పిల్లలను పెంచడమెలాగో తెలుసా !

8 Nov, 2018 13:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: మీరెప్పుడైనా పిల్లలు ఎందుకు కార్టూన్స్‌ను అంతగా ఇష్టపడతారో ఆలోచించారా ? కార్టూన్స్‌ ఎందుకు అంత వేగంగా కదులుతాయో గమనించారా ? పిల్లల్లో ఆస​క్తిని పెంచేందుకే అవి అలా తయారు చేస్తారు. అలాగే పిల్లలకు ఏదైనా నేర్పించాలంటే తల్లిదండ్రులు కూడా అంతే వేగంగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెంచడం ద్వారా పిల్లలను ఉత్తమ పౌరులుగా మలచవచ్చు. 

ఇదో బాధ్యత...
పిల్లలను పెంచడమనేది సమాజానికి గొప్ప వ్యక్తులను అందించే గొప్ప బాధ్యత. వారిని నిరంతరం ఉత్సాహంగా ఉండేలా చేయడం ద్వారా పెరిగే కొద్దీ కొత్త అంశాలను తెలుసుకోవాలనే తపనను పెంచవచ్చు. అయితే కేవలం చెప్పింది వినడం ద్వారా మాత్రమే కాక పిల్లలు తాము చూసే విషయాల నుంచి కూడా ఎంతో నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కింది విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తు‍న్నారు. 

ప్రేమతో పెంచడం...
చిన్న వయసులో తల్లిదండ్రులు చూపించే ప్రేమను పిల్లలు జీవితాంతం గుర్తుంచుకుంటారు. ప్రేమ అంటే క్షమించడమే అని వారికి నేర్పించాలి. తెలిసీతెలియక ఏదైనా తప్పు చేసినపుడు ప్రేమతో మందలించి క్షమిస్తు‍న్నానని చెప్పాలి. స్కూల్లో తమ మిత్రులతో గొడవ జరిగాక, వారు ‘సారీ’ చెబితే క్షమిస్తున్నాను అని చెప్పేలా వారిని ప్రోత్సాహించాలి. భార్యాభర్తలు పిల్లల ముందు గొడవపడకూడదు. 

ధైర్యాన్నివ్వాలి....
జీవితంలో ధైర్యంగా ఉండటం చాలా అవసరం. ఎదిగేకొద్దీ గెలుపోటములు సహజమని వాటికి నిరాశ చెందకూడదని తెలియజెప్పాలి. నిర్మాణాత్మక ధోరణిని వారిలో పెంచాలి. పదే పదే ఎందుకు విఫలమవుతున్నారో పరిశీలించుకొనే ధోరణి అలవాటు చేయాలి. అదే సమయంలో గర్వాన్ని పెంచుకోకుండా ఉండాలని వివరించాలి. మంచి పని చేసిన ప్రతిసారీ ప్రశంసించాలి. సమస్యలు ఎదురైనపుడు తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అలా ఉండడమే నేర్చుకుంటారని మానసిక నిపుణులు అంటున్నారు.

ఓపికను నేర్పాలి...
జీవితంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యలను ఎదుర్కోవడానికి ఓపిక అవసరమవుతుంది. కనుక పలు సందర్భాల్లో ఓపికగా ఎలా ఉండాలో అనుభవపూర్వకంగా చెబుతూ నేర్పించాలి. వరుస వైఫల్యాల సమయంలో ఓపిక కలిగి ఉంటే, తర్వాత విజయతీరాలకు చేరతారని తెలియజేయాలి. అలాగే పిల్లలు చెప్పే విషయాలను తల్లిదండ్రులు ఓపికగా వినాలి. వారి ప్రశ్నలకు నిదానంగా అర్థమ‍‍య్యేలా జవాబు చెప్పాలి. వారు చెప్పేది ఎంత చిన్న విషయం అయినప్పటికీ ఆసక్తిగా వినడం వల్ల వారు కూడా ఆ లక్షణాన్ని పాటించడం నేర్చుకుంటారు. 

నిర్ణయాలు తీసుకోవడం నేర్పించాలి..
నిర్ణయాలను తీసుకునే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా వారిని బాధ్యతాయుతులుగా తీర్చిదిద్దవచ్చు. తల్లిదండ్రుల సమక్షంలోనే నిర్ణయాలు తీసుకునేలా చేస్తే వారు ఒత్తిడికి లోనవ్వకుండా చూడవచ్చు. వారు తీసుకునే నిర్ణయం వల్ల జరిగే లాభాలను, నష్టాలను బేరీజు వేసి చెప్పడం ద్వారా లోతుగా ఆలోచించడం నేర్చుకుంటారు. 

తరచుగా మాట్లాడాలి...
ప్రతీరోజూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారితో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. రోజంతా ఎలా గడచిందని అడగాలి. ఆ రోజు వారు సాధించిన విజయాలను తెలుసుకొని అభినందించాలి. అలాగే చేయలేకపోయిన అంశాలను కూడా తెలుసుకొని దానిని ఎలా అధిగమించాలో సూచనలు చేయాలి. తప్పు చేసినపుడు సున్నితంగా మందలిస్తూనే వారికి అండగా ఉన్నామన్న ధైర్యాన్ని కలిగించాలి. 

తల్లిదండ్రులు ఈ విషయాలన్నింటినీ అమలుచేయడం ద్వారా పిల్లలను ఉన్నత స్థాయికి వెళ్లేలా చేయవచ్చు. సమాజానికి అవసరమైన ఉత్తమ పౌరులుగా వాళ్లు నిలబడతారు.

మరిన్ని వార్తలు