చిన్న చిట్కాలు పెద్ద ప్రయోజనాలు

21 Jan, 2020 19:54 IST|Sakshi

న్యూఢిల్లీ : కూర్చోవాలన్నా, లేవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా మోకాలి నొప్పులు రాకుండా, ఛాతిలో నొప్పి లేకుండా ఉండాలన్నా, మొత్తంగా మెదడు ప్రశాంతంగా హాయిగా ఉండాలన్నా కొన్ని వైద్య చిట్కాలు చాలని లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు సలహా ఇస్తున్నారు. రోజు ఉదయం, సాయంత్రం ఇరవై బింగీలు తీయాలి. దానివల్ల తొడలు, పిరుదులు బలపడడంతోపాటు మోకాలి నొప్పులు తగ్గుతాయని ‘ఈస్ట్‌ కెంట్‌ హాస్పిటల్స్‌ యూనివర్శిటీ ఫౌండేషన్‌ ట్రస్ట్‌’లోని న్యూరోలాజికల్‌ రీహాబిలిటేషన్‌ సర్వీస్‌లో పనిచేస్తున్న ఫిజియోథెరపిస్ట్‌ అలెక్స్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ తెలిపారు.

ఆకుపచ్చ అరటి పండ్లు తినడం. అందులోని ఫైబర్‌ వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుందని, అందులోని పొటాషియం వల్ల ఎముకలు బలపడతాయని బ్రిటీష్‌ డయాబెటిక్‌ అసోసియేషన్‌కు చెందిన డైటీషియన్‌ లారా టిల్ట్‌ చెప్పారు. అరటి పండ్లు పసుపు పచ్చగా మారినట్లయితే అందులోని ఫైబర్‌ నశించి పోతుందని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌లో విరివిగా దొరుకుతున్న కాళ్ల మడమల వద్ద బరువు పట్టీలను ధరించాలి. ఖాళీ సమయాల్లో కాకపోతే టీవీ చూస్తున్నప్పుడు రెండు కాళ్లకు వీటిని ధరించి ఒక కాలు తర్వాత ఒక కాలును గాలిలోకి లేపి కాసేపు ఉంచి, దించాలి. ఇలా ఐదారు సార్లు చేసినట్లయితే కండరాలు బలపడి కాళ్ల నొప్పులు తగ్గుతాయని ‘రాయల్‌ లివర్‌ పూల్‌ హాస్పటల్స్‌’ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ జార్జ్‌ ఆమ్‌పత్‌ తెలిపారు.

నేలపై కూర్చొని ముందుకు కాళ్లను చాపి ఓ మోకాలి కింది బాగం నేలకు తాకేలా చేయాలి, ఆ తర్వాత మరో కాలితో అలాగే చేయాలి. ఆ తర్వాత మోకాళ్లపై లేచి అలాగే కొద్ది సేపు నిలబడాలి. దానివల్ల మోకాళ్లు బలపడతాయి. మెట్లు మునికాళ్ల మీద ఎక్కాలి. దానివల్ల మోకాలు కింద వెనక బాగానుండే కండరాలు బలపడతాయని స్టాక్‌పోర్ట్‌లోని బ్రిన్‌నింగ్టన్‌ సర్జరీ డాక్టర్‌ జేమ్స్‌ హిగిన్స్‌ తెలిపారు. ఉదయం బ్రెష్‌ చేసుకునేటప్పుడు ఓ కాలును వెనక్కి మడచి ఒంటి కాలిపై కాసేపు నిలబడి, కాలు మార్చి మరో కాలిపై కాసేపు నిలబడినట్లయితే కండరాల మధ్య స్నాయువుల ప్రభావం పెరిగి శరీరం బ్యాలెన్స్‌ను నిలబెడుతుందని ఆయన చెప్పారు.

రోజుకోసారి కొన్ని పాత్రలను చేతులతో కడగాలి. ఆ తర్వాత కొద్దిసేపు గోరు వెచ్చని నీళ్లలో రెండు అరచేతులను కాసేపు ఉంచి, ఆ తర్వాత చేతులు కడుక్కోవాలి, తుడుచుకోవాలి, అరచేతులను ముడుచుకోవాలి, విప్పాలి, విదిలించాలి. దాని వల్ల చేతుల వేళ్లు బలపడతాయని, క్రమంగా వేళ్ల నొప్పులు తగ్గుతాయని ‘విల్ట్‌షైర్‌ అండ్‌ స్విండన్‌ హెల్త్‌ కేర్‌’ హాండ్స్‌ ఫిజియోథెరపీలో నిపుణులు మిషెల్లీ లారెన్స్‌ తెలిపారు.

కీళ్ల నొప్పులకు పెయిన్‌ కిల్లర్‌ ‘బ్రూఫిన్‌’కు బదులు పారాసిటమాల్‌ తీసుకోవడం మంచిదని, చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించేందుకు స్టాటిన్స్‌గానీ, ఆస్ప్రిన్‌ ట్యాబ్లెట్లను రాత్రికి బదులు ఉదయమే తీసుకోవాలని ఇడిన్‌బర్గ్‌ యూనివర్శిటీ కన్సల్టెంట్‌ కార్డియోలజిస్ట్‌ డాక్టర్‌ మార్క్‌ డ్వీక్‌ సూచించారు. బ్రూఫిన్‌ సాధారణ నొప్పులకు మాత్రమే పనిచేస్తుందని, మోకాలు నొప్పులకు పనిచేయదని, పైగా దాని వల్ల ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని డాక్టర్‌ హెచ్చరించారు.

వారానికి ఒకటి రెండు సార్లు టిఫిన్, లంచ్‌ను వదిలేయాలి. అంటే ఆ రోజు ఉదయం నుంచి 16 గంటలపాటు ఏమీ తినకుండ ఉన్నట్లయితే మంచిది. డయాబెటిక్‌ రోగులకు ఇది మరీ మంచిది. దీనివల్ల గుండె పదిలంగా ఉండడమే కాకుండా కాస్త లావు తగ్గుతారని లండన్‌లోని వెల్‌బెక్‌ హార్ట్‌ హెల్త్‌ క్లినిక్‌ కన్సల్టెంట్‌ కార్డియోలజిస్ట్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ మాలిక్‌ తెలిపారు. రోజు కొంత దూరం నడవాలని, సమయం లేకపోతే ఆఫీసుకు ఓ స్టాప్‌ ముందు దిగి ఆఫీసు వరకు నడిచిపోవాలని, అది కూడా గుండెకు మంచిదని ఆయన చెప్పారు. ప్రతి రోజు ఒకసారి బ్లాక్‌ లేదా గ్రీన్‌ టీ తాగడం కూడా మంచిదని ఆయన తెలిపారు. రోజువారి తిండిలో ఉప్పును సాధ్యమైనంతగా తగ్గించాలని, మొదట్లో ఇబ్బందిగా ఉన్నా నాలుగైదు వారాల్లో ‘టేస్ట్‌ బడ్స్‌’ సర్దుకుంటాయని హృద్రోగ నిపుణులు తెలియజేస్తున్నారు. వారానికి రెండు సార్లైనా షాపింగ్‌ చేయాలని, రెండు నుంచి ఐదారు కిలోల బరువుండే బ్యాగులను చేతులతో మోసుకరావడం వల్ల కూడా చేతులు బలపడుతాయని నిపుణులు సూచించారు.

మరిన్ని వార్తలు