ఎగ్‌ లెస్‌.. లెస్స!

8 Dec, 2017 23:56 IST|Sakshi

గుడ్డు లేకుండా గుడ్‌ కేక్‌ తినండి. ఇంట్లో చేసుకుని గుటుక్కుమనిపించండి. క్రిస్మస్‌ అంటేనే.. గుడ్‌ టైమ్‌. గుడ్డు తినని వాళ్లకు గుడ్‌ కేక్‌ ఎలా? అందుకే ఈ గుడ్డులెస్‌ కేక్‌!

ఫ్రెష్‌ ఫ్రూట్‌ కేక్‌
కావలసినవి: మైదాపిండి – కప్పు; బటర్‌ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్‌డ్‌ మిల్క్‌ – అర కప్పు; తాజా క్రీమ్‌ – పావు కప్పు; బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూను; కస్టర్డ్‌ పౌడర్‌ – టీ స్పూను; వెనిలా ఎసెన్స్‌ – టీ స్పూను; ఉప్పు – 2 కప్పులు; చిలకరించిన క్రీమ్‌ – 500 గ్రా.; పంచదార పొడి – పావుకప్పు; పంచదార సిరప్‌ – పావు కప్పు; తాజా పండ్ల ముక్కలు – (కివి, కమలాపండు తొనలు, స్ట్రాబెర్రీ, దానిమ్మ గింజలు, చెర్రీలు, ఆపిల్‌ ముక్కలు, పైనాపిల్‌ ముక్కలు) – తగినన్ని

తయారి: ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్‌ ఉంచి, స్టౌ మీద మీడిమం మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్‌ బౌల్‌లో బటర్, పంచదార వేసి బాగా క్రీమీగా వచ్చేవరకు కలిపాక, కండెన్స్‌డ్‌ మిల్క్, వెనిలా ఎసెన్స్‌ జత చేసి సుమారు రెండు మూడు నిమిషాలు బాగా గిలకొట్టాక, పావు కప్పు క్రీమ్‌ జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙మైదాపిండి, బేకింగ్‌ పౌడర్, కస్టర్డ్‌ పౌడర్‌... వీటిని జల్లెడ పట్టి, పైన తయారు చేసి ఉంచుకున్న మిశ్రమంలో వేసి కలపాలి ∙ఏడు అంగుళాల అల్యూమినియం కేక్‌ ట్రే కి బటర్‌ రాసి, కేక్‌ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరిచి, కుకర్‌లో ఉంచి సుమారు అరగంటసేపు సన్నని మంట మీద ఉంచి (విజిల్‌ పెట్టకూడదు) దింపి, పది నిమిషాలు చల్లారాక, అంచుల మీదుగా చాకుతో కట్‌ చేసి కేక్‌ను బయటకు తీయాలి ∙500 మి.లీ. క్రీమ్‌ను బాగా గిలక్కొట్టాలి. పావు కప్పు పంచదార పొడి జత చేసి మరోమారు గిలక్కొట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. (వాడే ముందు మాత్రమే బయటకు తీయాలి) ∙కేక్‌ను ఒక ప్లేట్‌లోకి తిరగదీసి అంచులను చాకుతో నీట్‌గా కట్‌ చేయాలి ∙చాకుతో కేక్‌ చుట్టూ క్రీమ్‌ అప్లయ్‌ చేయాలి. పైన మధ్యభాగంలో మాత్రం కొద్దిగా ఎక్కువ క్రీమ్‌ను ఉంచి, దాని మీద కొద్దిగా పంచదార  సిరప్‌ చిలకరించి ఆ పైన మరి కాస్త క్రీమ్‌ వేసి, దాని మీద తాజా పండ్ల ముక్కలు వేసి, చేతితో నెమ్మదిగా ఒత్తాలి ∙పైన మళ్లీ క్రీమ్, పళ్ల ముక్కలు వేసి ఒత్తాలి. ఇలా మూడు పొరలు పూర్తయ్యాక చివరగా పంచదార సిరప్, క్రీమ్‌ వేసి పెద్ద చాకు సహాయంతో సమానంగా పరిచి, ఎక్కువైన క్రీమ్‌ను చాకుతో తీసేసి, కేక్‌ను ఫ్రీజ్‌లో సుమారు అరగంట సేపు ఉంచి తీయాలి ∙చివరగా మళ్లీ కేక్‌ మీద క్రీమ్‌ వేసి చాకుతో సమానంగా పరిచి, చుట్టూ కూడా వచ్చేలా చేసి, చివరగా మనకు నచ్చిన వాటితో (స్ట్రాబెర్రీ వేఫర్‌లు బాగుంటాయి) అలంకరించి సుమారు 4 గంటలు ఫ్రిజ్‌లో ఉంచి అందించాలి.

