస్తులు శక్తిహీనులవుతారు. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, నిరంతరం ఏదో ఒక వ్యాధికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది.


కారణాలు:  మానసిక ఒత్తిడి, ఆందోళన  సరైన సమయంలో భోజనం చేయకపోవడం  మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండటం  చికాకు, కోపం.


లక్షణాలు:  మలబద్దకం / విరేచనాలు  తరచూ కడుపునొప్పి రావడం  కడుపు ఉబ్బరం  విరేచనంలో జిగురు పడటం  భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం.

 హోమియో చికిత్స: మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే ఔషధాలను ఇస్తారు. ఈ సమస్యకు నక్స్‌వామికా, ఆర్సినిక్ ఆల్బ్, అర్జెంటికమ్ నైట్రికమ్, లైకోపోడియం, పల్సటిల్లా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియోలో వ్యక్తి రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి మందులు నిర్ణయిస్తారు. అవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి.

 

డాక్టర్ మురళి  కె. అంకిరెడ్డి  ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి  హైదరాబాద్

మరిన్ని వార్తలు