గన్ ఎలా పనిచేస్తుందంటే..

8 Nov, 2015 18:32 IST|Sakshi
గన్ ఎలా పనిచేస్తుందంటే..

భౌతికశాస్త్రంలోని చాలా ప్రాథమిక అంశాలతో తుపాకీని తయారు చేశారు. ప్రధానంగా న్యూటన్ మూడో సూత్రం దీనికి వర్తిస్తుంది. ఏ చర్యకైనా సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుందనే సూత్రాన్ని అనుసరించి తుపాకీ పనిచేస్తుంది. ఇందులో మ్యాగజైన్ అనే భాగంలో బుల్లెట్లు (గుండ్లు) వచ్చి కూర్చుంటాయి. బ్యారెల్‌లోకి బుల్లెట్ వచ్చి చేరేలా చేసేందుకు బ్యారెల్ లోపల ఉండే భాగం ముందుకు వెనక్కు కదిలేలా రూపొందించారు. దీన్ని స్లైడ్ అంటారు. ఇలా కదిలించడాన్ని కాక్ చేయడం అంటారు. ఇలా కాక్ చేసినప్పుడల్లా బ్యారెల్‌లోకి కొత్త బుల్లెట్ వస్తుంది.

బుల్లెట్లు ఒకదాని తర్వాత మరొకటిగా వరుసగా ఉండే భాగాన్ని మ్యాగజైన్ అంటారు. మ్యాగజైన్‌లో కింద ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఇది కలిగించే ఒత్తిడి వల్ల బుల్లెట్ బ్యారల్ వెనుకభాగంలోకి వెళ్తుంది. సరిగ్గా ఆ ప్రాంతంలోనే బుల్లెట్ వెనుక బలంగా కొట్టేలా ఒక సుత్తి ఉంటుంది. దీన్నే హ్యామర్ అంటారు. ట్రిగర్ నొక్కగానే హ్యామర్... బుల్లెట్ వెనక భాగంలో ఉండే మందుగుండును దెబ్బకొట్టి మండిస్తుంది. ఈ ప్రక్రియను కంబషన్ అంటారు. దీని వల్ల విపరీతమైన పీడనం (ప్రెషర్) ఏర్పడి, దాని ప్రభావంతో బుల్లెట్ శరవేగంగా ముందుకు దూసుకెళ్తుంది.

మందుగుండు ఉండే భాగం (క్యాటరిడ్జ్) అక్కడే బయటకు పడిపోతుంది. బుల్లెట్ సూటిగా దూసుకుపోయేలా చేసేందుకు బ్యారెల్‌లోని గ్రూవ్స్ గిర్రున తిప్పుతాయి. దాంతో గాలి ఒత్తిడికి బుల్లెట్ ప్రభావితం కాకుండా సూటిగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మనం లక్ష్యాన్ని గురిచూసేందుకు తుపాకిపైన హ్యామర్‌కు ముందు ఒక చిన్న కన్నం, ఆ కన్నంలోంచి లక్ష్యానికి సూటిగా ఉందా లేదా అని చూసేందుకు బ్యారెల్ మీద మరో ఎత్తు భాగం ఉంటాయి. ఈ కన్నాన్ని రేర్‌సైట్ అని, బ్యారల్‌పై ఎత్తుగా ఉండే భాగాన్ని ఫ్రంట్ సైట్ అని అంటారు. వీటిలోంచి చూసి గురిపెట్టి ట్రిగర్ నొక్కినప్పుడల్లా బుల్లెట్ బయటకు దూసుకెళ్తుంది. ఇదీ సంక్షిప్తంగా గన్ పనిచేసే ప్రక్రియ.

మరిన్ని వార్తలు