చాకొలేట్‌ నట్స్‌ కేక్‌
కావలసినవి: మైదా పిండి – కప్పు;  కార్న్‌ఫ్లోర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు;  బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూను; కోకో పౌడర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; బటర్‌ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్‌డ్‌ మిల్క్‌ – అర కప్పు; జీడిపప్పు తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; బ్లూ బెర్రీలు (ఎండబెట్టినవి) – 2 టేబుల్‌ స్పూన్లు; కిస్‌మిస్‌ – టేబుల్‌ స్పూను; ఖర్జూరం తరుగు – టేబుల్‌ స్పూను; ఉప్పు – ఒకటిన్నర కప్పులు

తయారి: ∙ఒక పాత్రలో అర కప్పు వేడి నీళ్లు, కోకో పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ప్రెజర్‌ కుకర్‌లో కింద ఉప్పు వేసి, దాని మీద వైర్‌ స్టాండ్, పెర్ఫరేట్‌ ప్లేట్‌ ఉంచి మూతపెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙బేకింగ్‌ పౌడర్, మైదా పిండి, కార్న్‌ఫ్లోర్‌లను జల్లించి పక్కన ఉంచాలి ∙మిక్సింగ్‌ బౌల్‌లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాక, కండెన్స్‌డ్‌ మిల్క్‌ జత చేసి మరోమారు గిలక్కొట్టాలి. (ఎంత ఎక్కువ సేపు గిలక్కొడితే అంత రుచిగా వస్తుంది) ∙ఒక పాత్రలో మైదాపిండి మిశ్రమంలో సగం భాగం, కోకో పొడి, డ్రైఫ్రూట్స్‌ (జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్, ఖర్జూరం) ముక్కలు వేసి కలిపాక, మిగిలిన సగం పిండి జత చేసి కలపాలి ∙యేడు అంగుళాల మందం ఉన్న అల్యూమినియం గిన్నెకు బటర్‌ పూసి ఈ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరవాలి. (బటర్‌ బదులు బటర్‌ పేపర్‌ను కూడా ఉపయోగించవచ్చు) ∙ఈ గిన్నెను కుకర్‌లో ఉంచి మూత పెట్టి (విజిల్‌ పెట్టకూడదు) సన్నని మంట మీద సుమారు అర గంటసేపు ఉంచాలి. (పుల్లతో గుచ్చితే పూర్తిగా తయారయినదీ లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి కాలేదనిపిస్తే మరి కాసేపు స్టౌ మీద ఉంచాలి) ∙పూర్తయిన తర్వాత బయటకు తీసి, అంచుల మీదుగా చాకుతో కట్‌ చేస్తూ కేక్‌ను బయటకు తీసి, పైన పంచదారను కొద్దిగా చల్లితే బాగుంటుంది.

బ్లూ బెర్రీ చీజ్‌ కేక్‌
కావలసినవి: బిస్కెట్లు – 125 గ్రా.; కరి గించిన బటర్‌ – 75 మి.లీ.; క్రీమ్‌ చీజ్‌ – 200 గ్రా.; పంచదార పొడి – 1/3 కప్పు; క్రీమ్‌ – 300 మి.లీ. (బాగా గిలక్కొట్టాలి); కండెన్స్‌డ్‌ మిల్క్‌ – 200 మి.లీ.; చైనా గ్రాస్‌ – 10 గ్రా.; బ్లూ బెర్రీలు – 3 టేబుల్‌ స్పూన్లు (ఎండినవి వాడుతుంటే, ముందు రోజు రాత్రి అర కప్పు నీళ్లలో నానబెట్టాలి); బాదం పప్పులు – 3 టేబుల్‌ స్పూన్లు.

