మెడనొప్పికి చికిత్స ఉందా?

27 Dec, 2019 00:17 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 56 ఏళ్లు. గత కొంతకాలంగా నేను తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. కొద్దిగా వణుకుతున్నాయి కూడా. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడభాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా?

మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్‌ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది.

కారణాలు:
►వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం
►క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం
►వృత్తిరీత్యా అధికబరువులు మోయడం
►ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం
►ఎక్కువసేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్వు సమయం మెడను వంచి ఫోన్‌లలో మాట్లాడటం
►ఎత్తైన దిండ్లు వాడటం
►మెడకు దెబ్బతగలడం
►మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం
►తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు :
►సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి
►నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం
►మెడ బిగుసుకుపోవడం
►తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం
►నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం
►చిన్న బరువునూ ఎత్తలేకపోవడం
►నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు.

హోమియో చికిత్స: జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

సైనసైటిస్‌ తగ్గుతుందా?
నా వయసు 28 ఏళ్లు. ఇటీవల నాకు రోజూ ఉదయంపూట తలనొప్పి వస్తోంది. రోజూ ముక్కుదిబ్బడ వేసి చాలా అసౌకర్యంగా ఉంటోంది. ముక్కు నుంచి నీరు కూడా అదేపనిగా కారుతూ చాలా ఇబ్బంది కలిగిస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సైనసైటిస్‌ అన్నారు. ఇంగ్లిషు మందులు వాడినా తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా?

వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్‌ సమస్య మొదలువుతుంది. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం పాటు వేధించే ఈ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడేవారు మన సమాజంలో చాలామందే ఉంటారు. ఈ సమస్యను మూడు విభాగాలుగా చూడవచ్చు. ఒకటి ఎక్యూట్‌. ఇది వస్తే వారం రోజులుంటుంది. రెండోది సబ్‌ఎక్యూట్‌. ఇది నాలుగు నుంచి ఎనిమిది వారాలుంటుంది. మూడోది క్రానిక్‌. అంటే దీర్ఘకాలంపాటు బాధించేది అని అర్థం.

కారణాలు : బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశవ్యాధులు, ముక్కులో ఎముక పెరగడం, అలర్జీ, పొగ, వాతావరణంలో ఉండే విపరీతమైన కాలుష్యం, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, ఈత (స్విమ్మింగ్‌ చేయడం), జలుబు, గొంతునొప్పి, పిప్పిపన్ను, టాన్సిల్స్‌ వాపు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి సైనసైటిస్‌కు కారణమవుతాయి.

వ్యాధి లక్షణాలు: సైనసైటిస్‌తో బాదపడేవారిలో తలనొప్పి, తలంతా బరువుగా ఉండటం, ముఖంలో వాపు, ముఖంలోని సైనస్‌లు ఉండే భాగాల్లో నొప్పి, ముక్కు దిబ్బడ వేస్తూ ఉండటం, ముక్కులో దురద పెడుతూ ఉండటం, ముక్కు నుంచి నీరు కారడం, గొంతులోకి ద్రవాలు స్రవిస్తూ ఉండటం, దగ్గు, జలుబు, చెవిలో చీము వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరచూ జలుబు చేస్తూ ఉండటం, దాంతో చాలా ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్‌ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు చేసినప్పుడు ముక్కులు బిగదీసుకుపోతాయి. తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస దుర్గంధంతో కూడి ఉండటం కూడా జరుగుతుంది.

చికిత్స: హోమియో చికిత్సలో శస్త్రచికిత్స అవసరం లేకుండానే సైనసైటిస్‌ను సమూలంగా తగ్గించవచ్చు. ఈ మందులతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇతర చికిత్స వల్ల తాత్కాలింగా ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. కానీ హోమియో చికిత్స వల్ల సైనసైటిస్‌ పూర్తిగా తగ్గిపోతుంది.  అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వారు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం వల్ల మళ్లీ మళ్లీ రాకుండా సమర్థంగా చికిత్స చేయవచ్చు.
డా‘‘ కె. రవికిరణ్,
మాస్టర్స్‌ హోమియోపతి, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా