వేడి బ్యాటరీ రెడీ అవుతోంది!

20 Nov, 2017 00:42 IST|Sakshi

రోజంతా మండే సూర్యుడు పుట్టించే వేడిని రాత్రిళ్లు వాడుకోగలిగితే ఎలా ఉంటుంది? సాయంకాలమవుతూనే చల్లబడటం మొదలవుతుంది కాబట్టి అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు మాత్రం ఇలా అనుకోవడం లేదు. పగటి వేడిని నిల్వ చేసుకుని.. అవసరమైనప్పుడు దాన్ని విడుదల చేసే సరికొత్త బ్యాటరీని తయారు చేశారు వీరిప్పుడు. వేడి చేస్తే మంచు కరిగి నీరవుతుంది.

చల్లబరిస్తే నీరు కాస్తా మళ్లీ మంచుగా మారిపోతుంది. ఈ విషయం మనకు తెలిసిందే. ఇంకోలా చెప్పాలంటే వేడిని నిల్వ చేసుకుని మంచు కాస్తా నీరైందన్నమాట. చల్లబరచడం ద్వారా నీటిలోని వేడి విడుదలై మంచు ఏర్పడింది. మైనం, కొవ్వులు ఇలా చాలా పదార్థలు కూడ ఇలాగే వేడితో తమ స్థితిని మార్చుకుంటాయి. వీటినే ఫేజ్‌ ఛేంజ్‌ మెటీరియల్స్‌ (పీసీఎం) అంటారు. కాకపోతే ఇవి నిల్వ చేసుకున్న వేడి బయటకు పోకుండా చూడటం చాలా కష్టం.

ఈ నేపత్యంలో ఎంఐటీ శాస్త్రవేత్తలు పరమాణు స్థాయిలో స్థితిని మార్చుకునే వినూత్నమైన వ్యవస్థను అభివద్ధి చేశారు. దీన్ని పీసీఎంలకు అనుసంధానిస్తే చాలు.. వేడి ఆ పదార్థం లోపలే ఉండిపోతుంది. చిన్న కాంతి కిరణానికి స్పందించే పదార్థాన్ని కొవ్వులతో కలపడం ద్వారా వీరు వేడిని నిల్వ చేసుకోగల బ్యాటరీని సిద్ధం చేశారు. ఇది పరారుణ కాంతిని స్వీకరించి కరిగిపోతుంది. ఆ తరువాత ఎంత చల్లబరిచినా కూడా గట్టిపడదు. ఇంకో రకమైన కాంతి కిరణంతో మాత్రమే ఈ పదార్థం మళ్లీ గట్టిపడుతుంది. ఈ వినూత్న పదార్థంతో ఫ్యాక్టరీలతోపాటు అనేక చోట్ల వథా అవుతున్న వేడిని వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు