ప్లాస్టిక్‌ ఇల్లు

12 Jul, 2019 11:21 IST|Sakshi

ప్లాస్టిక్‌ చెత్తను వదిలించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా.. చిత్రంలో కనిపిస్తున్నది అలాంటి ఓ ప్రయత్నం తాలూకూ ఫలితమే. స్పష్టంగా చెప్పాలంటే దాదాపు ఆరు లక్షల ప్లాస్టిక్‌బాటిళ్లను ఉపయోగించుకుని కట్టిన ఇల్లు. ఇది. అలాగని దృఢంగా ఉండదని అనుకుంటారమో... భారీస్థాయి తుపాన్లను కూడా తట్టుకునేలా రూపొందించారు దీన్ని. వివరాల్లోకి వెళదాం. కెనెడాలో జేడీ కాంపోజిట్స్‌ అని ఓ నిర్మాణ కంపెనీ ఉంది. నోవా స్కాటియా అనే ప్రాంతంలో వీరు ఈ వినూత్నమైన ఇంటిని నిర్మించారు. సుమారు ఆరు లక్షల పన్నెండు వేల పెట్‌ బాటిళ్లను కరిగించి చిన్న చిన్న గుళికలుగా మార్చడంతో ఈ ఇంటి నిర్మాణం ప్రారంభమైంది. ఆర్మాసెల్‌ అనే కంపెనీ ఈ ప్రక్రియను చేపట్టింది.

గుళికలన్నింటినీ ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా ప్రీఫ్యాబ్రికేటెడ్‌ గోడలుగా మార్చారు. ఆ తరువాత వాటిని డిజైన్‌ ప్రకారం అమర్చడంతో ఇల్లు రెడీ అయింది. ఒక బెడ్‌రూమ్, రెండు బాత్‌రూమ్‌లు, ఆధునిక వంటగదితోపాటు పైకప్పుపై బీబీక్యూ రూమ్‌ కూడా ఉన్న ఈ ఇంటి పేరు బీచ్‌హౌస్‌. ఇందులో వాడిన ప్యానెళ్లను పరీక్షించినప్పుడు అవి గంటకు 324 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకుని నిలబడుతుందని తేలింది. కాలంతోపాటు ఇంటిలో ఏవైనా మార్పులు వస్తాయా? దృఢత్వం దెబ్బతింటుందా? అన్న విషయాలను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే సమీప భవిష్యత్తులోనే ఈ సరికొత్త ప్లాస్టిక్‌ భవన టెక్నాలజీని వేర్వేరు రంగాల్లో వాడుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

మరిన్ని వార్తలు