తయారి: ∙బిస్కెట్లను చేత్తో గట్టిగా నలిపి పొడి చేసి, కరిగించిన బటర్‌లో నెమ్మదిగా వేస్తూ కలపాలి. (కలపడం పూర్తయ్యే సరికి తడిసిన ఇసుకలా ఉంటుంది) ∙ఈ మిశ్రమాన్ని తొమ్మిది అంగుళాల స్ప్రింగ్‌ ఫామ్‌ కేక్‌ టిన్‌లో పోసి గట్టిగా ఒత్తి ఫ్రిజ్‌లో ఉంచాలి ∙1/3 వంతు కప్పు నీళ్లలో చైనా గ్రాస్‌ను సుమారు పావు గంట సేపు నానబెట్టాలి ∙ఒక పాత్రలో క్రీమ్‌ వేసి బాగా గిలకొట్టాలి ∙మరో పాత్రలో క్రీమ్‌ చీజ్, పంచదార పొడి వేసి గిలక్కొట్టాలి ∙సన్నని మంట మీద పాన్‌ ఉంచి, వేడయ్యాక, నానబెట్టి ఉంచుకున్న చైనా గ్రాస్‌ వేసి పూర్తిగా ఉడికేవరకు ఉంచి తీసేయాలి ∙పాన్‌లో కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి గోరు వెచ్చన చేసి, ఉడికించిన చైనా గ్రాస్‌ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి, దించి కొద్దిగా చల్లార్చాలి ∙ఈ మిశ్రమాన్ని క్రీమ్‌ చీజ్‌ మిక్స్‌కి జత చేసి బాగా గిలకొట్టాలి ∙బెర్రీలు, బాదం పప్పులు వేసి కలపాలి. (బ్లూబెర్రీలు నానబెట్టిన నీళ్లు కొన్నిటిని జత చేయవచ్చు) ∙గిలక్కొట్టిన క్రీమ్‌ కలపాలి  ∙కేక్‌ టిన్‌లో చీజ్‌ కేక్‌ మిశ్రమం వేసి సమానంగా పరిచి ఫ్రిజ్‌లో సుమారు 12 గంటలు ఉంచి తీయాలి ∙కేక్‌ను టిన్‌ నుంచి జాగ్రత్తగా విడదీసి అందంగా అలంకరించి అందించాలి.

వెనీలా కప్‌ కేక్స్‌
కావలసినవి: ఉప్పు – 2 కప్పులు ; బటర్‌ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; వెనిలా ఎసెన్స్‌ – టీ స్పూను; కండెన్స్‌డ్‌మిల్క్‌ – అర కప్పు; బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూను; మైదా పిండి – కప్పు; సోడా – అర కప్పు (క్లబ్‌ సోడా); చెర్రీస్‌ – 20

తయారి: ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్‌ పెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్‌ బౌల్‌లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలక్కొట్టాక, వెనిలా ఎసెన్స్, కండెన్స్‌డ్‌ మిల్క్‌ జత చేసి మరోమారు బాగా గిలక్కొట్టాలి ∙ఒక పాత్రలో బేకింగ్‌ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలిపి, సగం మిశ్రమాన్ని పైన తయారుచేసి ఉంచుకున్న బటర్‌ మిశ్రమానికి జత చేసి బాగా కలిపాక, మిగిలిన సగం వేసి మరోమారు కలపాలి ∙సోడా (క్లబ్‌ సోడా వంటివి) వేసి బాగా కలపాలి ∙కప్‌ కేక్‌లను తీసుకుని అందులో ఒక్కోదానిలో ఒక్కో చెర్రీ వేసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం అందులో పోసి, వీటిని చిన్న ట్రేలో ఉంచి, ట్రేను కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి. (విజిల్‌ పెట్టకూడదు) ∙సుమారు అరగంటసేపయ్యాక తీసేయాలి ∙చల్లారాక బయటకు తీసి అందించాలి.


