హారర్ స్టోరీ

8 Aug, 2016 00:42 IST|Sakshi
హారర్ స్టోరీ
హ్యూమర్‌ప్లస్
ఇంతలో హీరోయిన్ వచ్చి ‘‘అంధెరీకి నమ్‌కారం’’ అంది తెలుగులో. దెయ్యం జడుసుకుని ‘‘పిశాచాలు కూడా ఇలాంటి భాష మాట్లాడవు. తెలుగు రాని అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవడానికి మించిన హారర్ ఎఫెక్ట్ ఏముంటుంది?’’ అని అరిచింది.
 
ఒక దెయ్యానికి సినిమాల్లో చేరాలని కోరిక పుట్టింది. తన సినిమాలు చూసి తానే భయపడే ఒక హారర్ డెరైక్టర్ దగ్గరికి వెళ్లింది. ‘‘ఇంతవరకూ దెయ్యం సినిమాలు తీసిన వాళ్లున్నారు కానీ, దెయ్యంతోనే సినిమాలు తీసినవాళ్లెవరూ లేరు. నాకైతే మేకప్, గ్రాఫిక్స్ అక్కరలేదు’’ అని చెప్పింది దెయ్యం.
 ‘‘ఫీల్డ్‌లో దెయ్యాలెవరో, మనుషులెవరో తెలుసుకోవడం కష్టంగా ఉంది. నువ్వు దెయ్యమే అనడానికి రుజువేంటి?’’ అని అడిగాడు డెరైక్టర్.
 
దెయ్యం తన కాళ్లను వెనక్కి తిప్పి చూపించింది. కోరల్ని బయటపెట్టి గాల్లోకి ఎగిరింది. డెరైక్టర్ సంతోషించి ‘దెయ్యం భయం’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. ముహూర్తం రోజున దెయ్యం పూజ చేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టింది.
 ‘‘దెయ్యాలు కూడా పూజ చేస్తాయా?’’ అని అడిగాడు డెరైక్టర్.
 ‘‘దెయ్యాలు పూజ చేయడం, సింహాలు సన్యాసం తీసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. మనుషుల కంటే ఎక్కువగా దెయ్యాల్నే దేవుడు ప్రేమిస్తాడు’’.
 ‘‘ఎందుకని?’’
 ‘‘భయం. కొలిచేవాడికి వరాలివ్వడం పాత పద్ధతి. కరిచేవాడికే ఇప్పుడు వరాలు’’ అంది దెయ్యం.
 
గడియారం సరిగ్గా పన్నెండు కొడితే దెయ్యం ‘హిహిహి’ అని నవ్వుతూ వచ్చి భయపెట్టాలి. ఇది ఫస్ట్ షాట్.
 ‘‘ప్రేక్షకులకి కామన్‌సెన్స్ లేకపోయినా, దెయ్యాలకి టైం సెన్స్ వుంది. అందువల్ల మేం అర్ధరాత్రి బయటికి రావడం మానుకొని చాలాకాలమైంది’’ అంది దెయ్యం.
 ‘‘తరతరాలుగా సినిమాల్లో వస్తున్న సాంప్రదాయమిది’’ అన్నాడు డెరైక్టర్.
 ‘‘అందుకే మీరు ఆదాయం లేకుండా చస్తున్నారు. అసలు గంటలు కొట్టే గడియారాలు ఎవరి కొంపలోనైనా ఉన్నాయా? పొరపాటున ఎక్కడైనా మోగినా అది టీవీ సీరియల్‌లో యాడ్ అనుకుంటాం గానీ మిడ్‌నైట్ అయ్యిందని అనుకుంటామా?’’ అని ప్రశ్నించింది దెయ్యం.
 ‘‘మరి ఏదో ఒక హారర్ ఎఫెక్ట్ వుండాలి కదా’’ అన్నాడు డెరైక్టర్.
 
ఇంతలో హీరోయిన్ వచ్చి ‘‘అంధెరీకి నమ్‌కారం’’ అంది తెలుగులో.
 దెయ్యం జడుసుకుని ‘‘పిశాచాలు కూడా ఇలాంటి భాష మాట్లాడవు. తెలుగు రాని అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవడానికి మించిన హారర్ ఎఫెక్ట్ ఏముంటుంది?’’ అని అరిచింది.
 ‘‘నువ్వెక్కువ నటిస్తున్నావు. మనుషులు ఎలాగూ బతికినంతకాలం నటిస్తారు. చచ్చి కూడా నటించాల్సి రావడం నీకు పట్టిన విషాదం’’ అని కోపగించుకున్నాడు డెరైక్టర్.
 ‘‘నా విషాదం సంగతి పక్కనపెట్టు. అసలు నీ సినిమాలు ఎందుకు ఫెయిలవుతున్నాయో నీకు తెలుసా?’’
 ‘‘జనానికి సినిమాలు చూడ్డం రాదు’’.
 
‘‘చూడ్డం రాక కాదు, చూడడానికి రావడం లేదు. ప్రతిరోజూ వంద రకాల భయాలతో బతుకుతున్నవాడిని ఇక కొత్తగా నువ్వేం భయపెడతావు.’’
 ‘‘భయమనేది ఆక్సిజన్ లాంటిది. అది ఎంతిచ్చినా సరిపోదు. అందువల్ల వికృతంగా నవ్వి భయపెట్టు’’.
 ‘‘అరే హౌలా, మేము వికృతంగా నవ్వుతామని ఎవరు చెప్పార్రా నీకు? బతికినప్పుడు లక్షా తొంభైవేల సమస్యలుంటాయి. చచ్చిం తరువాత ప్రశాంతంగా వుంటాం. హాయిగా వుండేవాడు వికృతంగా ఎందుకు నవ్వుతాడు చెప్పు?’’ అని అడిగింది దెయ్యం.
 ‘‘తెరమీద తర్కం పనికిరాదు. రూల్స్ మిస్సయితే గోల్స్ దక్కవు’’.
 
‘‘ప్రాస ఎక్కువైతే శ్వాస ఆడదు. పంచ్‌లు ఎక్కువైతే పంక్చరవుతుంది’’
 ‘‘సరే అదంతా ఎందుకుగానీ, నువ్వు దెయ్యం కాబట్టి ఆ చెట్టు మీద వుంటావు. కింద హీరోయిన్ వుంటుంది’’
 ‘‘ఒకసారి ఆ చెట్టు చూడు, కరెంట్, డిష్, ఇంటర్‌నెట్ ఇన్ని వైర్లు దాని మీద నుండి వెళుతున్నాయి. ఆ తీగలకు చుట్టుకుంటే దెయ్యాలకి చాలా ప్రమాదం. ఎందుకంటే అవి రెండోసారి చావలేవు. అందుకని మేము చెట్లమీద వుండడం మానేసి చాలా కాలమైంది.
 ‘‘దెయ్యంతో సినిమా తీయడం ఇంత కష్టమని నాకు తెలియదు’’.
 
 ‘‘సినిమాల్లో నటించడం ఇంత కష్టమని నాకూ తెలియదు. అయినా మీ భయాలేవో మీరు భయపడకుండా నాకెందుకు చుడతారు చెప్పు. ఈరోజుల్లో మనుషులే దెయ్యాలను భయపెడుతు న్నారు. అర్ధరాత్రి వరకూ టీవీలు చూస్తూ, ఫోన్లలో మాట్లాడుతూ మాకు నిద్ర లేకుండా చంపుతున్నారు’’ అని విసుక్కుంటూ దెయ్యం ప్యాకప్ చెప్పేసింది.
 - జి.ఆర్.మహర్షి
మరిన్ని వార్తలు