అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?

21 Mar, 2019 01:27 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 43 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంట, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్‌ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా

జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్‌ పొర ఇన్‌ఫ్లమేషన్‌ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్‌ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్‌ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.
 
కారణాలు: 
►20 నుంచి 50 శాతం అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది.

►తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం

►కొన్నిరకాల మందులు... ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం

►పైత్య రసం వెనక్కి ప్రవహించడం

►క్రౌన్స్‌ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు

►శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో

►ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్‌ సమస్య కనిపిస్తుంది. 

లక్షణాలు :

►కడుపు నొప్పి, మంట

►కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం

►అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు

►ఆకలి తగ్గిపోవడం

►కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : 

►సమయానికి ఆహారం తీసుకోవాలి

►కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి

►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి

►ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి  తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. 

చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.

డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ 
ఇంటర్నేషనల్, హైదరాబాద్‌


మైగ్రేన్‌ తలనొప్పి చికిత్సతో తగ్గుతుంది...

నాకు వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రమైన తలనొప్పి వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్‌–రే, స్కానింగ్‌ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? 

మైగ్రేన్‌ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్‌ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. 

మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు : సాధారణంగా మైగ్రేన్‌ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్‌ మైగ్రేన్‌ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. 

వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. 

నివారణ : మైగ్రేన్‌ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావరణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. 

చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటికి అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్‌ కన్‌స్టిట్యూటషన్‌ సిమిలియమ్‌ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. 

డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌
 
 

మీ సమస్య ఐబీఎస్‌ కావచ్చు

నా వయసు 35 ఏళ్లు. మధ్యానం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి.  తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. 

►మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు నిర్దిష్టమైన కారణం తెలియదు. అయితే...                

►జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు

►దీర్ఘకాల జ్వరాలు

►మానసిక ఆందోళన

►కుంగుబాటు

►ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం

►జన్యుపరమైన కారణలు

చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తుంటాయి. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్‌ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు వెళ్లాల్సివస్తుంది. ఐబీఎస్‌ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్‌ బ్రీత్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. 

వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : 

►పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి

►ఒత్తిడిని నివారించుకోవాలి

►పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లుంటే ఆయా అలవాట్లను పూర్తిగా మానుకోవాలి

►రోజుకు కనీసం ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. 

చికిత్స: ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాన్‌స్టిట్యూషనల్‌ సిమిలియమ్‌ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. 

డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

 

మరిన్ని వార్తలు