క్యారెట్‌ కేక్‌
కావాల్సినవి: మైదా – 2 కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయపొడి – చిటికెడు, వెన్న – కప్పు, పంచదార పొడి – కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ – ఒక టిన్ను (500 మి.లీ), వెనీలా ఎసెన్స్‌ – అర టీ స్పూన్, క్యారెట్‌ తురుము – ఒకటిన్నర కప్పు, డ్రై ఫ్రూట్స్‌ (బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, కిస్‌మిస్‌) – అర కప్పు, పాలు – అర కప్పు

తయారి:  మైదా, బేకింగ్‌ పౌడర్, సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, జాజికాయపొడి కలిపి జల్లించాలి ∙వెన్న, పంచదారపొడి, కండెన్స్‌డ్‌ మిల్క్, వెనిలా ఎసెన్స్‌ వేసి నురగ వచ్చేలా గిలకొట్టాలి ∙ఇందులో జల్లించిన మైదా మిశ్రమం, క్యారెట్‌ తురుము, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్‌ వేసి కలపాలి  పిండి గట్టిగా ఉంటే, కొద్దిగా పాలు పోసి కలపాలి. కేక్‌ టిన్ను లోపల ఫాయిల్‌ పేపర్‌ పరిచి, కేకు మిశ్రమం వేసి గరిటెతో, లేదంటే చేతితో టిన్ను లోపల అంతా సర్దాలి ∙ప్రెజర్‌ కుకర్‌లో కింద ఉప్పు వేసి, దాని మీద వైర్‌ స్టాండ్, పెర్ఫరేట్‌ ప్లేట్‌ ఉంచి మూతపెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙ముందుగా తయారు చేసుకున్న కేక్‌ టిన్నును కుకర్‌లో ఉంచి మూత పెట్టి (విజిల్‌ పెట్టకూడదు) సన్నని మంట మీద సుమారు అరగంటసేపు ఉంచాలి. (పుల్లతో గుచ్చితే పూర్తిగా తయారయినదీ లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి కాలేదనిపిస్తే మరి కాసేపు స్టౌ మీద ఉంచాలి) ∙పూర్తయిన తర్వాత బయటకు తీసి, అంచుల మీదుగా చాకుతో కట్‌ చేస్తూ కేక్‌ను బయటకు తీసి, పైన పంచదార పొడిని చల్లితే బాగుంటుంది.

ప్రెజర్‌ కుకర్‌ కేక్‌...
అవెన్‌ లేకుండా ప్రెజర్‌ కుకర్‌లోనూ కేక్‌ తయారు చేసుకోవచ్చు. కుకర్‌ అడుగున కేజీ ఉప్పు లేదా ఇసుక పోయాలి. దీని పైన ఒక కుకర్‌ బాటమ్‌ ప్లేట్‌ ఉంచాలి. మంట పూర్తిగా తగ్గించి, కుకర్‌ని వేడి చేయాలి. కుకర్‌లో చిన్న స్టాండ్‌ పెట్టి, సులువుగా పట్టేటంత మరొక గిన్నె తీసుకొని కేక్‌ మిశ్రమం పోయాలి. కేక్‌మిశ్రమం ఉన్న గిన్నెను కుకర్‌లో జాగ్రత్తగా ఉంచాలి. పైన వెయిట్‌ పెట్టకుండా కుకర్‌మూత ఉంచాలి. (వెయిట్‌ పెడితే కుకర్‌ పేలే ప్రమాదం ఉంటుంది.) సన్నని మంట మీద 30–35 నిమిషాలు కేక్‌ను బేక్‌ చేసి, మంట తీసేయాలి. కుకర్‌ వేడి పూర్తిగా తగ్గేంత వరకు ఉంచి, కేక్‌ గిన్నెను బయటకు తీయాలి. తర్వాత నచ్చిన విధంగా అలంకరించుకోవాలి.

మరిన్ని వార్తలు