ప్రేమలో పడితే...

17 Nov, 2018 18:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమలో పడటం, ప్రేమలో ఉండటం ఓ అందమైన అనుభూతి. ప్రేమను ఇవ్వడంలో, ప్రేమను పొందడంలో ఉండే ఆనందం ప్రేమికులకు మాత్రమే తెలుస్తుంది. అతడు లేదా ఆమె ప్రేమలో పడితే వారి జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని తాజాగా చేసిన ఓ సర్వేలో వెల్లడయింది.

ఆనందంగా ఉంటారు...
కిన్సే ఇన్‌స్టిట్యూట్‌ వారు జరిపిన ఓ అధ్యయనం ప్రకారం, ప్రేమలో ఉన్న వారి స్థితి కొకైన్‌ తీసుకున్నవారిలాగే ఉంటుందని తేలింది. అధిక శాతంలో డోపమైన్‌ అనే హార్మోన్‌ రిలీజ్‌ కావడమే దీనికి కారణమని వారు అభిప్రాయపడ్డారు. డోపమైన్‌ విడుదలతో ప్రేమలో ఉన్నవారు, ప్రేమలో లేని వారికంటే అధిక ఆనందంగా ఉంటారు.

పార్టనర్‌నీ ఆనందంగా ఉంచుతారు...
షేరింగ్‌ ఈజ్‌ కేరింగ్‌ అనే సామెతను అనుసరించి తమ పార్ట్‌నర్‌ని కూడా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. తాము ఆనందంగా ఉన్నామన్న విషయాన్ని భాగస్వామితో పంచుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిని ఆనందంగా ఉంచాలన్న ఆలోచన వల్ల ఎక్కువగా వారి గురించే ఆలోచిస్తూ మరింత సంతోషాన్ని పొందుతారు.

ఒత్తిడి తగ్గుతుంది...
స్టాన్‌ఫోర్డ్‌ మెడికల్‌ యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనం ప్రకారం ప్రేమలో ఉన్నవారు ఎక్కువ నొప్పిని, ఒత్తిడిని భరించగలరు. అంటే ప్రేమలో లేనప్పటికంటే, ప్రేమలో పడ్డాక తమ విషయాలను షేర్‌ చేసుకునే వారు దొరకడంతో కష్టాలను పంచుకోవడం ద్వారా నొప్పిని తగ్గించుకోగలరు.

గుండె వేగం మారుతుంది...
కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనం ప్రేమలో పడ్డాక ఇద్దరి గుండె వేగాలు ఒకేలా మారతాయని తెలిపింది. ఇది కేవలం వేగానికే పరిమితం కాకుండా, కొంత కాలం గడిచేసరికి ఇద్దరి అభిరుచులు సైతం ఒకేలా మారతాయి.

ప్రయోగాత్మకంగా మారతారు..
ప్రేమలో పడ్డాక తమను తాము మార్చుకోవడానికి ప్రేరణ పొందుతారు. గతంలో లేని అలవాట్లను కొత్తగా ప్రారంభిస్తారు. కొత్త హెయిర్‌ స్టైల్స్‌ను, కొత్త ఆహార్యాన్ని అలవర్చుకుంటారు. తమ శరీర సౌష్ఠవం మీదా, మెదిలే తీరు మీదా కసరత్తులు చేసి హుందాగా తయారవుతారు.

మీరు ప్రేమలో పడ్డారా ? పడ్డాక మీలో ఏమైనా మార్పులు కనిపించాయా ? బాగా పరిశీలించుకోండి మరి.

మరిన్ని వార్తలు