గృహస్థు అతిథి పూజలో తరించాలి

15 Apr, 2018 01:52 IST|Sakshi

అతిథి దేవోభవ

మీ ఇంట పెళ్ళి జరగబోతున్నది. శుభలేఖ వేస్తారు. అందులో ‘మంగళం మహత్‌ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ’ అని రాస్తారు. అయ్యా! మంగళములను అపేక్షించి మిమ్మల్ని పిలుస్తున్నాం. మీవంటి పెద్దల పాద స్పర్శచేత మా మంటపం పునీతమవుతుందన్న భావనతో ‘మదర్పిత చందనతాంబూలాది సత్కారాలు గ్రహించి మమ్మానందింప చేయ ప్రార్థన’ అని కూడా రాస్తారు. చందనతాంబూలాది... అన్న తరువాత మళ్ళీ విందు అనీ, ఇంకోటి అని రాయడం ఎందుకు? చందనం అంటే... దేవతార్చన, పిదప భోజనం... తరువాత లేచి వెళ్ళబోయేముందు చందనం రాసుకుని లేస్తారు. కాబట్టి పెద్దలయిన అతిథులొచ్చారంటే గౌరవసూచకంగా ఓ తాంబూలం చేతిలో పెడతారు. తాంబూలమంటే మళ్ళీ రు.1116/–లా ? రు.116/–లా అని అడక్కండి. తమలపాకులు, రెండు అరటిపళ్ళు, రెండు వక్కలు చాలు. తాంబూలమిచ్చారంటే గౌరవమిచ్చారని గుర్తు.

విరాటపర్వంలో–బృహన్నలరూపంలో అర్జునుడు వస్తే ఆయన తేజస్సును చూసి విరాట్‌రాజు–‘చూస్తే బృహన్నల. కానీ గొప్ప క్షత్రియుడిలా ఉన్నాడు. ఈయన సామాన్యుడు కాడు.’ అని ఉత్తరని పిలిచి తాంబూలం ఇవ్వమంటాడు. అది గౌరవ చిహ్నం. ఇక పెళ్ళిమంటపంలో వధూవరులిద్దరూ ఒకళ్ల కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటారు. అలా చూసుకున్న ఘడియే సుముహూర్తం. ‘‘అయ్యా! మీరందరూ ఇది శుభముహూర్తం’’ అనండి అని అడుగుతారు. అప్పుడు అతిథులందరూ లేచి ‘ఇది శుభముహూర్తమే’ అని ముందుకొస్తారు. నడుం విరగని బియ్యానికి పసుపురాసి మీ చేతిలో పెడితే మీరు అతిథి దేవుళ్ళు కనుక మీరు చేసిన భగవదారాధన వలన మీరు స్మరించి మీ శక్తితో ఆ అక్షతలను వధూవరుల మూర్ధన్య స్థానమందువేస్తే వారికి అభ్యున్నతి కలిగి దీర్ఘాయుష్మంతులవుతారు. ‘మీరలా చేయడంవల్ల మా వంశం నిలబడుతుంది. అందుకని మీరు చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేయాలి కనుక చందనం ఇస్తాను. అంటే భోజనం పెట్టి తాంబూలం ఇస్తాను. కనుక మీరు దయతో రావలసింది’ అని ప్రేమతో పిలిచారని అర్థం. తీరా వారు వచ్చిన తరువాత పెళ్ళికి పిలిచిన పెద్దలు అతిథులను వారి మానాన వారిని వదిలేసి వీడియో బృందం సేవల్లో మైమరిచిపోతుంటే, వధూవరులు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకరు చూసుకోకుండా మెడతెగిన కోడిపెట్టల్లా వీడియో కెమెరాలకేసి చూస్తుంటే, కర్ణుడు కవచకుండలాలను వదలకుండా వెంటేసుకుని తిరిగినట్లు.. వచ్చిన అతిథులు కూడా పాదరక్షలతోపాటూ మంటపం ఎక్కి క్యూలైన్లలో తరించి పోతుంటారు. చుట్టూ కమ్ముకున్న వీడియోగ్రాఫర్ల మధ్యనుంచి పెళ్ళితంతు చూడలేక, భోజనాల దగ్గర కూడా చేతిలో పళ్ళెం పట్టుకుని నిలబడలేక, కూర్చోలేక, తినలేక, తినకుండా ఉండలేక, గొంతుపట్టుకుంటే నీళ్ళు తాగలేక ఇటూ అటూ తిరిగే అతిథులది దిక్కుమాలిన స్థితి.

అది ఈ జాతి సంస్కారం కానే కాదు. ఈ జాతి లక్షణం కూడా కాదు. ఎక్కడినుంచో ఎవడో దిగుమతి చేసేశాడు. అంటువ్యాధిలా వ్యాపించిపోయింది. ప్రేమగా అతిథులను పలకరిస్తూ కూర్చోబెట్టి వడ్డించి పెట్టడం ఈ జాతి ధర్మం. అంతే తప్ప పెళ్ళికి పిలిచి, ఆశీర్వచనానికి పిలిచి చందనతాంబూలాలిస్తాం రమ్మనమని పిలిచి–  అతిథిని పట్టించుకోకపోతే ఎలా? అన్నం ఎక్కడా దొరకదని అతిథి అక్కడికి రాలేదు కదా! నువ్వే పిలిచావు. అతిథిని పిలిచి నిర్లక్ష్యం చేయకూడదు. అలా చూసుకోలేనప్పుడు పిలవకూడదు. కనుక గృహస్థు అనేవాడు ఇంట్లో అయినా, శుభకార్యంలో అయినా సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపం అయిన అతిథి పూజలో తరించాలి.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు