హోమియోపతి కౌన్సెలింగ్

7 Jul, 2015 22:56 IST|Sakshi

నా భార్యకు పీసీఓడి.. ఏం చేయాలి?
 నా భార్య వయసు 32 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా?
 - సునీల్, అనంతపురం

 గర్భాశయానికి ఇరువైపులా అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాల్లో నీటిబుడగల వంటివి ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు. రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-18 రోజుల మధ్యకాలంలో రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే ఈ పీసీఓడీ సమస్య ఉన్నవారిలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా, అపరిపక్వమైన అనేక అండాలు నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోతాయి. చూడటానికి ఇవి ముత్యాల్లా కనిపిస్తుంటాయి. ఇలా రెండువైపులా కనిపిస్తుంటే దీన్ని వైద్యపరిభాషలో ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ.
 లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు.  రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో ప్రక్రియలో సరైన కాన్‌స్టిట్యూషన్ సిమిలియం విధానంలో హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.
 
 డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
 చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్,
 హైదరాబాద్
 

మరిన్ని వార్తలు