ఫైబ్రాయిడ్స్‌ మళ్లీ రాకుండా తగ్గించవచ్చా? 

11 Apr, 2019 05:07 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 44 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్‌ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు.  హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? 

గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 

1) సబ్‌సీరోజల్‌ ఫైబ్రాయిడ్స్‌ 2) ఇంట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌ 3) మ్యూకోజల్‌ ఫైబ్రాయిడ్స్‌. 
కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్‌ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్‌ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. 

లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్‌ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. 

చికిత్స: జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ 
ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

పీరియడ్స్‌ సక్రమంగా రావడం లేదు

మా అమ్మాయి వయసు 23 ఏళ్లు. హార్మోన్‌ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి. 

మనిషి జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటానికి హోర్మోన్లు అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండం ఏర్పడినప్పట్నుంచీ జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం కలిగి ఉంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లే శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి చాలా సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్‌ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్‌ అసమతౌల్యత వల్ల వచ్చేవే.

ఈ హార్మోన్ల సమతౌల్యత దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. థైరాయిడ్‌ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్‌ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్‌ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్‌ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి.

నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. అయితే మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేస్తే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్‌ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్‌ వంటి మంచిమందులే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. 

డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

నాకు ఇకనైనా సంతానం కలుగుతుందా? 

నా వయసు 33 ఏళ్లు. వివాహమై ఎనిమిదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? 

ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. 

స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు :
►జన్యుసంబంధిత లోపాలు
►థైరాయిడ్‌ సమస్యలు     
►అండాశయంలో లోపాలు; నీటిబుడగలు
►గర్భాశయంలో సమస్యలు
►ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు
►డయాబెటిస్‌
►గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. 

పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు :
►హార్మోన్‌ సంబంధిత సమస్యలు
►థైరాయిడ్‌
►పొగతాగడం
►శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం 

సంతానలేమిలో రకాలు :
►ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ  
►సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ 

ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్‌ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. 

సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ: మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్‌ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్‌ రావడం వల్ల సంభవిస్తుంది. 

గుర్తించడం ఎలా : తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్‌ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్‌ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. 

చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్‌ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. 

డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, 
హైదరాబాద్‌

 

మరిన్ని వార్తలు