దేహంలోని నీరు పోతే...

10 Apr, 2017 00:48 IST|Sakshi
దేహంలోని నీరు పోతే...

నేను బిజినెస్‌ పనిమీద ఎక్కువగా ఎండలోనే గడపాల్సి ఉంటుంది. ఎండలు ఇప్పటికే తీవ్రం అయిపోయాయి. వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.
– సూర్యనారాయణ, ఖమ్మం

భానుడి అధిక తాపాన్ని తట్టుకోలేక చాలామంది వడదెబ్బకు గురవుతుంటారు. ఇది ఒక ప్రాణాంతకమైన పరిస్థితి అనే చెప్పవచ్చు. అన్ని వయసుల వారినీ బాధిస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులకు తాకిడి ఎక్కుడ. అధిక వాతావరణ ఉష్ణోగ్రతకు గురికావడం వల్ల శరీరం శీతలీకరణ వ్యవస్థ పనిచేయకపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత 102 ఫారెన్‌హీట్‌కు పెరిగి, కేంద్రనాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపడాన్ని వడదెబ్బ అంటారు. సాధారణంగా వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు... దేహం చెమటను స్రవించడం ద్వారా ఆ వేడిని తగ్గించుకుంటుంది.

ఎక్కువ సమయం ఎండకు గురవడం వల్ల చెమట ద్వారా నీరు, లవణాలు ఎక్కువగా పోతాయి. వాటిని మళ్లీ భర్తీ చేసుకోలేనప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో శరీరంలోని కణాలు రక్తంలోని నీటిని ఉపయోగించుకుంటాయి. దాంతో మన రక్తం పరిమాణం తగ్గుతుంది. గుండె, చర్మం, ఇతర అవయవాలకు తగినంత రక్తప్రసరణ అందదు. దాంతో శీతలీకరణ వ్యవస్థ మందగించి శరీర ఉష్ణోగ్రత అంతకంతకూ పెరిగిపోతుంది. దేహం వడదెబ్బకు లోనవుతుంది.

వడదెబ్బ లక్షణాలు:  ఎండదెబ్బకు గల లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 102 ఫారెన్‌హీట్‌ డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగిపోవడం, చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, వాంతులు, వికారం, విరేచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తక్షణం స్పందించి జాగ్రత్త తీసుకోకపోతే పరిస్థితి విషమిస్తుంది. వడదెబ్బకు లోనైన వ్యక్తి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:   నీరు, ఇతర ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి

ఎండలో తిరగడాన్ని తగ్గించాలి, తలపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

 వదులుగా ఉండే పల్చటి, లేతవర్ణం దుస్తులను ధరిస్తే మంచిది. మాంసాహారం, టీ, కాఫీ, మసాలాలు మానేయడం లేదా తక్కువగా తీసుకోవడం మేలు.

 కూరగాయలు, పప్పులు, పుచ్చ, నారింజ, ద్రాక్ష పండ్ల వంటి తాజాఫలాలు తీసుకోవాలి

రోజుకు 10 – 12 గ్లాసుల నీరు తాగాలి  మద్యం వల్ల దేహం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది

 పిల్లల్ని తీవ్రమైన ఎండలో ఆడనివ్వవద్దు. నీడపట్టునే ఉండేలా చూడాలి.

మరిన్ని వార్తలు