మా వాడి బరువు తగ్గడం ఎలా..?

3 Oct, 2013 00:58 IST|Sakshi
మా వాడి బరువు తగ్గడం ఎలా..?

మా అబ్బాయికి 14 ఏళ్లు. వాడి బరువు 68 కిలోలు. కొంతకాలంగా వాడి బరువు 62 కిలోల నుంచి క్రమంగా పెరుగుతోంది. ఇది ఇక్కడితో ఆగదేమోనని, బరువు ఇంకా పెరుగుతుందేమోనని ఆందోళనగా ఉంది. దయచేసి వాడి బరువు తగ్గించడానికి తగిన సూచనలు ఇవ్వండి.
 - సూర్యారావు, హైదరాబాద్

 
 ప్రస్తుతం టీనేజ్‌లో ఉన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు ఈ రోజుల్లో వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీ అబ్బాయికి ముందుగా మంచి  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి.
 
 స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్,  జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్ ఆసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి  కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది.
 
 వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు.
 
 పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి  బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు.
 
 తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది.
 
 పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనపాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది.
 
 పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం.
 
 డాక్టర్ భక్తియార్ చౌదరి
 స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు