గ్యాస్ట్రయిటిస్‌ నయం అవుతుందా?

23 May, 2019 01:12 IST|Sakshi

నా వయసు 47 ఏళ్లు. కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరంతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్‌ అన్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియోతో నయమవుతుందా?

జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్‌ పొర ఇన్‌ఫ్లమేషన్‌ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్‌ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్‌ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.

కారణాలు:
►20 నుంచి 50 శాతం అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది
►తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం
►కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం
►పైత్య రసం వెనక్కి ప్రవహించడం
►కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్‌ డిసీజ్‌), కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు
►శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో
►ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్‌ సమస్య కనిపిస్తుంది.

లక్షణాలు:
►కడుపు నొప్పి, మంట
►కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం
►అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు
►ఆకలి తగ్గిపోవడం
►కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు:
►సమయానికి ఆహారం తీసుకోవాలి
►కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి
►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి
►ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి  తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి.

చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.

డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ,
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్,హైదరాబాద్‌

కాళ్లపై రక్తనాళాలు ఉబ్బుతున్నాయి... ఎందుకిలా?

నా వయసు 48 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై రక్తనాళాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా?

మీకు ఉన్న సమస్య వేరికోస్‌ వెయిన్స్‌. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్‌ వెయిన్స్‌ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల  రక్తప్రసరణ మందగిస్తుంది. సిరలు నలుపు/ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పితో నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్‌ వెయిన్స్‌ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది.సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్‌ వెయిన్స్‌ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

కారణాలు:
►ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం
►కొందరు మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు
►ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ.

లక్షణాలు:
►కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం
►కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం
►చర్మం దళసరిగా మారడం
►చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం

చికిత్స: వేరికోస్‌ వెయిన్స్, వేరికోసిల్‌ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో  అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని  మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.

డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా,ఎండీ (హోమియో),
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

మూత్రవిసర్జన సమయంలో మంట... తగ్గేదెలా?

నా వయసు 36 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు  ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి.

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు.
అప్పర్‌ యూరినరీ టాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్‌ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్‌ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు.

లోవర్‌ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్‌ను సిస్టయిటిస్‌ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్‌ను యురెథ్రయిటిస్‌ అంటారు.

కారణాలు: యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి.

లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం

చికిత్స: యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.

డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌


 

మరిన్ని వార్తలు