దేవుడు గంట కొట్టాడు

7 Aug, 2018 00:11 IST|Sakshi

చెట్టు నీడ

అదొక పల్లెటూరు. ఆ ఊళ్లో ఒక అమాయకుడున్నాడు. అతను ఎప్పుడూ సత్యమే చెబుతాడని, అబద్ధం చెçప్పడని ఊళ్లో వాళ్లకి గట్టి నమ్మకం. అదే వూరిలో పురాతన కాలం నాటి ఒక దేవాలయం ఉంది. కొన్ని తరాల కిందట ఆ గుడిలో దొంగలు పడి దేవుడి విగ్రహాన్ని ఎత్తుకు పోవడంతో ఆ దేవాలయం పూజాపురస్కారాలూ లేక, దాని ఆలనాపాలనా చూసేవారు లేక శిథిలావస్థకు చేరింది. ఆ దేవాలయం మొండి గోడల మీద రావి, తుమ్మ వంటి చెట్లు మొలిచి, లోనికి ప్రవేశించడానికి వీలు కానంతగా పాడిబడిపోయింది. దాంతో ఎవరూ ఆ గుడిలోకి ప్రవేశించడానికి సాహసించేవారు కాదు.ఒకరోజు రాత్రి ఆ గుడిలోనుంచి గంటల శబ్దం, శంఖనాదాలు వినిపించసాగాయి. అదేపనిగా గంటలు మోగుతుండడంతో ఊరిలో వాళ్లు ఉండబట్టలేక  లాంతర్లు తీసుకుని గుడి వైపుగా అడుగులు వేశారు. పచ్చ కర్పూరపు పరిమళాలు వెలువడుతుండడంతో అడ్డు వచ్చిన కంపను కొట్టివేస్తూ, ధైర్యంగా లోనికి వెళ్లారందరూ. అ గుడి పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. వాళ్లు ఇంకొంచెం ముందుకు పోయి, లోపల ఏం జరుగుతోందో అని చూశారు.

అక్కడ ఆ అమాయకుడు గోడకు ఆనుకుని బిగ్గరగా శంఖం ఊదటం, గంట గొట్టడం, హారతి ఇవ్వడం కనిపించింది. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాము కదా అని జనాలందరూ కలసి నేల పరిశుభ్రం చేయడం మొదలు పెట్టారు. గుడిలో వింత ఏం జరుగుతోందో చూద్దామని వస్తున్న వారందరూ ఎవరికి అడ్డం వచ్చిన చెత్తను, కంపను వారు తొలగించుకుంటూ వస్తున్నారు. కొందరు బూజుకర్రలు తీసుకు వచ్చారు. ఇంకొందరు అదే వూపులో అక్కడ పాడుబడిన దిగుడు బావినుంచి, నీళ్లు తోడి తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో నిండి పోయి ఉన్న చెత్తను తొలగించి, శుభ్రం చేయసాగారు. ఇలా తెల్లవార్లూ జరిగింది. గుడి ఎలాగూ శుభ్రపడింది కాబట్టి, గుడిలో దేవతా విగ్రహం లేకపోవడం అరిష్టం అని చెప్పి పంతులు గారి దగ్గర ముహూర్తం పెట్టించుకుని, మంచిరోజు చూసి గుడిలో దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎడతెరపిలేకుండా వస్తున్న విరాళాలు, శ్రమదానాలతో పూజలు, పురస్కారాలతో గుడి పునర్వైభవం సంపాదించుకుంది. ఆలయం, ఆలయ ప్రాంగణమూ శుభ్రంగా లేకపోవడం వల్లే కదా, అందరూ ఆ గుడిని దూరం పెట్టింది. ఆలయం శుభ్రం కావడంతోనే, గుడిలోకి దేవుడొచ్చేశాడు. మనసులోని మాలిన్యాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుంటే గుండె గుడిలోకి కూడా దైవం ప్రవేశిస్తాడు. అయితే అందుకు ఎవరో ఒకరు పూనుకోవాలి. 
– డి.వి.ఆర్‌. 

 

మరిన్ని వార్తలు