ఘన జీవామృతం చేద్దామిలా!

5 May, 2020 06:12 IST|Sakshi

ప్రకృతి వ్యవసాయానికి ఘన జీవామృతం, ద్రవ జీవామృతం పట్టుగొమ్మలు. ఆవు పేడ, మూత్రం, పప్పుల పిండి, బెల్లంలతో ద్రవ జీవా మృతాన్ని ప్రతి   15 రోజులకోసారి తయారు చేసుకొని వాడే రైతులు ఘన జీవా మృతాన్ని అనుకూలమైన ఎండాకాలంలో తయారు చేసుకుంటారు. భూసారం పెంపుదలలో పశువుల ఎరువు, వర్మీ కంపోస్టులకు ఇది చక్కని ప్రత్యామ్నాయం. ఎకరానికి ఏటా 400 కిలోలు వేస్తే చాలు.

ఘన జీవామృతాన్ని దుక్కిలో వేసుకోవడంతోపాటు.. నిల్వ చేసుకొని కొద్ది నెలల తర్వాత కూడా అవసరాన్ని బట్టి పంటలకు వేస్తూ ఉంటారు. ఖరీఫ్‌ వ్యవసాయ సీజన్‌కు సమాయత్తమవుతున్న ప్రకృతి వ్యవసాయదారులు ప్రస్తుతం ఘన జీవామృతాన్ని తయారు చేసుకోవడంలో నిమగ్నమవుతున్నారు. ఘన జీవామృతాన్ని రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఏపీ కమ్యూనిటీ మానేజ్డ్‌ ప్రకృతి వ్యవసాయ విభాగం విజయనగరం జిల్లా అధికారి ప్రకాశ్‌ (88866 13741) అందించిన వివరాలు..

ఘన జీవామృతం –1
తయారీకి కావాల్సిన పదార్థాలు :
దేశీ ఆవు పేడ (వారం రోజుల్లో సేకరించినది) 100 కిలోలు, దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు, ద్విదళ పప్పుల (శనగ, ఉలవ, పెసర, మినుముల పిండి.. ఈ పిండ్లన్నీ కలిపైనా లేదా ఏదో ఒక రమైనా సరే పర్వాలేదు. అయితే, నూనె శాతం ఎక్కువగా ఉండే వేరుశనగ, సోయాచిక్కుళ్ల పిండి వాడరాదు) పిండి 2 కేజీలు, బెల్లం 2 కేజీలు (నల్లబెల్లం అయితే మరీ మంచిది) లేదా చెరకు రసం 3 లీటర్లు లేదా తాటి పండ్ల గుజ్జు తగినంత, పిడికెడు పుట్టమట్టి లేదా రసాయనాలు తగలని పొలం గట్టు మన్ను.

తయారు చేసే విధానం :

చెట్టు నీడలో లేదా షెడ్డులో ఈ పదార్థాలన్నిటినీ వేసి చేతితో బాగా కలిపి, 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది. తయారు చేసిన వారం రోజుల్లో పొలంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. నిల్వ చేసుకొని తదనంతరం వాడుకోవాలనుకుంటే.. దినుసులన్నీ కలిపిన వెంటనే గుండ్రటి ఉండలుగా చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ ఉండలను గోనె సంచులలో నిల్వ ఉంచుకోవాలి. సీజన్లో అవసరమైనప్పుడు ఉండలను పొడిగా చేసుకొని పొలంలో వెదజల్లుకోవాలి.

ఘన జీవామృతం – 2
తయారీకి కావాల్సిన పదార్థాలు : 200 బాగా చివికిన పశువుల పేడ ఎరువు, 20 లీటర్ల ద్రవ జీవామృతం.
తయారు చేసే విధానం :  200 కేజీలు బాగా చివికిన పశువుల పేడ ఎరువును చెట్టు నీడలో లేదా షెడ్డులో పలుచగా పరవాలి. దానిపై 20 లీటర్ల ద్రవ జీవామృతాన్ని చల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి, గోనె పట్టా కప్పాలి. 48 గంటలు గడచిన తర్వాత దీన్ని పలుచగా చేసి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తరువాత గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి. పంటలకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఘన జీవామృతం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది.

 ఎకరానికి ఎంత?

ఘన జీవామృతాన్ని ఈ రెంటిలో ఏ పద్ధతిలో తయారు చేసినప్పటికీ.. ఎకరానికి దుక్కిలో కనీసం 400 కిలోల ఘన జీవామృతం వేసుకోవాలి. దానితోపాటు.. పైపాటుగా ఎకరానికి కనీసం మరో 200 కిలోలు వేసుకోగలిగితే మంచిది. పంటలకు పోషకాల లోపం లేకుండా మంచి దిగుబడులు పొందవచ్చు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు