మూడు ఆకాకర పాదులుంటే చాలు..!

31 Jul, 2018 05:26 IST|Sakshi

మంచి పోషక విలువలతో కూడిన ఆకాకర/బోడకాకర కాయల ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంటిపంటల్లో సాధారణంగా ఇది కనిపించడం అరుదు. అటువంటి అరుదైన ఆకాకర కాయలను హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ(టెంపుల్‌ బస్టాప్‌ దగ్గర)కి చెందిన కన్సల్టింగ్‌ ఇంజనీర్‌ నాగేంద్ర సొంత ఇంటిపైన సాగు చేస్తున్నారు. ఆయన టెర్రస్‌ గార్డెన్‌లో బోడకాకర పాదులు ఆరు ఉన్నాయి. అందులో 2 మగవి, 4 ఆడవి. ఆడ పాదులే కాయలు కాస్తాయి. పరపరాగ సంపర్కం ద్వారా ఆడ పాదుల పూలు ఫలదీకరణం చెంది ఫలసాయం రావాలంటే.. బొప్పాయి, తాటిచెట్లలో మాదిరిగా.. పది ఆడ పాదులకు కనీసం ఒక మగ పాదు ఉండాలని నాగేంద్ర తెలిపారు. ఆకాకర విత్తనాలు మార్కెట్‌లో కూడా దొరకడం లేదు. నాగేంద్ర తమ ఇంటి సమీపంలోని రైతు బజార్‌లో వ్యాపారులు పారేసిన పండు కాయలను తీసుకొచ్చి.. విత్తనాలు సేకరించి.. విత్తుకున్నారు. గుప్పెడు విత్తనాలు వేస్తే 8 మొలిచాయి. 6 మిగిలాయి.

ఈ పాదులను విత్తనం ద్వారా లేదా దుంప నాటడం ద్వారా పెంచుకోవచ్చు. దుంపను చూస్తే ఆడ, మగ తేడా తెలీదు. పూత వస్తే తప్ప అది ఆడ పాదా, మగ పాదా అనేది చెప్పలేం. ఆడ, మగ పాదులకు వచ్చే పూల మధ్య ఒక తేడా గమనించవచ్చు. ఆడ పువ్వునకు అడుగున  చిన్న కాయ కూడా ఉంటుంది. కొన్నాళ్లకు పువ్వు రాలిపోయి కాయ పెరుగుతుంది. మగ పువ్వు అడుగున కాయేమీ ఉండదు. వర్షాకాలంలో 3 నెలల పాటు ఆకాకర పాదు కాయలనిస్తుంది. ఒక్కో పాదు తడవకు పావు కిలో వరకు కాయలిస్తుంది. రెండు ఆడ పాదులు, ఒక మగ పాదున్నా నలుగురున్న ఇంటికి కూరకు సరిపడా ఆకాకర కాయలు పండించుకోవచ్చని నాగేంద్ర (98481 30414) చెబుతున్నారు. ఇంటిపంటల్లో అరుదైన ఆకాకర/బోడకాకర పాదులు పెంచుతున్న నాగేంద్రను ‘సాక్షి–ఇంటిపంట’ అభినందిస్తోంది.

గమనిక: మీరూ ఏదైనా అరుదైన/విలక్షణ కూరగాయలను సేంద్రియంగా ఇంటిపంటల్లో పెంచుతున్న వారెవరైనా ఉంటే వివరాలు, ఫొటోలను sagubadi@sakshi.com కు మెయిల్‌ చెయ్యవచ్చు.

మరిన్ని వార్తలు