ఇంటి పనిమనిషి

2 Oct, 2015 23:29 IST|Sakshi
ఇంటి పనిమనిషి

మనందరం మంచి మనుషులం.
మనందరం పని చేసుకునే మనుషులం.
మనింటికొచ్చే పనిమనిషి కూడా మనలాంటిదే.
మన కుటుంబం కోసం మనం చేసే పనికి
తన కుటుంబం కోసం తను చేసే పనికి తేడా లేదు.
కానీ ఎందుకో మన అపార్ట్‌మెంట్‌లలో, కాలనీలలో
కొందరు పనిమనుషుల్ని అగౌరవిస్తుంటారు.
మీ ఇరుగుపొరుగులో ఎవరైనా పనిమనుషుల్ని
కించపరుస్తుంటే, హింసపెడుతుంటే...
వారికి రక్షణ కల్పించే వ్యవస్థ ఉంది.
చట్టాలు ఉన్నా అవే పరిష్కారం కాదు.
మనం అలాంటి యజమానులను సెన్సిటైజ్ చేస్తే
ఒక పేద ఇంటి మనిషికి
పెద్ద సాయం చేసిన వాళ్లమవుతాం.
 

తన బిడ్డ కాకపోయినా తల్లిలా చూసుకుంటుంది. తన తల్లిదండ్రులు కాకపోయినా కూతురులా మనింట్లో పెద్దవాళ్లకు సేవ చేస్తుంది. తన ఇల్లు కాకపోయినా ఇంటివాళ్లందరినీ తన వాళ్లలా చూసుకుంటుంది. మన మురికి శుభ్రం చేస్తుంది. మన కోసం నిత్యం శ్రమిస్తుంది. ఈమెను పనిమనిషి అంటాం. ఈమె పనిని గుర్తిస్తున్నామా? ఈమె కూడా ఒక మనిషే అని గుర్తిస్తున్నామా? ఎవరికివారు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
 
పదిహేడేళ్ల సుధ మౌలాలిలోని ఓ ఇంట్లో మూడేళ్ల క్రితం చంటిపిల్లవాడిని చూసుకోవడానికి పనికి కుదిరింది. రోజంతా ఆ పిల్లవాడి బాగోగులు చూసుకోవడానికి సుధకు నెలకు రెండువేల రూపాయలు జీతంగా ఇస్తున్నారు. పిల్లవాడి పనులతో పాటు మెల్లగా ఇంటిపనులు, వంటపనులు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ‘ఈ జీతం సరిపోదు, మరో వెయ్యి రూపాయలు పెంచండ’ని సుధ అడిగింది. ఇవ్వడం కుదరదు అని చెప్పడంతో ఆ ఇంట్లో పనిమానేసింది. అదే అపార్ట్‌మెంట్ మరో ఫ్లాట్‌లో పనిలో చేరింది. అయితే మూడేళ్లుగా సుధకు బాగా మాలిమి అయిన పిల్లవాడు ఆమె బయట కనిపించడంతో పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇంటికి వెళ్లమని సుధ ఎంత నచ్చజెప్పినా ఆ పిల్లవాడు వినలేదు. సుధ పనిమానేసిన దగ్గర నుంచి ఆ పిల్లవాడు తిండి తినడం లేదు. సరిగా నిద్రపోవడం లేదు. దాంతో సుధను మళ్లీ పనిలోకి రమ్మని పిల్లవాడి తల్లీదండ్రీ కోరారు. కానీ, జీతం పెంచితేనే వస్తానని సుధ చెప్పింది. ఆమెపై కక్షగట్టిన ఆ తల్లీదండ్రీ సుధ మీద దొంగతనం కేసుపెట్టారు... పిల్లవాడి ఒంటిమీద నగలు వలుచుకెళ్లిందని. పోలీసులు సుధను అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను చిత్రహింసలు పెట్టారు. నిజం చెప్పమంటూ వాతలు తేలేలా కొట్టారు. ఇష్టం వచ్చినట్టు కడుపులో తన్నారు. తల, మెడ మీద కాలిబూటుతో తొక్కారు. ఎంతగా హింసించారంటే ఇప్పుడు సుధ లేవలేని పరిస్థితిలో ఉంది. తాను ఓ బిడ్డకు జన్మనిచ్చే అవకాశం కూడా లేదని వైద్యులు చెప్పారు. లేబర్ ఆఫీసులో పోలీసుల మీద, దీనికి కారణమైన ఆ భార్యభర్తల మీద కంప్లయింట్ నమోదయ్యింది.
   
