సాంబారు రుచిగా రావాలంటే ...

6 Oct, 2018 00:47 IST|Sakshi

సురుచి 

సాంబారు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది తమిళనాడు సాంబారు. వాళ్లకి సాంబారు లేనిదే వంట లేదు. అసలు సాంబారును ఇష్టపడని వారే ఉండరు. సాంబారును చాలా రకాలుగా చేస్తారు. సాంబారులో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. 

కావలసినవి: కంది పప్పు – ఒక కప్పు; చింత పండు – 10 గ్రా. (నీళ్లలో నానబెట్టి రసం తీయాలి); టొమాటో తరుగు – అర కప్పు; బెండ కాయ ముక్కలు – అర కప్పు; వంకాయ ముక్కలు – పావు కప్పు; సొరకాయ ముక్కలు పెద్ద సైజువి – ఆరు; మునగ కాడ ముక్కలు  – 4 ; ఉల్లి తరుగు – అర కప్పు; మిరప కారం – కొద్దిగా; పసుపు – చిటికెడు; బెల్లం పొడి – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – నాలుగు (నిలువుగా కట్‌ చేయాలి); కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; నూనె – తగినంత

సాంబారు పొడికి కావలసిన పదార్థాలు:
ధనియాలు – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పచ్చి సెగన పప్పు, మినప్పప్పు – 6 టీ స్పూన్లు చొప్పున; ఆవాలు, జీలకర్ర – ఒక టీ స్పూను చొప్పున; ఎండు మిర్చి – 6; ఇంగువ – చిటికెడు

తయారీ: కందిపప్పుని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు, ఒక టీ స్పూను నూనె జత చేసి కుకర్‌లో ఉడికించాలి. మరొక గిన్నెలో తరిగిన కూరగాయ ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి మూత పెట్టాలి.ముక్కలు మెత్తగా ఉడికిన తరవాత, ఉడకబెట్టిన కందిపప్పును మెత్తగా మెదిపి ముక్కలలో వేయాలి. చిక్కగా తీసిన చింతపండు రసం, మిరప కారం, చిటికెడు పసుపు, చిన్న బెల్లం ముక్క వేసి, మరిగించాలి. వేరొక పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె లేకుండా ఎండు మిర్చి వేసి వేగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి దోరగా వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని సాంబారులో వేసి బాగా కలిపి మరిగించాలి. వేరే బాణలిని స్టౌ మీద పెట్టి, రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక, చిటికెడు ఇంగువ వేసి కలపాలి. ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. పోపు దినుసులు వేసి వేయించాలి. చివరగా కరివేపాకు వేసి వేయించాక, రెండు గరిటెల మరుగుతున్న సాంబారును పోపులో పోసి, బాగా కలిపి మూత పెట్టి మరిగించాలి. ఆ తరవాత  సాంబారు గిన్నెలో పోసి కలపాలి. కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి.
– ఎన్‌. కల్యాణ్‌ సిద్ధార్థ్‌

మరిన్ని వార్తలు