ఎనిమిదో వింత... ఎంత?

18 Jan, 2014 00:21 IST|Sakshi

నిధి కావాలా?

చిన్న వయసు నుంచే మొదలెడితే చక్రవడ్డీతో ఎంతో లాభం
 అతితక్కువ మొత్తంతో భారీ రిటైర్మెంట్ నిధి
 అప్పుడే ఉద్యోగులైన యువతకూ ఇదో చక్కని దారి
 
 25వ ఏడాది         32వ                   39వ              46వ             53వ              60వ
 1,00,000        2,00,000           4,00,000     8,00,000     16,00,000      32,00,000
 
 ఓ చిన్న కథ. దాన్లో ఓ మహారాజు. ముందూవెనకా చూడకుండా వరాలిస్తుంటాడు. తనను చదరంగంలో ఓడించిన మంత్రిని  ఏం కావాలో కోరుకోమన్నాడు. తగిన పాఠం నేర్పాలనుకున్నాడు మంత్రి. ‘‘మహారాజా! చదరంగంలో 64 గడులున్నాయి కదా!!. మొదటి గడిలో రూపాయి పెట్టండి. రెండో గడిలో రెండ్రూపాయలు.  మూడో గడిలో 4. అలా... రెట్టిస్తూ వెళ్లండి. అది చాలు’’ అన్నాడు మంత్రి. ‘మరీ ఇంత చిన్న కోరికా?’ అనుకున్నాడు మహారాజు. కోశాధికారిని పిలిచి గడుల్లో డబ్బు పెట్టమన్నాడు.

 ఇంతలో మంత్రి మరో డిస్కౌంటిచ్చాడు. ‘‘రాజా! నాకు 64వ గడిలోని మొత్తం మాత్రం చాలు. మిగిలింది అక్కర్లేదు’’ అన్నాడు. రాజు నవ్వాడు. కాసేపటికే కోశాధికారి ఆందోళనగా వచ్చాడు. ఏమైందన్నాడు రాజు. రాజా! మంత్రిగారి కోరిక తీర్చటం అసాధ్యం. ఎందుకంటే 64వ గడిలో 92వేల కోట్ల కోట్లు పెట్టాలి. మన రాజ్యం మొత్తమ్మీద అంత డబ్బులేదు’’ అన్నాడు కోశాధికారి. షాకైన రాజు.. అదెలా సాధ్యమన్నాడు. అదే చక్రవడ్డీ మహత్యమంటూ నవ్వాడు మంత్రి.

 మన చక్రవడ్డీయే ఇంగ్లీషులో కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్‌మెంట్ గురుగా పేర్కొనే వారెన్ బఫెట్ దీన్ని ‘‘ప్రపంచ వింతల్లో ఎనిమిదోది’’ అని వర్ణించారంటే దీని సత్తా తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. మరీ మంత్రి చెప్పినంత మొత్తం కాకపోయినా... ప్రణాళికతో ముందుకెళితే మనమూ మన పొదుపుపై చక్రవడ్డీ లాభాలు అందుకోవచ్చు. అతితక్కువ మొత్తంతో భారీ నిధిని సమీకరించుకోవచ్చు కూడా. అదెలా చేయవచ్చో చెప్పేదే ఈ కథనం.

 ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి వదిలేసినా...
 ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే... పోస్టాఫీసు పొదుపు పథకాల్లో గానీ, ఇతర డిపాజిట్ పథకాల్లో గానీ సొమ్మును మదుపు చేస్తే ఇంచుమించు ఏడేళ్లలో అది రెట్టింపవుతోంది. రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లుగా పరిగణనలోకి తీసుకుంటే... పిల్లల పేరిట వారి తొలి ఏడాది నుంచీ పొదుపు మొదలుపెడితే 60 ఏళ్ల లోపు దాదాపు 9 సార్లు ఆ మొత్తం రెట్టింపవుతుంది.

 (అదెలాగన్నది పై గ్రాఫిక్‌లో చూడొచ్చు...)
 అంటే పుట్టిన బిడ్డ పేరిట తొలి ఏడాదిలో వెయ్యి రూపాయలు పొదుపు చేసి వదిలేస్తే... ఆ బిడ్డకు 56 ఏళ్ల వయసొచ్చేసరికి అది ఏకంగా రూ.2,56,000 అవుతుంది!!. అదీ చక్రవడ్డీ మహిమ. ఒకవేళ అదే బిడ్డ పేరిట ఏడాదికి రూ.1000 చొప్పున తొలి పదేళ్లూ ఇలాంటి పోస్టాఫీస్ సర్టిఫికెట్లలో ఇన్వెస్ట్ చేసి... రెట్టింపయ్యాక తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకోండి. ఆ 10వేలకు గాను తనకు 65 ఏళ్లు వచ్చేసరికి చేతికొచ్చేదెంతో తెలుసా? సాక్షాత్తూ రూ.25,60,000. పాతిక లక్షలంటే దాదాపు రిటైర్మెంట్ నిధి ఏర్పడినట్లే కదా?

 ఉద్యోగులకూ భవిష్య నిధి...
 మేం పుట్టగానే మా పేరిట తల్లిదండ్రులు కదా పొదుపు చేయాల్సింది! వాళ్లు చేయకపోతే మేమేం చెయ్యాలి? అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పొదుపుపై అవగాహన లేకపోవటమో, ధీమా వల్లనో, చిన్న వయసు నుంచే పొదుపు మొదలుపెడితే వచ్చే లాభాలు తెలియకపోవటం వల్లో చాలామంది ఇలాంటి పథకాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.

అలాంటి సందర్భాల్లో ఉద్యోగం సంపాదించుకున్న వెంటనే యువత కూడా ఇలాంటి పథకాలవైపు చూడొచ్చు. ఎందుకంటే 25 ఏళ్ల వయసులో పొదుపు మొదలెట్టినా 60 ఏళ్లు వచ్చేసరికి దాదాపు 5 సార్లు రెట్టింపయ్యే అవకాశం వస్తుంది. పెపైచ్చు ఉద్యోగం వచ్చాక అంటే... వారిలో పొదుపు చేయగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆరంభం నుంచే కాస్త ఎక్కువ మొత్తాన్ని చేయొచ్చు. అదెలాగన్నది కింది పట్టికలో వివరంగా చూడొచ్చు.

 ఈ లెక్కన చూస్తే... 25వ సంవత్సరంలో లక్ష రూపాయలు పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి అది రూ.32 లక్షలవుతోంది. అంటే 25 ఏళ్ల వ్యక్తి వరసగా ఐదేళ్లపాటు రూ.లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ సమయానికి దాదాపు కోటిన్నర నిధి సమకూరుతుందన్న మాట. ఒకవేళ క్రమం తప్పకుండా నెలకు రూ.వెయ్యి చొప్పునో, ఏడాదికి రూ.10వేల చొప్పునో చివరిదాకా ఇన్వెస్ట్ చేస్తే...? వారికి నిజంగానే నిధి దొరుకుతుంది. చక్రవడ్డీ ఇచ్చే నిధి.

మరిన్ని వార్తలు