తేనె పూసిన కత్తి అక్కరలేదు!

15 Oct, 2016 22:49 IST|Sakshi
తేనె పూసిన కత్తి అక్కరలేదు!

జెన్‌పథం


ఆయన ఓ జెన్ గురువు. ఊరూరూ తిరుగుతూ తోచిన నాలుగు మంచి మాటలు చెప్పడం ఆయనకు ఇష్టం. ఆయన వెళ్ళే ప్రాంతంలో ఎవైరనా ఏైదనా తినడానికి ఇస్తే అది తిని ఆకలి తీర్చుకునే వారు. ఎప్పుైడనా తినడానికి ఏదీ దొరకకపోయినా బాధపడేవారు కాదు. ఉంటే తినడం లేదంటే పస్తు ఉండిపోవడం ఆయనకు మామూలే.

 
ఒకరోజు ఓ ధనికుడు ఆయనను చూడటానికి వచ్చి - ‘‘అయ్యా! మీలాంటి ఓ గొప్ప జ్ఞానులు ఎందుకు ఉంటారు? మీకు నేనో ఆశ్రమం ఏర్పాటు చేస్తాను. మీరు అక్కడే ఉండొచ్చు. మీ ధ్యానానికి ఎలాంటి లోటూ రాకుండా మీకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసిపెడతాను. మీరు ఎక్కడికీ వెళ్ళకుండా ఇరుగుపొరుగు వారు మీ దగ్గరకే వచ్చి తమ సందేహాలు నివృత్తి చేసుకునేలా ప్రచారం చేస్తాను. మీరు దర్జాగా ఇక్కడే ఉండొచ్చు... ఏమంటారు?’’ అని అడిగాడు.

 
ఆయన చెప్పినదంతా సావధానంగా విన్న జెన్ గురువు ఓ నవ్వు నవ్వి - ‘‘మీరన్నది నిజమే. వినడానికి బాగుంది. కానీ నాకది సరిపోదు. క్షమించండి’’ అన్నారు. ‘‘తప్పుంటే మన్నించండి’’ అన్నాడు ధనికుడు.

 
అప్పుడు గురువు ఇలా అన్నారు - ‘‘మీరు చెప్పినదానిలో ఒక్క తప్పూ లేదు. కానీ నేను చెప్పేది వినండి. అగరవత్తులు వెలిగించి గదిలో ఓ చోట పెట్టినప్పుడు ఆ గది అంతా గుబాళిస్తుంది. నిజమే. కానీ కాస్సేపటికి ఆ అగరవత్తులు ఆరిపోయి బూడిద, పుల్లలూ మిగులుతాయి. వాసన ఉండదు. అలా నాకిష్టమైన సంచారాన్నీ పద్ధతులనూ విడిచిపెట్టి  పేరుప్రఖ్యాతుల కోసం తాపత్రయ పడటం వల్ల ఎవరికి ఏం లాభముంటుంది? డబ్బూ, పేరూ, ప్రతిష్టలూ, పదవులూ, హోదా, గౌరవం వంటివన్నీ తేనె పూసిన కత్తి లాంటివి... కత్తికి తేనె పూశారన్న విషయాన్ని మరచిపోయి రుచి బాగుంటుందని తొందరపడి నాకితే రుచి మాట దేవుడెరుగు... నాలుక తెగి రక్తం కారుతుంది. కనుక నాకు తేనె పూసిన కత్తి అంటే ఇష్టం లేదు.  దానికన్నా కొలనులో ఉన్న నీటిని దోసిలిలోకి తీసుకుని దాహం తీర్చుకుంటే చాలు అనుకునే వాడిని... దానితోనే నేను తృప్తి పడతాను. నాకు అంతకన్నా ఏదీ అక్కరలేదు’’ అన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత ధనికుడు మరొక్క మాట మాట్లాడితే ఒట్టు.

-  యామిజాల జగదీశ్

 

మరిన్ని వార్తలు