పదహారేళ్ల గౌరి రెండేళ్లుగా బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో పనిచేస్తోంది. ఆ ఇంటి కుర్రాడు పెళ్లి చేసుకుంటానని గౌరిని నమ్మించి, గర్భవతిని చేసి, ఆ తర్వాత చెప్పాపెట్టకుండా పారిపోయాడు. ఆ ఇంట్లోవారిని గౌరి తల్లిదండ్రులు నిలదీస్తే... రుజువులేంటి.. అని ఎద్దేవా చేస్తున్నారు.
   
డె భ్బై ఏళ్ల సుశీల పనికి వెళితే తిరిగి ఇంటికొచ్చాకే బాత్రూమ్‌కి వెళ్లాలి. పనిచేస్తున్న ఇంట్లో బాత్రూమ్‌కి వెళ్లడానికి వాళ్లు ఒప్పుకోరు. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌ను ఉపయోగించకూడదు. మూడంతస్తుల మెట్లు ఎక్కే వెళ్లాలి. ఓ రోజు బాత్రూమ్‌కి వెళితే ఆ ఇంటివారితో పెద్ద గొడవైంది. తమనే ఎదిరించి మాట్లాడిందని, ఆమె మీద దొంగతనం నేరం మోపారు. పోలీసుకేసు పెట్టారు. అయితే, ఆ వృద్ధురాలిని తీసుకెళ్లలేక ఆమె కొడుకును స్టేషన్‌లో ఉంచారు పోలీసులు.
  
యజమానులు పనిమనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారనే దానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆంధ్ర, తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి లిజీ జోసెఫ్ ఈ వివరాలను అందించారు. పనిమనుషులు ఒక వ్యవస్థగా లేకపోవడంతో ప్రభుత్వపరంగా వారికి లభించవలసిన గౌరవం, భద్రత, జీతభత్యాలు, ఇతర సదుపాయాలు అందడం లేదనే వాస్తవానికి పై సంఘటనలే నిదర్శనం.

 ఎందుకింత చిన్నచూపు?
 సాధారణంగా మన ఇళ్లల్లో బండెడు చాకిరీని అమ్మో, అక్కో, చెల్లో, కూతురో, భార్యో చేస్తుంది. అది వాళ్ల డ్యూటీ అన్నట్టు చూస్తూ ఉండిపోతాం. హెల్ప్ చెయ్యాలని కూడా అనిపించదు. ఈ ధోరణే పని మనుషుల విషయంలోనూ మనం కనబరుస్తుంటాం. ఉత్తిపుణ్యానికే పనిమనుషులకు జీతం ఇస్తున్నట్లు బాధపడిపోతుంటాం. కడుపునొప్పో, కాలినొప్పో ఉండి ఒక్క రోజు పనికి రాలేకపోయినా, ఏదో ఘోరం జరిగిపోయినట్లు, మోసం చేసినట్లు బాధపడిపోతాం. పని మనుషుల కష్టం వెలకట్టలేనిదని గ్రహిస్తే ఇంత బాధ ఉండదు.

 ‘కనీసం’ అంటే?
 పని మనుషులకు కనీసం ఎంత వేతనం ఇవ్వాలి? వాళ్లకు తప్పనిసరిగా కల్పించాల్సిన సదుపాయాలేమిటి? వారి విషయంలో యజమాని ధోరణి ఎలా ఉండాలి అనే విషయమై జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక సమాలోచనలు జరిగాయి. చర్చలూ సాగాయి. కొన్ని చట్టాలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు... పనిమనుషుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం ఒక జాతీయ విధానానికి రూపకల్పన చేసే పనిలో ఉంది. ఇది కనుక చట్టంగా వచ్చి, అమలయితే మన ఇళ్లలో పని చేసే పని మనుషుల కనీసం వేతనం నెలకు రు. 9000 అవుతుంది. అదనంగా... పింఛను, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు చేకూరుతాయి. ‘‘మా ప్రభుత్వం పనిమనుషులకు వేతన భద్రత, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించే విషయమై కృత నిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగా డ్రాఫ్ట్ తయారవుతోంది’’ అని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గతవారం మళ్లీ ఒకసారి ప్రకటించారు. ఈ జాతీయ విధానం చట్టంగా వస్తే పని మనుషులపై జరిగే గృహదౌర్జన్యాలకు, హింసలకు కూడా చెక్ పడుతుంది. మీ పక్కింట్లో పనిమనిషి యజమానుల వేధింపులకు గురైతే తెలుగురాష్ట్రాలలోని డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్‌కి తెలియజేయవచ్చు. లేదా బాధితులనే ఫోన్ చేసి సాయం కోరమని చెప్పవచ్చు. వారి ఫోన్ నెం. 040-27902881
 - సాక్షి ఫ్యామిలీ
 
