ఆడపిల్లకోసం ఆశ

17 Dec, 2013 23:56 IST|Sakshi
ఆడపిల్లకోసం ఆశ

ఆమె పేరు ఆశాసింగ్. వయసు నలభై. ఆమె నివసించేది మధ్య ప్రదేశ్‌లోని మోరెనా జిల్లా. టీ షర్టు జీన్స్ పాంటు వేసుకుని ఆమె బైక్ నడుపుతుంటే పల్లెల్లో మహిళలతో పాటు మగవారు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. సంప్రదాయ తెరల వెనకున్న మహిళలను ఇళ్ల అరుగులపై కూర్చోబెట్టి వారికి మంచీ చెడ్డా చెప్పడం ఆశాసింగ్ పని. గర్భిణులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేస్తుంది.
 
ఆడపిల్ల ఇంటికి భారమనే దురభిప్రాయం నుంచి వారిని బయటపడేయడానికి కావాల్సిన కబుర్లన్నీ చెబుతుంది ఆశాసింగ్. ‘‘నా ప్రయాణంలో ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్లు చేయించుకున్న మహిళలను కలిశాను. వారు చెప్పిన కారణం ఒకటే... ఆడపిల్లలకు బోలెడు ఖర్చులుంటాయి. పెళ్లి తర్వాత కూడా మన బాధ్యతలు తీరడం లేదు. ఇన్ని ఇబ్బందులకు బదులు మగపిల్లాడైతే ఏ గొడవా ఉండదు. వృద్ధాప్యంలో మనల్ని పోషిస్తాడు కూడా....అంటూ ఏవో కబుర్లు చెప్పుకొచ్చారు. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆడపిల్లగా పుట్టి పేరు, డబ్బు, పదవులు, ఉద్యోగాలు సంపాదించినవారి గురించి, పల్లెల్లో పుట్టి పెరిగి ఉన్నతస్థితిలో ఉన్నవారి గురించి చెప్పేదాన్ని. కొందరు నా మాటలు నమ్మేవారు, కొందరు నమ్మేవారు కాదు. మొత్తానికి అందరూ ఆడపిల్లల అవసరం గురించి చర్చించుకునేవారు’’ అని చెప్పారు ఆశాసింగ్.
 
ఎవరీ ఆశాసింగ్, ఎందుకీ పనిచేస్తోంది అంటారా! మధ్యప్రదేశ్‌లో రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించిన ఆశాసింగ్‌కి చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. తల్లి పెంపకంలో తన ఇష్టాలకు తగ్గట్టు గా జీవితాన్ని మలుచుకుంది. లా చదువుతున్న రోజుల్లో మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రోజురోజుకీ పడిపోతున్న ఆడపిల్లల సంఖ్య గురించి తెలుసుకుని, కొన్ని స్వచ్ఛంద సంస్థలతో చేయికలిపి ప్రచారపనుల్లో పాల్గొంటోంది. అందులో భాగంగానే పల్లెలకు వెళుతోంది. ‘‘నేను ప్రయాణం చేసే కొన్ని గ్రామాల్లో దొంగల భయం ఉందని చెప్పారు.

అయినా నేను లెక్కచేయకుండా నా ప్రయాణాలు కొనసాగించాను. నన్ను చూసి భయపడి జాగ్రత్తలు చెప్పేవారు. విద్యార్థులు మాత్రం ‘మేం కూడా మీలాగ ధైర్యంగా ఉంటాం మేడమ్... అని చెప్పేవారు. మహిళకు భయం ఎక్కువ, మగవారికి ధైర్యం ఎక్కువ అనే అపోహని పోగొట్టాలి. ఆడపిల్లయినా, మగపిల్లాడైనా ఒకటే అనే భావం రావాలి’’ అని ముగించారు ఆశాసింగ్.
 

మరిన్ని వార్తలు