పని మనుషులు ఎదుక్కొనే సమస్యలు
బట్టలు, గిన్నెలు శుభ్రపరచడానికి వాడే రసాయనాల వల్ల కాళ్లు, చేతులు పుండ్లు అవుతుంటాయి.బాత్రూమ్‌లు శుభ్రపరచడానికి వాడే యాసిడ్, బ్లీచ్.. వంటి గాఢమైన రసాయనాల నుంచి రక్షణకు కాళ్లకు చెప్పులుండవు. చేతులకు గ్లౌస్ ఉండవు. ఈ కారణాల వల్ల చర్మసమస్యలతో బాధపడుతుంటారు. ఆ పొగలు పీల్చి శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు.మిగిలిపోయినవి, పాచిపోయిన పదార్ధాలు తినడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది.పనులకు వెళ్లేవారిలో వితంతువులు, అవివాహితులు ఎక్కువ. వీరిలో లైంగిక వేధింపులకు గురయ్యేవారు అధికంగా ఉంటారు. మానసిక, శారీరక హింసలకు ఆస్కారం ఎక్కువ.
 
డొమెస్టిక్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్ 2008 
పనిమనుషుల్లో ఆడామగా ఇద్దరూ ఉన్నప్పటికీ ప్రధానంగా మహిళలను ఉద్దేశించే ఈ చట్టం తయారైంది. శ్రమదోపిడి, వేళాపాళా లేని పని, గృహనిర్బంధం, హింస వంటివే కాకుండా... పనిమనుషులను అక్రమంగా తరలించడం, చిన్నపిల్లల్ని పనిమనుషులుగా చేర్చుకోవడం కూడా ఈ చట్టప్రకారం నేరమే.  
 
గుర్తింపు: 18 ఏళ్లు పైబడి, 60 ఏళ్ల లోపు వయసున్న వారెవరైనా 90 రోజులకు తక్కువ కాకుండా పని చేస్తూ ఉన్నట్లయితే డొమెస్టిక్ వర్కర్‌గా గుర్తింపు పొందే అవకాశాన్ని ఈ చట్టంలోని సెక్షన్ 16 కల్పిస్తోంది.
 
పని, విశ్రాంతి, సెలవు: పని చేస్తున్న చోటే ఉంటున్నట్లయితే, ఆ రోజు పని పూర్తయి, మళ్లీ పని మొదలయ్యే మధ్య వ్యవధిలో డొమెస్టిక్ వర్కర్‌కి కనీసం 10 గంటల విశ్రాంతి ఉండాలి. ఏడాదికి కనీసం 15 రోజుల సెలవు ఉండాలి. (సెక్షన్ 22)
 
ఇతర సదుపాయాలు: 2008 చట్టం ప్రకారం పెన్షన్, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవు, వీక్లీ ఆఫ్ ఉంటుంది.
 
భద్రత: మహిళలను గానీ, బాలికలను గానీ డొమెస్టిక్ వర్క్ పేరుతో నమ్మించి, మోసం చేసి, ఏ విధంగానైనా నిర్బధించిన వారికి, లైంగికదోపిడీకి గురిచేస్తున్నవారికి, అందుకు సహాయపడిన వారికి కనీసం 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. నేరం తీవ్రతను బట్టి ఆ శిక్షాకాలం ఏడేళ్ల వరకు ఉంటుంది. 50 వేల రూపాయల వరకు జరిమానా కూడా ఉంటుంది.
 
ఎవరికి ఫిర్యాదు చేయాలి?

అన్యాయానికి, అక్రమానికి, నిరాదరణకు, శ్రమదోపిడీకి, లైంగిక దౌర్జన్యానికి గురవుతున్న డొమెస్టిక్ వర్కర్ తన సమీపంలో ఉన్న డిస్ట్రిక్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ బోర్డులు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటై నడుస్తుంటాయి.
 

 

మరిన్ని వార్తలు